– మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ధ్వజం
తాడేపల్లి: రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ రంగం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, ఒకవైపు వరసగా ప్రకృతి వైపరీత్యాలు.. మరోవైపు ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సహాయం అందక రైతులు విలవిల్లాడుతున్నారని అవనిగడ్డ వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ నియోజకవర్గం వైయస్సార్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు వెల్లడించారు. ఈ సీజన్లో రాష్ట్రంలో 83 లక్షల టన్నుల ధాన్యం పండుతుందని అంచనా కాగా, దాంట్లో 51లక్షల టన్నుల ధాన్యం కొనడానికి సిద్దంగా ఉన్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నెల రోజుల నుంచి చెబుతున్నా, ఎక్కడా అది కనీసం కార్యరూపం దాల్చడం లేదని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు మరో తుపాన్ దూసుకొస్తున్నా, కనీస ముందుజాగ్రత్త చర్యలు లేవని, చాలా చోట్ల ధాన్యం కళ్ళాల్లోనే ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు ఆరా తీసి, వాటిని ప్రస్తావిస్తే, తమను, తమ పార్టీని దారుణంగా నిందిస్తున్నారని ౖవైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఆక్షేపించారు. : 1318 నెంబర్ ధాన్యం అసలు కొనుగోలు చేయట్లేదు. ఆ బ్రీడ్‌ను మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి ప్రభుత్వమే సరఫరా చేసింది. అయినా సరే, కొనమంటే కొనే పరిస్థితి లేదు.
ఇప్పుడు పండించే పంట అంతా విత్తనాలకే తప్ప తినడానికి పనికి రావని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు మాూట్లాడుతున్నారు. అవి ప్రభుత్వం సరఫరా చేసినవే. వాస్తవానికి బీపీటీలు, 2716 రకం ధాన్యం అంతా కూడా తినడానికి పనికి వచ్చేవే. తుఫాన్లు వచ్చినప్పుడు, అత్యవసర కోతలప్పుడు డ్రయర్ ఉన్న మిల్లుకే ధాన్యం తరలిస్తారు. అదే గోదావరి జిల్లాలో ప్రతి మిల్లుకు బాయిలర్లు ఉన్నాయి. వాటి కెపాసిటీ ఎక్కువ. కాబట్టి అక్కడి వారితో మాట్లాడి, «మిల్లర్లతో కూర్చొని ధాన్యం కొనమంటే రైతులకు ఈ బాధ వచ్చేది కాదు.