– నా అంతు చూస్తావా? ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నా..దమ్ముంటే రా
– మునిసిపల్ ఆఫీసులో సీసీ కెమెరాలు పెట్టే అధికారం నీకెవరిచ్చారు?
– ఆర్మూర్ నీ అయ్య జాగీరా? ఇక నీ ఆటలు సాగవు జాగ్రత్త
– నీ సీఎంకే భయపడను.. నువ్వెంత? నన్ను అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో
– పీవీఆర్ వసూళ్ల దందా పై ప్రజలు తిరగబడాలి
– బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్
ఆర్మూరు: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి (పీవీఆర్)బెదిరింపులకు తాను భయపడనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పీ–అంటే పైసా, వీ అంటే వసూలు ,ఆర్ అంటే–రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. ఇది పీవీఆర్ క్రైమ్ నెం-2 అని , మున్సిపల్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరీ పీవీఆర్ సరికొత్త అవినీతికి తెరలేపారని పలువురు తన జనతా గ్యారేజ్ లో పిర్యాదు చేశారన్నారు.
దీంతో తాను బుధ వారం ఆర్మూర్ మున్సిపల్ ఆఫీసుకు వచ్చి పరిశీలిస్తే పీవీఆర్ ఏర్పాటు చేసిన వాయిస్ రికార్డింగ్ సీసీ కెమెరాలు కనిపించాయని జీవన్ రెడ్డి మండిపడ్డారు. నమస్తే ఆర్మూర్-జనతా గ్యారేజ్ కార్యక్రమంలో భాగంగా పీవీ ఆర్ క్రైమ్ నెం-2గా అవినీతి భాగోతం చూపించడానికి ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా పర్యటించిన తనతో అనేక మంది బాధితులు మాట్లాడి వినయ్ కుమార్ రెడ్డి ధనధాహం గురించి కధలు కథలుగా చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. తనను ఉద్దేశించి వినయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి భగ్గుమన్నారు. ’నా అంతు చూస్తావా? ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నా..దమ్ముంటే రా“ . చూసుకుందాం అంటూ జీవన్ రెడ్డి సవాల్ చేశారు.
సమాచార హక్కు చట్టం ప్రకారం తెప్పించిన అన్ని ఆధారాలతో తాను పీవీఅర్ పై నిర్దిష్టమైన ఆరోపణలు చేశానని, వాటికి పీవీఆర్ సూటిగా జవాబు చెప్పకుండా నాపై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గు చేటు అని ఆయన నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరెంధర్,మాజీ కౌన్సిలర్ చక్రు సీనియర్ నాయకులు పోల సుధాకర్,రాజేశ్వర్ రెడ్డి,సుంకరి రవి,శ్యామ్,పృథ్వి, మీర శ్రావణ్,మహేష్,అజీమ్,మాలిక్ బాబా,అర్షద్,లతీఫ్,సైఫ్ తదితరులు పాల్గొన్నారు.