– కొన్ని కారణాలు
– సమాచారం ప్రకారం అలా జరిగింది
– అప్పట్లో నా వైఖరి పొరపాటు అని ఒప్పుకోలు
– ఇక మీపై నా వైఖరి ఎలా ఉంటుందో మీరే చూస్తారు
– నన్ను నమ్మండి. నేను ఒకసారి మాట ఇచ్చానంటే తప్పను అని మీకు తెలుసు
– విజయవాడ, హైదరాబాదుకు చెందిన కమ్మ కాంట్రాక్టర్లు
– వ్యాపారులతో వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యలు
– నాకేమీ ఏఎంఆర్ తో మొహమాటం లేదు
– కానీ మైనింగ్ వ్యాపారులంతా కమ్మవారే కదా?
– వారికి నొప్పి తగిలి రోడ్డు ఎక్కనియ్యండి
– మన పాలనే బాగుందని వాళ్ళు ఇంట్లో కూర్చుని ప్రభుత్వాన్ని తిట్టుకుంటే ఏం లాభం ?
– రోడ్ ఎక్కిన తర్వాత వారికి తప్పకుండా మద్దతునిద్దాం
– ప్రకాశం జిల్లా కమ్మ మైనింగ్ వ్యాపారులు, అద్దంకి వైసీపీ ఇన్చార్జితో జగన్ వ్యాఖ్యలు
– ‘సూర్య’ కు ప్రత్యేకం
( మార్తి సుబ్రహ్మణ్యం)
అధికారంలో ఉన్న ఐదేళ్లు కమ్మ వర్గాన్ని వేధించి.. వారిని దూరం పెట్టిన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ , ఇప్పుడు అందుకు పశ్చాత్తాపం చెందుతున్నారా? ఇటీవలి కాలంలో జరిగిన రెండు కీలక భేటీలలో , ఆ మేరకు ఆయన ప్రస్తావించిన అంశాలు అలాంటి పశ్చాత్తాప సంకేతాలు ఇస్తున్నాయా? ఆసక్తి కలిగించే ఆ రెండు సందర్భాలేమిటో చూద్దాం.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.. వైసీపీ అధినేత జగన్, ఇటీవల కాలంలో కమ్మ సామాజిక వర్గ ప్రముఖులతో రెండు సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సమావేశాలకు కమ్మ వర్గ ప్రముఖులే చొరవ తీసుకొని జగన్ వద్దకు వెళ్లారా? లేక జగన్ తన పార్టీలోని కమ్మనేతలతో ,ఆ సమావేశాన్ని నిర్వహించారా? అన్నదానిపై స్పష్టత -సమాచారం లేదు.
ఆ ప్రకారంగా.. రెండు నెలల క్రితం హైదరాబాద్- విజయవాడకు చెందిన కొందరు కమ్మ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ , బడా బిల్డర్లు, వ్యాపార ప్రముఖులు సుమారు 20 మంది ..జగన్ ను తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిశారు. అందులో పాల్గొన్న కమ్మ ప్రముఖులు.. గత ఐదేళ్లు మీ వల్ల తమ వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయని ..ఆర్థికంగా నష్టపోయి, ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని కొండ బద్దలు కొట్టారట.
ఈ విషయంలో వారు జగన్ కు వాస్తవాలు చెప్పేందుకు ఏమాత్రం భయపడలేదట. పోనీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నైనా తమకు ఉపయోగం ఉంటుందని భావిస్తే, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న ఐదారుగురు కమ్మ కంపెనీలకు తప్ప, ఎవరికీ ఉపయోగపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారట. ఈ రకంగా రెండు ప్రభుత్వాల్లో తాము తీవ్రంగా నష్టపోయామని జగన్ కు వివరించారట.
అన్ని విని, దానికి స్పందించిన జగన్..’ అప్పట్లో కొన్ని కారణాలు, తమకు వచ్చిన సమాచారం ఆధారంగా మీ పట్ల వ్యతిరేకంగా వ్యవహరించాల్సి వచ్చింది. అది పొరపాటే. ఇకపై నేను మీ సామాజిక వర్గం పట్ల ఎలా వ్యవహరిస్తానో మీరే చూస్తారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు మీ పట్ల నా వైఖరి ఏమిటన్నది మీకే తెలుస్తుంది. నన్ను నమ్మండి. నేను ఒకసారి మాట ఇచ్చానంటే తప్పను అని మీకు తెలుసు’ అని జగన్ స్పష్టం చేశారట.
ఇక గతవారం జగన్ తాడేపల్లి కి వచ్చినప్పుడు.. అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి తో పాటు, కొందరు కమ్మ వర్గానికి చెందిన మైనింగ్ వ్యాపారులు జగన్ ను కలిశారట. ఆ సందర్భంగా.. నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? జనంలోకి వెళ్లి పని చేయాలని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జికి జగన్ సూచించారు. తమ నియోజకవర్గంలో ప్రస్తుతం ఏఎంఆర్ కంపెనీ వసూలు చేస్తున్న సీనరేజీ సమస్య ఉందని, దానివల్ల వ్యాపారులు- కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అద్దంకి ఇన్చార్జి, పార్టీ అధ్యక్షుడు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఏఎంఆర్ సమస్యపై మీరు ఏం చేయమంటే అదే చేస్తామన్నారు. పక్కనే ఉన్న కమ్మ వర్గానికి చెందిన కొందరు గ్రానైట్ వ్యాపారులు.. మీరు సీఎం గా ఉన్నప్పుడు ఎలాంటి అదనపు వసూళ్లు చేయలేదని ..కానీ ఈ ప్రభుత్వంలో ఏఎంఆర్ చేస్తున్న వసూళ్లతో మా వ్యాపారాలు దెబ్బతిని, మూసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారట. ఇంకా దానికి సంబంధించిన రాజకీయ అంశాలను కూడా జగన్ దృష్టికి తీసుకువెళ్లారట. అన్ని విన్న జగన్..” నాకేమీ ఏఎంఆర్ తో మొహమాటం లేదు. కానీ అక్కడ గ్రానైట్ వ్యాపారాలు చేసే వాళ్లలో 90% కమ్మవాళ్ళే ఉన్నారు కదా? మరి వాళ్లకు ఆ నొప్పి తెలియనీయండి. మనం లేకపోవడం వల్ల వచ్చిన నష్టమేమిటో , అనుభవంలో తెలుసుకొనీయండి.
వాళ్లకు ఆ నొప్పి తగిలి రోడ్డు ఎక్కితే, మనం కచ్చితంగా మద్దతు ఇద్దాం. వాళ్లకు నొప్పి తెలియకుండా మనమే పోరాడటం ఎందుకు? మన ప్రభుత్వంలోనే బాగుంది. వాళ్ల ప్రభుత్వంలో బాగాలేదని వాళ్లంతా ఇంట్లో కూర్చొని తిట్టుకొని , వాళ్లలో వాళ్లు మీటింగులు పెట్టి బాధపడితే ఏం ప్రయోజనం? ఆ విషయాన్ని బయటకు వచ్చి చెప్పనీయండి” అని స్పష్టం చేశారట. కాగా కొద్ది రోజుల క్రితం ఏఎంఆర్ చెక్ పోస్టులను ధ్వంసం చేసిన సందర్భంగా ..జగన్ ప్రభుత్వం లోనే తమకు మేలు జరిగిందంటూ, కమ్మ వర్గానికి చెందిన గ్రానైట్ వ్యాపారులు కొందరు మీడియాకు చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న జగన్.. తన వద్దకు వచ్చిన గ్రానైట్ వ్యాపారులతో, ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.

