– దాదాపు 30 మంది హాస్టల్ పిల్లల దుర్మరణం
– పీఆర్సీ లేదు. ఐఆర్ లేదు. జీపీఎస్కూ మంగళం
– పరకామణి కేసులో, టీటీడీకి ఎంతో ప్రయోజనం
– అయినా దాన్ని తప్పుపడుతూ, నిందిస్తున్నారు
– ఆలయాల్లో శానిటేషన్ వర్క్ కాంట్రాక్ట్ భాస్కర్ నాయుడుకే
– చంద్రబాబు నాయుడు బంధువులు, చంద్రబాబు మనుషులకే ఆ లేబర్ కాంట్రాక్ట్ వర్క్‌లు
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి
అమరావతి: రాష్ట్రంలో పాలన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అన్న రీతిలో సాగుతోంది. ఇండియా ఏపీ వైపు చూడండి అనాల్సిన పరిస్థితిలో పాలన ఉంది.ఇటీవల మొంథా తుపాన్ వచ్చినప్పుడు చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన దత్తపుత్రుడు.. ముగ్గురూ కలిసి ఆర్టీజీఎస్ కార్యాలయానికి వెళ్లి ఏ రకంగా బిల్డప్ ఇచ్చారో చూశాం. వీళ్లకు తోడు వాళ్ల ఎల్లో మీడియా బిల్డప్ చూస్తే.. ఏకంగా వీళ్లే తుపాన్ పీక పట్టుకుని డైవర్ట్ చేసినట్లుగా బిల్డప్ ఇచ్చారు. వీళ్లు అప్పుడు ఆర్టీజీఎస్లో కానీ కూర్చుని ఉండకపోతే ఆ తుపాన్ ఆగేది కాదన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. తుపాన్ కారణంగా నష్టపోయిన ఏ రైతుకు పైసా సాయం కూడా అందలేదు.
దాదాపు 15 లక్షల్లో పంట నష్టం జరిగితే, దాన్ని 4 లక్షల ఎకరాలకు కుదించి చూపారు. చివరకు దానికి పైసా పరిహారం ఇవ్వలేదు. ఇంకా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. ఉచిత పంటల బీమాను కూడా అమలు చేయడం లేదు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరటి, చీనీ రైతులకు మేలు చేసేందుకు ప్రత్యేక రైళ్లను నడిపించాం. అది ఈ ప్రభుత్వంలో ఎందుకు జరగడం లేదు? చంద్రబాబు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా?. చంద్రబాబూ, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? గాడిదలు కాయడానికి కాదు కదా? మీరు రైతులను పట్టించుకోవాలి కదా? చివరకు పులివెందులలో 600 టన్నుల కోల్డ్ స్టోరేజీని మా ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించాం.
అది ఇప్పుడు ఆపరేషన్‌లో లేదు. కారణం కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తుందని కోల్డ్స్టోరేజిని మూసి వేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేలుతున్నాయి. దీంతో రైతుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. సూపర్‌సిక్స్ మొత్తం అమలు చేశారట? దానిపై ప్రకటనలు కూడా జారీ చేశారు. సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అని చెప్పుకుంటున్నారు. గోబెల్స్ ప్రచారానికి చంద్రబాబు టీచర్. నేను చంద్రబాబుగారిని సూటిగా అడుగుతున్నాను.
అసలు సూపర్‌సిక్స్‌లో ఏమేం అమలు చేశారు? నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేల చొప్పున రెండేళ్లకు రూ.72 వేలు ఇవ్వాలి. అసలు ఇచ్చారా?. ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున, రెండేళ్లకు రూ.36 వేలు ఇవ్వాలి. ఇచ్చారా? 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. నెలకు రూ.4 వేల చొప్పున రెండేళ్లకు రూ.96 వేలు ఇవ్వాలి. ఇచ్చారా?. అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది రూ.10 వేలు మాత్రమే. అమ్మ ఒడిలో 30 లక్షల మంది కట్. రెండేళ్లకు కలిపి ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. కానీ, ఇచ్చింది రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే. ఇది మోసం కాదా?. ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు. అలా రెండేళ్లకు 6 సిలిండర్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది కేవలం 3 సిలిండర్లు మాత్రమే. అది మోసం కాదా?. ఉచిత ప్రయాణం అన్నారు. కానీ, కొన్ని బస్సుల్లోనే అనుమతిస్తున్నారు. ఇది మోసం కాదా? ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా అటకెక్కించేశారు.
విద్యార్థులు ఈ రోజు నిజంగా తల్లడిల్లుతున్నారు. జీఈఆర్ రేషియో డ్రాప్ అయింది. స్కూళ్లలో డ్రాపవుట్స్ పెరుగుతున్నాయి. పిల్లలు చదువులు మానేస్తున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు పోయేటప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలందరూ క్యారియర్లు కట్టుకోని పోతున్నారు. దాదాపు ప్రతి పిల్లాడూ క్యారియర్ పెట్టుకుని పోతున్నాడు. ఎందుకు? అని అడగండి. తిండి అస్సలు బాగలేదన్నా, తినలేకపోతున్నాం అనే మాట వస్తోంది. గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది. నాడు–నేడు అన్నది ఆగిపోయింది. స్కూళ్లలో 3వ తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ క్లాసులు నిలిచిపోయాయి. ఇంక ఐబీ కథ దేవుడెరుగు. 8వ తరగతి పిల్లలకు ట్యాబులిచ్చేది పూర్తిగా ఆగిపోయింది. ఈరోజు పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వ హాస్టళ్లలో.. మీరంతా కూడా దీని మీద ధ్యాస పెట్టండి.
ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగు నీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18, 19 నెలల చంద్రబాబు పాలన కాలంలో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయారు. ఇది రికార్డు. ఏయే స్కూళ్లలో చనిపోయారు, ఏయే ఆశ్రమ పాఠశాలలకు చెందిన పిల్లలు అనేది స్లైడ్స్ చూడండి. ఈ ప్రభుత్వానికి ఇంకో మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో ఆస్పత్రుల్లో సేవలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపు నిల్చిపోయాయి. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు రూ.300 కోట్లు అవుతుంది. 18 నెలలకు రూ.5400 కోట్లు. ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం.. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా మాట్లాడి, వాళ్లు కూడా స్ట్రైకులు చేస్తుంటే ఇచ్చింది ఎంత అని చూస్తే రూ.1800 కోట్లు. అంటే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,600 కోట్లు.
దీంతో మొన్న నెట్వర్క్ ఆస్పత్రులన్నీ సమ్మె చేశాయి. సమ్మె దిగిపోయేటప్పుడు వాళ్లకిచ్చిన మాటకు కూడా దిక్కు లేదు. నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 కూడా స్కాముగా మార్చేశారు. రూ.5 కోట్లు నికర టర్నోవర్ లేని సంస్థకు ఇచ్చారు. వాళ్ల తెలుగుదేశం ఆఫీసులో డాక్టర్ల సెల్ అధ్యక్షుడంట. అతడికి ఆ సర్వీసులు అప్పగించారు. కనుక్కోండి మీరే. స్కాము కాకపోతే రాయనన్నా రాయండి. కోటి సంతకాల పత్రాలు ఈనెల 10న అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్ప్లే చేసి చూపించి, అక్కణ్నుంచి జిల్లాలకు పంపడం జరుగుతుంది. 13వ తేదీన జిల్లా కేంద్రాల్లో ర్యాలీ చేసి ప్రజలు చేసిన కోటి సంతకాలకు పైగా పత్రాలు జిల్లా నుంచి పార్టీ సెంట్రల్ ఆఫీస్‌కు బయల్దేరుతాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈ కోటి సంతకాలకు పైగా పత్రాలను తీసుకొని రాష్ట్ర గవర్నర్ కి ఈనెల 16న సమర్పిస్తాం. ఈనెల 16న రాష్ట్ర గవర్నర్ గారికి చెప్పడం, చూపించడం రెండూ చేసిన తరువాత ఈ పత్రాల ద్వారా హైకోర్టులో పిటీషన్ కూడా వేస్తాం.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయనే దానికి ఈ డిసెంబర్ పూర్తయి జనవరి వస్తే.. 5 డీఏలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. డీఏ బకాయిలు రిటైర్మెంట్ అయ్యాక ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుషా చరిత్రలో చూసి ఉండం, ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలో తప్ప. దానికి తగ్గట్టుగా జీవో: 60 ఇచ్చారు. క్లాజ్ 11, 12 చదివితే అర్థం అవుతుంది. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా ఇంత దౌర్భాగ్య (డ్రెకోనియన్) జీవో ఇచ్చి ఉండరు. వెంటనే దీని మీద గొడవలు మొదలయ్యే సరికి, ఉపసంహరించుకొని వాయిదాల్లో ఇస్తామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మెరుగైన పీఆర్సీ ఇంత వరకూ లేదు. ఎన్నికల సమయంలో మెరుగైన పీఆర్సీ అన్నారు. అసలు ఉన్న పీఆర్సీ చైర్మన్‌ను తీసేశారు. ఇప్పటి వరకు చైర్మన్‌ను నియమించలేదు. చైర్మన్‌ను నియమిస్తే.. రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇస్తే వెంటనే అమలు చేయాలి. అది చేస్తే ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందన్న దురుద్దేశంతో పీఆర్సీ చైర్మన్‌ను ఇప్పటి వరకు నియమించలేదు.
మెరుగైన పీఆర్సీ కథ దేవుడెరుగు.. కనీసం పీఆర్సీ చైర్మన్ అపాయింట్ కాలేదు. మెరుగైన పీఆర్సీ ఒక బూటకం. అధికారంలోకి వచ్చిన వెంటనే తాత్కాలిక భృతి (ఐఆర్) అన్నాడు. అదీ లేదు. మేము వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. అధికారంలోకి రాగానే ఉద్యోగుల జీతాలు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక ఐఆర్ లేదు. పీఆర్సీ లేదు. ఓపీఎస్ లేదు. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే.. ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ (గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్) కూడా చెల్లుబాటు కాకుండా చేశాడు. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను ఇప్పుడు దేశమంతా కాపీ కొడుతోంది. కనీసం అదైనా అమలు చేసి ఉంటే దాని బెనిఫిట్స్ రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చి ఉండేది. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్‌లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్ వీటి రూపేణా ఉద్యోగులకు మొత్తం రూ.31 వేల కోట్ల బకాయిలు పడ్డాడు చంద్రబాబు. ఆప్కాస్ ద్వారా ప్రతినెలా 1వ తేదీనే జీతాలిచ్చేట్లుగా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే.. ఆప్కాస్‌లో ఈరోజు ఒకవైపు సంఖ్య తగ్గిస్తున్నారు.
అందరికీ కాంట్రాక్ట్‌లు. ఆలయాల్లో శానిటేషన్ వర్క్ కాంట్రాక్ట్‌లే. వీళ్లకు సంబంధించిన భాస్కర్ నాయుడు. చంద్రబాబు నాయుడు బంధువులు, చంద్రబాబు మనుషులే.. వీళ్లకే ఆ లేబర్ కాంట్రాక్ట్ వర్క్‌లు. ఆప్కాస్‌లో ఒకవైపు నంబర్లు తగ్గిస్తున్నారు. మరోవైపు ఆప్కాస్‌లో 1వ తేదీ జీతం కథ దేవుడెరుగు. ఇప్పుడు జీతాలు రెండు, మూడు నెలలకు ఓసారి ఇస్తున్నారు. గెస్ట్ లెక్చరర్లకు 8 నెలలుగా జీతాలు లేవు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగాం విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా, మా ఐదేళ్ల పాలనలో కాపాడగలిగాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసి, ఈ ప్లాంట్‌కు మంచి జరిగేలా వెంటనే క్యాపిటివ్ మైన్స్ అలాట్ చేయండి అని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం.
అలా మా ఐదేళ్ల పాలనలో ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం. కానీ, చంద్రబాబు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు? నకిలీ మద్యం ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లు పెట్టినవే. ఎక్కడ పడితే అక్కడ వీళ్లు.. వీళ్ల ఎమ్మెల్యే కాండెట్లు, మంత్రులు, వీళ్ల ప్రఖ్యాత, వీళ్ల పలుకుబడి కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలను నడుపుతూ ఉన్న వారి ఫోటోలు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తాయి. ఇది ఇబ్రహీంపట్నంలో, ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కు, చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ కేండిడేట్ ఆయన. ఆయన పేరు జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఇన్చార్జ్ ఫ్రమ్ ములకలచెరువు. ములకలపల్లి మండలం అంటే తంబళ్లపల్లి నియోజకవర్గం. ఆయన జయచంద్రారెడ్డి, కంటెస్టెడ్ కేండిడేట్, తెలుగుదేశం పార్టీ, విత్ చంద్రబాబునాయుడు. బీఫామ్ ఇస్తా.. మళ్లా ఆయన పార్ట్నరూ. ఇంకొక ఆయన జనార్దనరావు వీరంతా. ఇంకొక ఆయన సురేంద్రనాయుడు. చూడు లోకేశ్ గారితో ఫోటో, 1000 ఓల్ట్ బల్బుల్లా మళ్లా.. లిక్కర్ వ్యాపారం పెట్టుకున్నారు కాబట్టి షైన్ కూడా కనబడుతోంది.
ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఆయన పక్కన. ఇది అనకాపల్లి. పరవాడ. ఉత్తరాంధ్ర. నీటుగా ఇదిగో సేమ్ మోడల్ బ్రాండ్ ఇది. లేబుళ్లు, గీబుళ్లు అంతా. ఈయనెవరంటే స్పీకరు. ఆయన పక్కన ఎవరూ అనంటే అయ్యన్నపాత్రుడి సన్నిహితుడు రుత్తుల రాము. చూడు నీట్‌గా ఇద్దరూ బ్రహ్మాండంగా.. ఆ నవ్వులు కూడా చూడండి 1000 ఓల్ట్ బల్బుల మాదిరి నవ్వుతున్నారు. ఇది అమలాపురం. సేమ్ మోడల్ షాపులు. మెషీన్‌తో సహా దొరికారు. కానీ, ఇది పాలకొల్లు.. ఇది ఏలూరు, ఇది రేపల్లె, ఇది నెల్లూరు.. కుటీర పరిశ్రమ మాదిరి ఏకంగా, ప్రతిచోట నడిపిస్తా ఉన్నారు. ఇక్కడే నేను చెప్తా ఉన్నా.. వీరిదే రాష్ట్ర ప్రభుత్వం, కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్రవ్యాప్తంగా పెట్టిందీ వీళ్లే,, వీళ్ల మనుషులే. వీరివే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీరివే బెల్ట్ షాపులు, వీరివే పర్మిట్ రూములు. గమనించండి ఒకసారి. అన్యాయంగా జోగి రమేష్ అరెస్ట్ మా జోగి రమేష్‌ను తీసుకుని పోయినారు పాపం. ఎంత అన్యాయం. నాకు అర్థం కాదు. ములకలచెరువులో జోగి రమేష్ చేయించినాడంట. తీసుకొనిపోయినారు. అది చేసిన వాడు జయచంద్రారెడ్డి అన్నవాడు ఇప్పటివరకు అరెస్ట్ కాలా. ఆయన తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ కేండిడేట్.
వాళ్ల బావమరిది గిరిధర్ రెడ్డి అరెస్ట్ కాలా, వాళ్ల పీఏ రాజేశ్ ఇంతవరకు అరెస్ట్ కాలా. ములకలచెరువులోనూ వీళ్లే, ఇబ్రహీంపట్నంలోనూ వీళ్లే, అనకాపల్లిలోనూ వీళ్లే, అముదాలవలసలోనూ వీళ్లే, ఇంక నేను చెప్పిన, ఇంతకుముందు చెప్పినవి చూసినవా ఈ పేర్లన్నీ,, నెల్లూరు దగ్గర నుంచి, ఏలూరు దగ్గర నుంచి, పాలకొల్లు దగ్గర నుంచి, రేపల్లె దగ్గర నుంచి అంతా ఎవరెవరు చేస్తా ఉన్నారో మీ అందరికీ కూడా కళ్ల ముందే కనిపిస్తా ఉంది. మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు, నాలుగుసార్లు ఎమ్మెల్యే ఆయన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డిని ఒక కేసులో ఇరికించారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు అరెస్టు. ఎక్కడండి న్యాయం. ఎక్కడన్నా న్యాయం ఉందా? ధర్మం ఉందా? అసలు. ట్విస్ట్ చేసి.. తప్పుడు కేసులు పెట్టి..పిన్నెల్లిని ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారు. అంతకు ముందు ఎన్నికల సమయంలో రిగ్గింగ్‌ను అడ్డుకున్నందుకు 54 రోజులు ఇదే రామకృష్ణారెడ్డిని జైల్లో పెట్టారు.
చంద్రబాబు సీఎం అయ్యాక ఈ 18 నెలల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 16 అక్రమ కేసులు పెట్టారు. లేని లిక్కర్ స్కామ్. అక్రమ అరెస్టులు వీళ్లే కాకుండా, ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతో మందిని అన్యాయంగా జైళ్లకు పంపించారు. లేని లిక్కర్ కేసును సృష్టించారు. నిజానికి చంద్రబాబు ఇప్పటికే లిక్కర్ కేసులో బెయిల్‌పై ఉన్నాడు. ఆ కేసును నీరు గార్చేందుకు.. తన పాలసీ వల్ల తాను రాష్ట్రం నాశనం అయిపోయి లూటీ చేశాడన్న కేసు ఏదైతే ఆయనపై ఉందో.. దాన్ని నీరు గార్చేందుకు మధ్యలో ఉన్న మా గవర్నమెంట్ పాలసీని తప్పుగా చూపించేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నాడు. ఎందుకంటే.. నాటి తన పాలసీనే చంద్రబాబు ఇప్పుడు కూడా అమలు చేస్తున్నాడు. ఇప్పుడు అమలు చేస్తున్న పాలసీని జస్టిఫై చేసుకోవడానికి.. అప్పుడు తనపై పెట్టిన కేసును కొట్టివేయించడానికి.. మధ్యలో ఉన్న పాలసీని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తున్నాడు. ఆయనది ప్రైవేటు షాపులు, ప్రైవేటు మాఫియా.. ప్రైవేటు కథ.. మనది ప్రభుత్వ షాపులు, రిస్ట్రిక్టెడ్ టైమింగ్, అన్నీ రిస్ట్రిక్షన్స్. ఈ పాలసీ మళ్లీ తీసేశాడు. మళ్లా ప్రైవేటుకు వచ్చేశాడు. మళ్లా డిస్ట్రిబ్యుషన్ ఆయనదే.. మాన్యుఫాక్చరింగ్ ఆయనదే.. అన్ని స్కాములు ఆయనవే.. దాన్ని జస్టిఫై చేసుకోవడానికి.. మధ్యలో లేని లిక్కర్ స్కామును ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాడు. లేని లిక్కర్ స్కామును సృష్టించి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని లోపలేశారు. మిథున్ రెడ్డిని లోపలేశారు. మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తూ జడ్జి రాసిన జడ్జిమెంట్ కాపీని ఒకసారి చదవండి.
ఎంత ఇదిగా జడ్జి రాశారంటే.. అసలు మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో? ఆయనకు ఏం సంబంధమో? అని ఏకంగా జడ్జి కూడా ఆశ్చర్యపడి రాసే పరిస్థితి. అలా లేని లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డిని, మిథున్ రెడ్డిని, రిటైర్డ్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయరెడ్డిని, ఎంఎన్సీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను, రాజ్ కసిరెడ్డిని నిర్బంధించారు. లేని స్కామును ఉన్నట్లుగా చూపించడం కోసం.. టీటీడీ లడ్డూ వ్యవహారం. దారుణం మరోవైపు ఏకంగా దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. టీటీడీ వేదికగా. నిజంగా వెంకటేశ్వరస్వామి.. ప్రసిద్ధి గాంచిన గుడి అంటే టీటీడీ.. ప్రపంచ వ్యాప్తంగా ఆ గుడికి ఒక ప్రతిష్టత ఉంది.
అలాంటి వెంకటేశ్వరస్వామి గుడిని చంద్రబాబునాయుడు పుణ్యాన నిజంగా ఎంత అభాసుపాలు చేస్తున్నాడన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ. వీటికి సమాధానం ఉందా? అయ్యా చంద్రబాబూ.. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి అడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడంటే భయమూ, భక్తీ లేకుండా మాట్లాడారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారని దేవుడంటే భయమూ, భక్తీ లేకుండా చంద్రబాబు మాట్లాడారు. ఇలా చెప్పడానికి ఆధారాలు దొరికాయా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. కల్తీ నెయ్యి ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్లాయా? దీనికి ఆధారాలు ఉన్నాయా? ఎందుకంటే టీటీడీలో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ ల్యాబ్) సర్టిఫికేషన్ తోనే రావాలి. ఇది రూల్. మ్యాండేటరీ.
ఈ సర్టిఫికెట్ లేకుండా తిరుపతిలోపలికి రాకూడదు. తర్వాత టీటీడీలో ఈ ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ ఒక్కటే ఒప్పుకోరు. ఇది ప్రొసీజర్‌లో పార్ట్. టీటీడీలో ఒక సొంత ల్యాబ్ ఉంది. ఆ సొంత ల్యాబులో కూడా మళ్లీ టెస్టు పాస్ కావాలి. ప్రతి ట్యాంకర్ పాస్ కావాలి. ఆ తర్వాతనే ట్యాంకర్ లోపలికి పోవడానికి అనుమతి ఇస్తారు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్, వీళ్ల సొంత ల్యాబ్ పాస్ సర్టిఫికెట్. ఈ రెండూ ఉంటేనే ట్యాంకర్ లోపలికి పోతుంది. ఈ స్టాండర్స్ లేకపోతే రిజెక్ట్ చేసి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు. ఇదే కార్యక్రమం. ఈ టెస్టింగ్‌లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు వెనక్కి పంపించారు. వైయస్సార్ సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపించారు. ఇదొక రొటీన్ ప్రొసీజర్. రోబోస్ట్ ప్రొసీజర్ ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వ్యవస్థ యాక్టివ్‌గా పని చేస్తోందని చెప్పడానికి ఇవి ఉదాహరణలు. తప్పుకు ఆస్కారం ఎక్కడుంది? ఇంత రోబోస్ట్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను.
ఇదే చంద్రబాబునాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ ఈవో ప్రెస్మీట్లో చెప్పిన మాటలు వినండి. క్లియర్ కట్‌గా సెప్టెంబర్ 20, 2024న వాళ్ల ప్రభుత్వ హయాంలో వాళ్ల ఈవో అన్న మాటలు. ఆ 4 ట్యాంకర్లను టోటల్ గా టెస్టులు పాస్ కానందువల్ల రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని చంద్రబాబునాయుడు గవర్నమెంట్లో ఆయన ఈవో అన్న మాటలు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. రోబోస్ట్ ప్రొసీజర్ ను మరొక్కసారి చూపిస్తూ. కాగా ఆ ట్యాంకర్లు ఆగస్టులో మళ్లీ తిరిగి వచ్చాయంటున్నారు. మరి అప్పుడు ఎవరు సీఎం? ఆయనే కదా? ఎవరిది ప్రభుత్వం? ఆయనదే కదా?. అదే నిజమైతే ఎవరిపై చర్య తీసుకోవాలి?: మళ్లీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని, మొన్న రిమాండ్ రిపోర్టులో సిట్ రాసింది. మరి ఎవర్ని బొక్కలో వేయాలి? ఇదే నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి.
అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే అది నిజమే అయితే, మరి అది చంద్రబాబునాయుడు వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, ఆ పీరియడ్ లో ఉన్న టీటీడీ ఈవో, వాళ్లిద్దరూ ఏమి చేస్తున్నారు? వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్టు చేయలేదు? ఎవరి టైమ్ లో జరుగుతోంది ఇది? ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు ప్రభుత్వం కాదా? మీ హయాంలో మీ అప్పటి ఈవో మీద, మీ అప్పటి టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి ఎవరి మీద నిందలు వేస్తున్నారు? దేవుడంటే భయమూలేదు, భక్తీ లేదు, దుర్మార్గమైన అసత్యాలు. ఆ నెయ్యిలోనూ అంతా కల్తీయేనా? స్వచ్ఛమైన నెయ్యి రూ.320కే మీరు ఎలా సప్లయ్ చేయిస్తారు? అని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైన కిలో నెయ్యికి రూ.3 వేలు అవుతుందని ప్రకటనలు చేశారు.
ఇదే ఈనాడు గజట్ పత్రిక అయితే నాణ్యమైన కిలో నెయ్యి కనీసం రూ.1000 నుంచి రూ.1600 అవుతుందని రాశారు. మరి టీటీడీలో ఇవాళ నెయ్యి ఎంతకు కొంటున్నారు? రూ.3 వేలు ఇచ్చి కొంటున్నారా? రూ.1600 ఇచ్చి కొంటున్నారా? రూ.1000 ఇచ్చి కొంటున్నారా? పోనీ 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఆ ఐదేళ్లూ కిలో నెయ్యి రూ.276 నుంచి రూ.314 వరకు కొన్నారు. మరి ఆ ధర రూ.320 కన్నా తక్కువ కదా? అలాంటప్పుడు ఆ నెయ్యి మొత్తం కల్తీదేనా? దీనికి చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలి. నెయ్యి సేకరణ. పక్కా వ్యవస్థ తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లయ్ చేస్తుంటాయి. సుమారు ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తుంటారు. ఎవరు తక్కువకు కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రొసీజర్. పొలిటికల్ ఇన్ఫ్లూయెన్స్ ఉండదు, ఒకడు చేసేదీ ఉండదు, పెట్టేదీ ఉండదు, ఇంకోటి ఇంకోటి కూడా ఉండవు. టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్లకు ఎల్1 ఎవరుంటారో వారికి కేటాయిస్తారు.
ఇందులో రాజకీయాలకు సంబంధం లేదు. సప్లయ్ చేసిన కంపెనీ ఏదైనా అమల్లో ఉన్న రోబోస్ట్ ప్రోటోకాల్ ప్రకారం.. టెస్టులు చేస్తారు. వాళ్లు వచ్చేటప్పుడు ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి, దాంతో పాటు టీటీడీలోఉన్న ల్యాబులో టెస్టులు చేస్తారు, టెస్టుల్లో పాసయితేనే ఆ వెహికల్స్ లోపలికి పోతాయి. ‘సిట్’లో అంతా చంద్రబాబు మనుషులు అసలు సిట్ లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరో తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. గోపీనాథ్ జెట్టి. (అంటూ ఎన్టీఆర్ ట్రస్టులో భువనేశ్వరితో ఆయన కలిసి ఉన్న ఫొటో చూపారు) జెట్టి కృష్ణయ్య సమీప బంధువు ఈ గోపీనాథ్ జెట్టి. సిట్‌లో ఒక ఆఫీసర్. ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకు ఎంత ప్రేమ అంటే.. ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, ఇన్ని సంవత్సరాల తర్వాత స్టేట్ గవర్నమెంట్లో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్. ఇలాంటి స్వప్రయోజనాలున్న వ్యక్తి సమీప బంధువు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్. ఇంకో ఆఫీసర్ ఎవరు? డీఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ట త్రిపాఠి అనే వాడు ఎలాంటి వాడో నేను చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు.
పల్నాడు జిల్లాలో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేదు. ఏ రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం, భుజాన వేసుకుని తెలుగుదేశం పార్టీ కోసం పాకులాడాడు అని చెప్పి, ఆ తర్వాత చంద్రబాబునాయుడు ఇదే ఆఫీసర్ ను ఏ రకంగా పక్కన కూర్చోబెట్టుకుని డీఐజీ స్థానం ఇచ్చి, ఆయన చేస్తున్న మాఫియా కలెక్షన్లలో ఈయన కూడా ప్రముఖ ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యక్తి. ఈ త్రిపాఠి అనేవాడు. సిట్‌లో ఇలాంటి ఆఫీసర్లు. అప్పన్న వీపీఆర్ పీఏ ఇంకా ఆశ్చర్యం.. ఈ మధ్య కాలంలో మీరంతా విని ఉంటారు, వైవీ సుబ్బారెడ్డి పీఏ అని. అసలు అప్పన్న ఎవడి పీఏ అని నేను అడిగా. ఆయన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) పీఏ. వీపీఆర్ ఎవరు? టీడీపీ ఎంపీ. ఆయన దగ్గర నుంచి అప్సన్న ప్రతి నెలా శాలరీ తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఏపీ భవన్ ఉద్యోగి కూడా. మరి ఎక్కడ వైవీ సుబ్బారెడ్డి వచ్చాడు పిక్చర్ లోకి? పరకామణి చోరీ కేసు టీటీడీకి మేలు చేస్తే నేరం అవుతుందా? ఈ పరకామణి కేసు నిజంగా ఆశ్చర్యం కలిగించే కేసు.
ఈ కేసు ఏంటని చూస్తే.. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ, చిన్న చోరీ 9 అమెరికన్ డాలర్ల నోట్స్. మన కరెన్సీలో వాటి విలువ దాదాపు రూ.72 వేలు. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. రూ.72 వేలు విలువ చేసే 9 అమెరికన్ డాలర్లు చోరీ చేస్తుండగా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా..? దీనికి ప్రాయశ్చితంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు రూ.14 కోట్లు విలువైన వారి ఆస్తులను దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా? పోనీ, దేశంలో అనేక చోట్ల.. అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. కానీ, ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా..? ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. తిరుపతి కోర్టులో చార్జిషీట్ వేశారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్నీ కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్టు ప్రొసీజర్‌తో జరిగాయి. జ్యుడీషియల్ ప్రాసెస్ అంతా జరిగింది.
ఇందులో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు తప్పులేదు. కానీ, రాజకీయాల కోసం ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నాడనో.. భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నాడనో.. వారి మీద బురదజల్లాలని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేలా, ఇవ్వాలని అక్కడ పనిచేస్తున్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేసి, ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఫేక్ కథనాలు రాయించడం ఎంత వరకు సమంజసం, ఎంత వరకు ధర్మం. మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని అడుగుతున్నా.. ఆ దొరికిన దొంగ జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా 30 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాడు. కొత్తగా మా ప్రభుత్వంలో వచ్చిన వ్యక్తి కాదు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయారు.. ఆ దొంగను మేము పట్టుకున్నాం.. మీరెందుకు పట్టుకోలేకపోయారు చంద్రబాబును సూటిగా ప్రశ్న అడుగుతున్నా.
ఏప్రిల్ 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు మంచివారు. ఇంత గొప్ప వ్యవస్థను సష్టించినందుకు మాపై నిందలా..? దశాబ్దాలుగా ఇదే పనిచేస్తున్నాడని అనుకోవచ్చు. చంద్రబాబు హయాంలో ఎవరూ పట్టుకోలేదు. జరిగించారు. జరుగుతుంది. మా హయాంలో పట్టుకున్నాం. గతంలో ఏం జరిగిందో దేవుడికి తెలుసు. 9 నోట్లతో దొరికాడు. రూ.72 వేల విలువ. ఏకంగా రూ.14 కోట్ల ఆస్తి దేవుడికి ఆ కుటుంబం రాసిచ్చింది. మీరంతా ఏం చేస్తున్నారు స్వామీ. న్యాయవ్యవస్థను కించపర్చేలా మాటలు! పైగా, వర్ల రామయ్య అనే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్.. ఆయన చేత చంద్రబాబు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో తెలుసా.. ఒక్కసారి వినండి. చంద్రబాబునాయుడు ఆయన పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్‌తో మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఏకంగా న్యాయవ్యవస్థ మీద చంద్రబాబు దాడి చేస్తున్నాడు. తిరుపతి జడ్జి మీద, లోక్ అదాలత్ జడ్జి మీద, వీరిద్దరికి పై నుంచి ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జిగారు ఒత్తిడి తెచ్చారట. ఆయన మీద కూడా మాట్లాడుతున్నాడు.
పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం, పరిష్కారం చూపించడం తప్పా.. అని నేను అడుగుతున్నా. దాంట్లో రాజకీయం ఎందుకు? తిరుమలకు పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తుంటారు. ఇలాంటి కేసులు ఏమైనా జరిగినప్పుడు తిరుపతిలో ఉన్న జడ్జిలు సుప్రీం కోర్టు జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి ఇంపార్టెంట్ కేసు.. దేశం మొత్తం చూస్తున్న కేసులో మీ సలహాలు ఇవ్వండి, ఎలా చేయాలి, ఏం చేయాలని అడుగుతుంటారు. జ్యుడీషియల్ పరిధిలో సలహాలు తీసుకుంటారు. ఏ తప్పు జరగలేదు, ఏ తప్పూ చేయలేదు కాబట్టి సలహాలు తీసుకొని, ఇంప్లిమెంట్ చేశారేమో.. దాంట్లో రాజకీయం చేయడానికి ఏముంది. రూ.72 వేల విలువైన 9 డాలర్ నోట్లు దొరికితే, రూ.14 కోట్ల ఆస్తులు టీటీడీకి రాసిస్తే.. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగవు ఇలా.
దానికి సంతోషపడాల్సిందిపోయి.. ఆ జడ్జిలపై నిందలు వేయడం, టీటీడీ ఆఫీసర్లను అనడం ఏంటీ.. ఏం చేస్తున్నారు..? అంత న్యాయ నిపుణులు భాగస్వాములు అయ్యి, దేవుడికి, దేవుడి ఆలయానికి మంచి చేయడం కోసమే కదా.. వాళ్లంతా ఇన్వాల్వ్ అయ్యింది. దాంట్లో ఎవరి స్వార్థం ఉంది.. ఏం స్వార్థం ఉంది దాంట్లో.. అధికారులు, జడ్జిలు, మరొకరు గానీ, జ్యుడిషియల్ ఫాలో అయ్యింది.. నిజంగానే ఆస్తులు టీటీడీకి వచ్చాయి. సింహాచలంలో ఆ పని ఎందుకు చేయలేదు? ఈ ఏడాది సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే హయాంలో.. సింహాచలంలో హుండీ డబ్బులు రూ.55 వేలు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు.
ఇది అన్ని పేపర్లలో వచ్చింది. సింహాచలం ఎంతటి సుప్రసిద్ధ ఆలయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 1న సింహాచలంలో హుండీ డబ్బులు రూ.55 వేలు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు కానీ, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఇది జరిగిన వాస్తవం. నేను అడుగుతున్నా.. ఎవరు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయమన్నారు? ఎందుకు జైల్లో పెట్టలేదు.
మరి చంద్రబాబు నాయుడు దీనిపై ఎందుకు విచారణ చేయలేదు. మొత్తం వారిద్దరి ఆస్తులపై విచారణ చేసి, వాటిని మొత్తం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు..? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త ఎవరంటే.. తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతిరాజు. ఈయన ప్రస్తుతం గోవా గవర్నర్. ఆయనే సింహాచలం ఆలయానికి ధర్మకర్త. ఏంది స్వామి ఇది.. ఒక్కోచోట ఒక్కోన్యాయం. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉంటే ఒక న్యాయం. అదే అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం.
వాళ్లు మంచి చేసినా దాన్ని చెడు అంటారు.. వీళ్లు చెడు చేసినా దాన్ని మంచి అంటారు. మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు. ఎక్కడైనా న్యాయం ఒక్కటే కదా. సింహాచలంలోనూ, తిరుపతిలోనూ, సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి విషయంలోనూ, అశోక్ గజపతిరాజు విషయంలోనూ న్యాయం అనేది అందరికీ ఒకటే మాదిరిగా ఉండాలి. టీడీపీ హయాంలోనే అక్రమాలు టీటీడీ డబ్బుల్లో 10 శాతం మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది టీటీడీ రూల్. చంద్రబాబు హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడి, చంద్రబాబునాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో రూ.1300 కోట్లు ఎస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బును విత్ డ్రా చేసి జాతీయ బ్యాంక్‌లో ఆ డబ్బు పెట్టింది. పెట్టిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయ్యింది.
ఒకవేళ చంద్రబాబు పెట్టిన రూ.1300 కోట్లు ఎస్ బ్యాంక్‌లోనే ఉండి ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టుల ద్వారానే పోరాటం చేయగలుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే.. పై నుంచి దేవుడు చూస్తుంటాడు, డెమోక్రసీలో ప్రజలు చూస్తుంటారు. దేవుడు, ప్రజలు వీళ్లే బుద్ధి చెప్పాలి. అమరావతి గురించి మీరే చెప్పాలి. ఇంతకు ముందు అంతా చంద్రబాబు ఏమన్నాడు? 2014–19 మధ్య 53 వేల ఎకరాలు తీసుకుంటూ అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని, సింగపూర్, గింగపూర్ యాడికి పోవాల్నో, మన దగ్గర నుంచే ఏదైనా కానీ, మన రాజధానిని చూసి వాళ్లు కాపీ కొట్టే పరిస్థితుల్లోకి దీన్ని బిల్డ్ అప్ చేస్తున్నాను అని మనకు బాహుబలి సెట్టింగ్స్ చూపించారు.
ఆ 53 వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత అంటే, రాజధాని కట్టడం కథ దేవుడెరుగు.. ఆ 53 వేల ఎకరాల్లో రోడ్లు వేయడానికి, కరెంటు ఇవ్వడానికి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి.. వీటికే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుందని తానే డీపీఆర్ ఇచ్చాడు. అంటే ఆ 53 వేల ఎకరాలకే లక్ష కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డీపీఆర్‌లోనే రూ.5వేల కోట్లు పెట్టాడుసినిమా అంతా చూపిస్తూ. మళ్లా ఈరోజు ఏం చేస్తున్నాడు? 53 వేల ఎకరాలు సరిపోదు అంటున్నాడు.
కాగా, ఆ రోజేమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు, 8 వేల ఎకరాలు మిగిలింది, దాంతోనే రాజధాని అయిపోతుంది అన్నాడు. మళ్లీ ఈరోజు ఏమంటున్నాడు? గతంలో తీసుకున్న 53 వేల ఎకరాలకే దిక్కులేదు. ఇంకో 53 వేల ఎకరాలు తీసుకోవడానికి రైతుల నుంచి వెనుకాడటం లేదు. ఇక్కడ జరిగేది ఒక్కటే. ఈయన, ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు. కొన్న తర్వాత ఆ ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటారు. ఆ తర్వాత తన బినామీలకు మాత్రం ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోట ఇచ్చుకుంటాడు. మిగిలిన వాళ్లకు ప్లాట్లు వేరేచోట ఇస్తాడు. అక్కడ ఎప్పటికీ అభివృద్ధి జరగదు. అంటే మిగతా వాళ్లు గాలికి పోతారు వీళ్ల మనుషులు అంతో ఇంతో.. కొద్దోగొప్పో ఆ వేసిన రోడ్లు వాళ్ల దగ్గర వేసుకుంటారని వైయస్ జగన్ వివరించారు.

