‘ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ వ్యక్తి కాదు; ఆయన విగ్రహం హైదరాబాదులో పెట్టకూడదు’ ఈ మాట, ఈ ఆలోచన అసహ్యకరమైనవి. ఇంతకన్నా తెలుగు జాతికి లేదా తెలుగు ప్రజలకు అవమానకరమైనది మరొకటి ఉండదు! ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం అనే ఒక అత్యున్నతమైన తెలుగు గాయకుడికి తెలుగు నేలలోనే విగ్రహం ఉండకూడదు అన్న ఉన్మాదం ఒక్క తెలుగు జాతిలో మాత్రమే ఉంటుందేమో? ఈ మాట, ఈ అలోచన సరైనవే, మేలైనవే, ఆచరణీయమైనవే అయితే గత ఆరు దశాబ్దులుగా ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పాటను తెలంగాణ ప్రజలు వింటూండడం అబద్ధం అవుతుంది. తెలంగాణ ప్రజలు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పాటకు తన్మయులు అవకపోవడం అవుతుంది. ఒక ప్రాంత పజల్ని కొన్ని దశాబ్దుల పాటు అలరించిన ఒక గాయకుడి విగ్రహం ఆ ప్రాంతంలో ఉండకూడదా? ఇంతకన్నా వికృతమైన విషయం మరొకటి ఉంటుందా? సంగీతానికి, కళలకు ‘ప్రాంతీయత మకిలి’ పుయ్యడం బుద్ధి, సిగ్గు, కృతజ్ఞత లేకపోవడమే.
ఈ బుద్ధి, సిగ్గు, కృతజ్ఞత లేకపోవడం ఒక్క తెలుగు జాతిలోనే ఎక్కువగా ఉంటాయేమో?! తెలుగు ప్రజకు మాత్రం ఎందుకు ఈ రోగం వచ్చింది? ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం తెలుగు వ్యక్తి. తమిళ్ష్ చెన్నైలో ఆయన పేరుతో ఒక వీధి ఉంది. తమిళ్ష్ కోయంబత్తూరులో ‘ఎస్.పీ.బీ. వనం’ అనే పేరుతో ఒక పార్క్ ఉంది. ఈ పాటికే విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పేరును వీధులకు ప్రభుత్వాలు పెట్టాల్సింది. తమిళ్ష్ భాషీయులను చూసైనా మన తెలుగు జాతి సిగ్గు, బుద్ధి తెచ్చుకోవాలి. తెలంగాణ అనేది ఒక ప్రాంతం. దాని ప్రత్యేకత దానికి ఉంటుంది.
పాలన సౌకర్యం కోసం, అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం తెలంగాణ రాష్ట్రం అవసరమైంది; అది అమరింది. తెలంగాణ వాదం మొత్తం తెలుగుకే వ్యతిరేకమూ, గాయమూ అవడం దారుణం. తెలంగాణ వాదం వల్ల ఈవరకే దేశ వ్యాప్తంగా తెలుగు నవ్వులపాలు అయిపోయింది. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు షియా, సున్నీలు అయిపోయి కొట్టుకుంటూ తెలుగుకే పెను గాయం అవకూడదు; దేశంలోని ఇతరులకు తెలుగు జాతి అంటేనే అసహ్యం కలగకూడదు.
ఇవాళ హైదరాబాదులో ఎస్.పీ.బీ. విగ్రహం పెట్టకూడదు అని ఆగం చేస్తున్న వాళ్లు ఆయన పాటలు వింటున్న తెలంగాణ ప్రజల్ని అడ్డుకోగలరా? తెలంగాణ తెలుగు ప్రజలు ఆయన పాటల్ని వినడం ఆపేస్తారా? తమిళ్షులు, కన్నడిగులు బాలును ప్రాంతీయతో పరిగణించలేదు. బాలు తమ భాషీయుడు కాకపోయినా వాళ్లు బాలుకు తెలుగు వాళ్లకన్నా ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చారు. తెలుగువాళ్లలో ఏదో మాయరోగం ఉంది. ఆ మాయరోగానికి ఇదిగో ఈ ప్రాంతీయతా ఉన్మాదం తోడైంది. తెలంగాణ వాదం అన్నది తెలుగుకు పెనుగాయం అవుతోందా? అయిపోయిందా? తెలంగాణ ఉన్మాదుల వల్ల తెలుగు భాష, జాతి ఘనత, కళ, ఔన్నత్యం తెగటారనున్నాయా? మనవి: నేను తెలంగాణకు వ్యతిరేకమైన ఆంధ్ర వ్యక్తిని కాను. తమిళ్ష్ నాడులో పెరిగిన మామూలు మనిషిని; ఇంకా సూటిగా చెప్పాలంటే ఏ ప్రాంతీయతా ఉన్మాదమూ లేని పామరుణ్ణి.

9444012279