– వచ్చే ఏడాది ప్రారంభం
– దానికంటే ముందు రాష్ట్ర పర్యటనలు
– కాలేజీ, వర్సిటీ విద్యార్థులతో మాటా మంతీ
– యువకులకు ఎక్కువ సీట్లు
– ఎన్టీఆర్, జయలలిత ఫార్ములా
-ప్రణాళిక, అజెండా ఖరారుపై మేధావులతో కసరత్తు
(మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బాధితుడైన ఇంటెలిజెన్స్ మాజీ దళపతి ఏబీ వెంకటేశ్వరరావు కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించనున్నారు. ఆ మేరకు ఆయన మేధావులు, నిపుణులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో గత కొద్ది రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారు. మాజీ సీఎం జగన్ హయాంలో సస్పెన్షన్ కు గురై రిటైర్ అయ్యే రోజు వరకు పోస్టింగు లభించని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఇకపై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తనున్నారు.
ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు సన్నా హాలు చేస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆయనకు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ పదవి ఇచ్చే ముందు తనతో ఎవరు మాట్లాడలేదని దానిని తిరస్కరించిన ఏబీవీ.. తర్వాత, రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు, అలోచనాపరుల వేదిక పేరుతో పర్యటనలు ప్రారంభించారు. నీటిపారుదల రంగ నిపుణులు నిపుణులు, మాజీ న్యాయమూర్తులు, సామాజికవేత్తలతో కలసి ప్రాజెక్టులను సందర్శించి.. అందులోని లోపాలను, అవినీతిని మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నారు.
అదే సమయంలో జగన్ హయాంలో భారీ లబ్థి పొందిన.. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ , మేఘ కృష్ణారెడ్డి కంపెనీలు వివిధ ప్రభుత్వాల నుంచి పొందుతున్న అనుచిత లబ్ధిని ఎండగడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆ కంపెనీలకు సర్కారు దొడ్డిదారిలో ఇచ్చిన బిల్లులను ప్రజల దృష్టికి తీసుకువస్తూ, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్మించదలచిన బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ.. దానివల్ల వచ్చే నష్టాలు, ఖజానాపై పడే పెను భారాల గురించి గత కొద్దికాలంగా గళ మెత్తుతున్నారు. దీనితో ఏబీ చర్యలు సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబీకి.. నాటి సీఎం జగన్ వేధించి. పోస్టింగ్ ఇవ్వనప్పటినుంచీ ఆ వర్గంలో ఆయనకు విపరీతమైన సానుభూతి, మద్దతుదారులు పెరిగారు.
రిటైరైన తర్వాత ఆయన అనేక కమ్మ వేదికలు, కార్యక్రమాలకు హాజరయ్యారు. కమ్మ వాళ్ళు ఎవరిపై – ఏ పార్టీపై ఆధారపడవద్దని, వారికి ఎవరి దయ అవసరం లేదంటూ ఏబీ చేసిన వ్యాఖ్యలు.. అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకూ ఏబీ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలు పరిశీలిస్తే.. ఆయన కూటమి సర్కారుపై పోరాటానికి సిద్ధపడినట్లు స్పష్టమవుతుంది. ప్రధానంగా అప్పట్లో జగన్ బినామీ కంపెనీగా టీడీపీ ఆరోపించిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, ఎన్నికల సమయంలో టీడీపీకి ఇచ్చిన 40 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ గురించి.. మేఘా కృష్ణారెడ్డికి లాభం చేకూర్చేందుకు ఆ కంపెనీకి ఇస్తున్న కాంట్రాక్టర్ల గురించి మీడియాలో తరచూ ప్రస్తావిస్తున్నారు.
జగన్ హయాంలో వందల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టిన షిర్డిసాయి కంపెనీకి మళ్లీ ఎలా కాంట్రాక్టులిస్తారు? ఇందుకోసమా కూటమికి కార్యకర్తలు, ప్రజలు అధికారం కట్టబెట్టిందంటూ నిలదీస్తున్నారు. ఇవన్నీ సహజంగా కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తలు, సోషల్‌మీడియా సైనికులతోపాటు, కూటమిపై అసంతృప్తితో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని మెప్పించేవి, తృప్తి పరిచేవే అనడంలో సందేహం లేదు. జగన్‌పై యుద్ధం చేసి, పదవీ విరమణ చేసిన ఏబీకి.. ఇప్పటివరకూ రావలసిన 80 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదన్న కథనాలు చర్చనీయాంశమయి, అది ఏబీకి సానుభూతిగా మారాయి. ఆ క్రమంలో టీడీపీకి చెందిన ఓ వర్గం.. ఆయనకు ఎలాంటి అన్యాయం జరగలేదని, రావలసిన పెండింగ్ డబ్బులిస్తూ జీఓ కూడా జారీ చేసిందంటూ ఎదురుదాడికి దిగడం చర్చనీయాంశమయింది. దీన్ని బట్టి ఏబీని ఎదుర్కొనేందుకు సైతం సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతుంది.
ఈ నేపథ్యంలో ఆయన పెట్టనున్న పార్టీ స్వరూపం ఎలా ఉంటుందన్న చర్చ.. ఏబీ పార్టీతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్న అంశం అటు ప్రజలు-ఇటు టీడీపీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా ఏబీ స్థాపించబోయే పార్టీ – అభ్యర్ధి ఎంపికలు ఎన్టీఆర్-జయలలిత శైలిలో ఉండబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తొలిరోజుల్లో 80 శాతం విద్యావంతులకే సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత క్రమేపీ పారిశ్రామికవేత్తలు-కాంట్రాక్టర్లు రంగప్రవేశం చేశారు. అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత అయితే అతి సాధారణ వ్యక్తిని ఎంపిక చేసి చట్టసభలకు పంపించేవారు. ఎన్టీఆర్-జయలలిత డబ్బులున్న అభ్యర్ధులకు కాకుండా, సాధారణ వ్యక్తులకు టికెట్లు ఇచ్చేవారు.
ఏబీ కూడా తన కొత్త పార్టీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో, వారిద్దరినే అనుసరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో డబ్బు పాత్రను తొలగించడం అసాధ్యమైనప్పటికీ.. లోక్‌సత్తా మాదిరిగా తమ పార్టీ కూడా, డబ్బులతో పనిలేకుండా అభ్యర్ధులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా వచ్చే ఏడాది రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ఏబీవీ.. తన సహచరులతో కలసి ఆమేరకు తగిన ప్రణాళిక రూపొందించుకునే పనిలో ఉన్నారు. అజెండా-పోరాడాల్సిన అంశాలు- మేనిఫెస్టో ఎలా ఉండాలన్న అంశాలపై ఆయన ఈపాటికే మేధావులు-వివిధ వర్గాలకు చెందిన నిష్ణాతులతో చర్చలు జరుపుతున్నారు. తొలుత విజయవాడలో ఒక కార్యాలయం తీసుకోనున్నారు.
మేం ఎవరి కోసం పనిచేయం: ఏబీ ‘ రాష్ట్ర ప్రయోజనాల కోసం పరితపించే కొందరు వ్యక్తులతో కలసి నేను కొత్త పార్టీ ప్రారంభించబోతున్న మాట నిజం. వచ్చే ఏడాది ప్రారంభించేందుకు చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాల్లో డబ్బు పాత్ర తగ్గించాలంటే, పార్టీలకు కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే తాంబూలాలు ఆపాలి. అప్పుడే పాలనలో పారదర్శత ఉంటుంది. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకునే పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా వారికి మేలు చేస్తాయి కదా? వాళ్లేమీ పార్టీలపై ప్రేమ తో ఆ డబ్బులివ్వరు కదా? అంతకు పదిరెట్లు లాభాపేక్షతోనే చందాలిస్తారు. ఇది బహిరంగ సత్యం. గత పదేళ్ల నుంచి తెలుగునాట జరుగుతోంది ఇదే కదా? దాన్ని ఆపే ప్రయత్నం చేసి, ప్రజలకు మేలుచేసే ప్రయత్నం చేయాల్సి ఉంది. రాష్ట్ర సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా ఇరిగేషన్ సమస్యలున్నాయి.
తమకు నచ్చిన కాంట్రాక్టర్ల కోసం వందలు-వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. కేవలం రాజకీయాలే కాదు. అసలు రాజకీయ పార్టీ అంటే ఇంకో పార్టీపై విమర్శలు చేయడం కాదు. ప్రజాసమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయడం. మాకు వ్యక్తిగత విమర్శలపై ఆసక్తి లేదు. మేం వాటికి దూరం. రాజకీయాల్లో పోయిన విలువలు కాపాడే ప్రయత్నం చేస్తాం. మాకు ఎవరూ వ్యక్తిగత శత్రువులు లేరు. ప్రత్యర్ధులే తప్ప శత్రువులు ఉండకూడదన్నదే మా సిద్దాంతం. కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండకుండా, గళం విప్పాలన్నదే మేం ప్రజలకు ఇచ్చే పిలుపు. వారి వేదన-వాదనకు మేం గొంతుకలవుతాం.
మేధావుల మౌనం సమాజానికి హాని కలిగిస్తుంది. కాబట్టే వారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం. అందుకే మేం విద్యావంతులు, మేధావుల సూచనల మేరకు పనిచేస్తాం. మా అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలు. అది ఎవరు చేసినా అభినందిస్తాం. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజాక్షేత్రంలో చర్చిస్తాం. నిలదీస్తాం. అందులో ఎలాంటి మొహమాటాలు లేవు. మేం ఎవరి కోసం పనిచేయం. మా వల్ల ఫలానా పార్టీ నష్టపోతుంది. ఫలానా పార్టీ లాభపడుతుందన్నది పట్టించుకోం. అది మాకు సంబంధం లేని వ్యవహరిస్తాం. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఇదే మా కొత్త పార్టీ మౌలిక స్వరూప స్వభావం’’ అని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
ఏబీ సక్సెస్ అవుతారా? (box) అందరిలా రిటైర్మెంట్ అనంతరం, కుటుంబంతో కాలక్షేపం చేయకుండా.. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం సహచరులతో కలసి ప్రాజెక్టులు పరిశీలిస్తున్న ఏబీ, వచ్చే ఏడాది పార్టీ స్ధాపించాలనుకోవడం ఆయన లక్ష్యం ఏమిటన్నది స్పష్టం చేస్తోంది. అయితే రిటైర్మెంట్ తర్వాత పార్టీలు పెట్టిన వారు, ఇప్పటివరకూ సక్సెస్ అయిన దాఖలాలు తెలుగు రాజకీయాల్లో ఎక్కడా కనిపించదు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ డీజీపీ ఎంవి భాస్కర్‌రావు కూడా గతంలో పార్టీ పెట్టి ఎన్నికల తర్వాత దాన్ని మూసేశారు.
నాదెండ్ల భాస్కరరావు కూడా ప్రజాస్వామ్య తెలుగుదేశం పెట్టి తర్వాత దాన్ని మూసేశారు. వైఎస్ హయాంలో లోక్‌సత్తా పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ కూకట్పల్లి నుంచి గెలిచినప్పటికీ, తర్వాత ఓడిపోయారు. దాని తర్వాత ఆయన పార్టీని రద్దు చే యాల్సి వచ్చింది. చిరంజీవి ప్రజా రాజ్యం పెట్టి, ఎన్నికల తర్వాత దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
లక్ష్మీపార్వతి, నందమూరి హరికృష్ణ, దేవేందర్‌గౌడ్ కూడా ఎక్కువ కాలం సొంత పార్టీని నడిపించలేక మూసేశారు. మిగిలిన వారిని పక్కనబెడితే.. దండిగా డబ్బున్న చిరంజీవి, దేవేందర్ గౌడ్ వంటి వారే పార్టీని ఎక్కువకాలం నడపలేక, ఇతర పార్టీలో విలీనం కావడం ప్రస్తావనార్హం. ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ-వైసీపీ వంటి, అర్ధ-అంగబలాలున్న పార్టీలను ఏబీవి ఎదుర్కోగలరా? పార్టీ స్థాపించిన తర్వాత.. ఆయనకు ఇప్పటివరకూ దన్నుగా నిలిచిన కమ్మ సామాజికవర్గం-టీడీపీ సానుభూతిపరులు మద్దతిస్తారా? వంటి ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.