– పబ్లిక్ పరీక్షల ఫీజు కింద రూ.2,60,875 చెల్లింపు
– ‘ధర్మవరం’లోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,087 మంది విద్యార్థులకు ఊరట
– ప్రశంసించిన నియోజకవర్గ వాసులు
ధర్మవరం: పేద విద్యార్థులపట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రేమాభిమానాన్ని కనబరిచారు. తాను ప్రాతినిథ్యం వహించే సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,087 మంది పదో తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల ఫీజును తానే స్వయంగా చెల్లించారు. ఒక్కొక్క విద్యార్థి రూ. 125 చొప్పున ఫీజును విద్యా శాఖకు చెల్లించాలి. దీని ప్రకారం రూ.2,60,875 మొత్తాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ జిల్లా విద్యా శాఖ అధికారి ద్వారా చెల్లించారు. వీటి వివరాలను జిల్లా విద్యా శాఖ అధికారి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియచేస్తూ ఉత్తర్వులిచ్చారు.
బత్తలపల్లి, దర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 2,087 మంది పదో తరగతి చదువుతున్నారు త్వరలో పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల ఫీజును వారికి ప్రోత్సాహకరంగా, ప్రేరణగా ఉండేందుకు మంత్రి చిరు ప్రయత్నంచేశారని సన్నిహితులు తెలిపారు. లబ్ధిపొందిన వారిలో 1,096 మంది బాలికలు ఉన్నారు. మంత్రి చొరవను నియోజకవర్గ వాసులు ప్రశంసించారు.