– లోక్ సభలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు విన్నపం
న్యూఢిల్లీ: లోక్సభ జీరో అవర్ సందర్భంగా, శుక్రవారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దేశవ్యాప్తంగా సర్వీసుల్లో కొనసాగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న కీలక అంశాన్ని లేవనెత్తారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశంలోని సర్వీస్ లో ఉన్న ప్రతి ప్రభుత్వ టీచర్ రెండేళ్లలోగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిందేననే నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు.
‘‘ఉపాధ్యాయులు కేవలం బోధించేవారు మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేశనిర్మాణకారులు’’ అని పేర్కొంటూ, ఉపాధ్యాయుల కష్టాలు, వారి సేవ విలువను తాను బాగా అర్థం చేసుకున్నానని తెలిపారు. 2010 ఆగస్టు 23కు ముందుగా నియమితులైన ఉపాధ్యాయులకు అప్పటి ఆర్టీఈ చట్టం ప్రకారం టెట్ నుండి మినహాయింపు ఇచ్చిన విషయంను గుర్తుచేశారు.
ప్రస్తుతం 15 నుండి 30 ఏళ్ల అనుభవం కలిగి గ్రామీణ, ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను నిలబెట్టే ఈ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మరోసారి టెట్ లాంటి ప్రవేశపరీక్ష రాయాల్సిన పరిస్థితి కలగడం వారిని ఇబ్బందికి గురి చేసే అంశమని, ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే లక్షకు పైగా టీచర్ లపై ప్రభావం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో వేలాది ఉపాధ్యాయులు పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోతే, దేశవ్యాప్తంగా వేల తరగతులు ఉపాధ్యాయుల్లేక ఖాళీ అవుతాయి. పాఠశాలల్లో ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయుల కొరత మరింత తీవ్రమవుతుందని, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యా హక్కు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టీఈ చట్టం, ఎన్సీటీఈ చట్టం 1993లలో తగిన సవరణలు చేసి 2010కు ముందు సర్వీసుల్లో నియమితులైన ఉపాధ్యాయులకు స్థిరమైన భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలతో వెంటనే చర్చలు జరిపి వారి భయాందోళనలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘‘దేశాన్ని తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు గౌరవం, భద్రత, స్థిరత్వం లభించాలి. తమ జీవితాలను విద్యారంగానికి అంకితం చేసిన ఉపాధ్యాయులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత’’ ఈ విషయంపై పునః సమీక్ష చేయాలని లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.