– మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం
హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మనోవేదనకు గురై క్యూ న్యూస్ ఆఫీస్ వద్ద ఆత్మహత్య కు ప్రయత్నించి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పరామర్శించారు. సాయి ఈశ్వర్ భార్య, తల్లి ని పరామర్శించి తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ప్రస్తుతం సాయి ఈశ్వర్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యం గురించి ఆర్ఎంవో కల్యాణ్, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకోగా, తన చావుతో నైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వస్తుందని భావించి సాయి ఈశ్వర్ తన ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మబలిదానానికి సిద్ధపడ్డారని, ఇది చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పోరాడి 42 శాతం రిజర్వేషన్ ను సాధించుకుందామని, బిసి బిడ్డలు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.
సాయి ఈశ్వర్ పై ఆధారపడి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని అన్నారు. రెండేళ్ల నుండి కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తూ పంచాయితీ ఎన్నికలలో 17 శాతం అమలు చేస్తూ తీరని మోసం చేసిందని విమర్శించారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే వెంట మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, శ్రీకాంత్ రెడ్డి, మహేందర్ గౌడ్, అంబులెన్స్ సురేష్, మహేష్ యాదవ్, కుమార్ యాదవ్, అబ్బాస్, శ్రీనివాస్, సుధాకర్, తదితరులు ఉన్నారు.