– 96 గంటల్లో .. ఆరొందల కోట్ల మందు తాగేశారు!
– నాలుగురోజుల్లో 600 కోట్ల లిక్కర్ అమ్మకాలు
– తెలంగాణలో చలి ప్రభావంతో వైన్ షాపులు కిటకిట బలం చూపిన ‘బీర్’బలలు
– నాలుగు రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు
– రెండేళ్లలో 71వేల కోట్ల అమ్మకాలు
– ‘మందు’కుపోతున్న జనం
(అన్వేష్)
హైదరాబాద్: గంటకు 6 కోట్ల 25 లక్షల కోట్లు..ఒకరోజుకు 150 కోట్లు.. 96 గంటల్లో 600 కోట్ల రూపాయలు. ఏమిటీ చిత్రగుప్తుడి లెక్కలనుకుంటున్నారా? ఇవి మామూలు లెక్కలు కావు. ‘మందు’చూపుతో వేసిన లెక్కలండీ! అర్ధం కాలేదా? మరి వినండి. తెలంగాణ రాష్ట్రంలో కేవలం నాలుగురోజులుల్లో మందుబాబులు తాగిన కిక్కు ఖరీదు ఇది! మీకు అర్ధమవుతోందా? తెలంగాణలో ‘చలి పులి’ కేవలం నాలుగురోజుల్లో 600 కోట్ల రూపాయల మందు తాగేసింది. నమ్మడం లేదా? నిజం. తెలంగాణ రాష్ట్రం ‘చలి’కిస్తున్న క్రమంలో ..మందుబాబులు చలి తట్టుకోలేక, వైన్ షాపుల ముందు క్యూలు కడుతున్నారు. చలికాలంలో వెచ్చగా ఉండే విస్కీ, బ్రాంది, జిన్, ఓడ్కా తెగ అమ్ముడుపోతున్నాయట.
ఆ ప్రకారంగా రికార్డు స్థాయిలో కేవలం నాలుగురోజుల్లో 600 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగాయట. ఆ విధంగా చలికాలంలో దుప్పటిముసుగేసుకుని పడుకోకుండా.. జనం ఆ విధంగా ‘మందు’కుపోతున్నారన్నమాట! ‘మందో’నారాయణ! నాలుగు రోజుల్లోనే దాదాపు 600 కోట్ల రూపాయల మద్యం సేల్స్ జరిగాయి. డిసెంబర్ 1వ తేదీనుంచి 4వ తేదీ రాత్రి వరకు 578.86 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి. 2023-25 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగిసింది. ఈ రెండేళ్లలో మద్యం అమ్మకాలు ఊహించని విధంగా పెరిగాయి. గత రెండేళ్లలో 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.
పాత పాలసీ ప్రారంభమైన 2023 డిసెంబరులో ఏకంగా రూ.4,297 కోట్ల వ్యాపారం జరిగింది. అనంతరం 2024 జనవరి నుంచి డిసెంబరు వరకు రూ.37,485 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు రూ.29,766 కోట్ల అమ్మకాలు జరిగాయి. నాలుగు రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది నాలుగు రోజుల్లో 4.26 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్ సేల్స్ 107 శాతం పెరిగాయి. సో.. పదండి ముందుకు.. పదండి ‘మందు’కు..