విజయవాడ: 15ఏళ్ళు దాటి ఉంటుంది ఏమో… ఫోర్ మెన్ బంగ్లా ప్రాంతానికి ఆర్టీసీ బస్సులు వచ్చి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కోసం రోడ్లు తవ్వేసి నెలల తరబడి పూర్తి చేయక పోవడంతో చాలా ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్సులు రావడం ఆగిపోయింది.
పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని ఫోర్ మెన్ బంగ్లా నుంచి 23A గంగూరు, 28A ఏలూరు రోడ్డు -రామవరప్పాడు రింగ్ , బెంజ్ సర్కిల్, PNBS, ఫోర్ మెన్ బంగ్లా, 37A రాయనపాడు సర్వీసులు నడిచేవి. ఉదయం 5 నుంచి రైల్వే ఉద్యోగులు, విద్యార్ధులు ఈ బస్సుల్లో గమ్య స్థానాలకు చేరేవారు.
పంజా సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్, నైజాం గేటు మీదుగా అప్ యార్డు కాలనీ వరకు బస్సులు వెళ్ళేవి. గత 15ఏళ్లుగా బస్సులు తిరగక పోవడం వల్ల పంజా వరకు వెళ్ళి బస్సులు ఎక్కాల్సి వచ్చేది. నాలుగు రోజుల నుంచి 23A గంగూరు సర్వీస్ నడుపుతున్నారు.
ఆక్రమణలే అసలు సవాలు..
పంజా సెంటర్ నుంచి అప్ యార్డు వరకు బస్సులు నడపడానికి అవకాశం ఉన్నా రోడ్లు ఆక్రమణకు గురి కావడంతో ఇబ్బందిగా ఉందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు. రోడ్డుకు రెండు వైపులా కార్లు, దుకాణాలు ఉండటం వల్ల బస్సు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని చెప్పారు.
అదే అసలు కారణం..
పాతబస్తీలో రైల్వే ఉద్యోగులు అధికంగా ఉండే ప్రాంతానికి బస్సులు కావాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు విజ్ఞప్తి చేసినా పాలకులు విస్మరించారు. దీనికి తోడు ఏటా రెండు నెలల పాటు పంజా సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు దుకాణాలతో రోడ్డు నిండిపోతుంది. పండగ పేరుతో రోడ్లను అద్దెకు ఇచ్చేయడం, వ్యాపారాలు చేయడం, దానికి ప్రజా ప్రతినిధులు అండగా నిలవడం పరిపాటిగా మారింది. రోడ్డు మొత్తం దుకాణాలు నింపేసి రెండు నెలలు వాహనాలు తిరిగే అవకాశం లేకపోవడంతో ఆర్టీసీ సర్వీసులు రద్దు చేసింది.
పండగ సీజన్ ముగిసిన తర్వాత కూడా వచ్చే ఏడాది వ్యాపారాల కోసం దుకాణాల స్థానంలో వాహనాలు పార్క్ చేసి ఉంచుతున్నారు. దీనిపై కార్పొరేషన్, పోలీసులు దృష్టి పెట్టక పోవడంతో ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే చొరవతో బస్సులు ప్రారంభం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిట్టినగర్, ప్రైజర్ పేట మీదుగా ఫోర్ మెన్ బంగ్లా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.