గతవారం ఒక జంట సంతోషంతో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వారికి పుట్టిన బాబు ఫొటోస్ అవి. అందులో పెద్ద విశేషం ఏమీలేదు. కానీ ఆ జంట పదినెలల క్రితం ఒక సమస్యతో సలహా కోసం వచ్చారు. వారు ఒక స్నేహితురాలి దగ్గర పని చేస్తున్న జంట. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ టెస్ట్ కోసం వెళితే దానితోపాటు హెచ్ఐవి పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
సలహా కోసం వచ్చిన ఆ సమయంలో ఆ అమ్మాయి మాత్రం చాలా నిబ్బరంగా ఉన్నది. ఆయనకు ఎలా వచ్చింది, ఎప్పడు వచ్చింది అనేది అనవసరం. ఇప్పుడైతే తనకు కూడా వచ్చింది కాబట్టి గొడవలు పడటం కాకుండా బిడ్డను కని పెంచాలనేదే తన కోరిక అని చెప్పింది. ఆ అమ్మాయి భర్త ఏమీ మాట్లాడటం లేదు కానీ కొద్దిగా అవమానంగా ఫీల్ అవుతున్నట్లే కనిపించాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఆ అమ్మాయి కుటుంబం, ముఖ్యంగా ఆ అమ్మాయి సోదరుడు తానే తీసుకుని వచ్చాడు.
ఆ అబ్బాయి చెప్పేది ఒకటే. వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టంగానే ఉన్నప్పుడు గొడవపడకుండా, బిడ్డకు జన్మనిచ్చి అందరిలానే బ్రతికితే బాగుంటుంది అనేది తన అభిప్రాయంగా చెప్పాడు. ఆ అమ్మాయి కుటుంబాన్ని అయితే అభినందించాలి. వారి నిర్ణయానుసారం చేయాలనుకుంటే నిబంధనలకు అనుగుణంగా వారేం చేయాలో దానికి సిద్ధం అని నిర్ణయానికి వచ్చారు. ఆ అమ్మాయి కలలుగన్న ప్రెగ్నెన్సీ వచ్చిందని సంతోషపడాలో, హెచ్ఐవి గురించి బాధపడాలో అర్థంకాని పరిస్థితి ఆ అమ్మాయిది. ట్రీట్మెంట్ లాంటివి గవర్నమెంటు చూసుకొంటుంది. కానీ వారి యజమానురాలు సంకట పరిస్థితుల్లో పడింది.
మెయిడ్ కి వారి యజమానురాలికి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ అమ్మాయిని తీసెయ్యాలా, ఉంచాలా అనే సంకటం. హెచ్ఐవి సోకటానికి కారణాలు తెలుసు. ఆ అమ్మాయి మన ఇంట్లో పని చేసినంత మాత్రానో, ఆమె టచ్ చేసిన పాత్రల్లో తిన్నందువలనో ఆ వ్యాధి సోకదు. సలైవా ద్వారా కూడా వ్యాధి సోకే ప్రమాదం లేదని అవేర్ నెస్ క్యాంపులు పెట్టి ప్రభుత్వాలు అందరికీ తెలియ చేస్తున్నాయి. కానీ పట్టణాలలో వుండే గేటెడ్ కమ్యూనిటీలో మనకిష్టమైన రీతిగా అందరినీ లోపలికి రానివ్వకూడదు. కమ్యూనిటీకి విషయం చెప్పి వాళ్ళ అంగీకారంతోనే పర్మిషన్ ఇవ్వాలి. వారు పని చేసేది ఇండిపెండెంటు ఇల్లు కాబట్టి ఆ సమస్య వుండదు. కానీ కుటుంబసభ్యుల ఆమోదం ఉండాలి.
కుటుంబం మొత్తానికి మెయిడ్ పట్ల అభిమానం ఉన్నది కానీ, వచ్చిపోయే స్నేహితులు, బంధుమిత్రులు ఇబ్బందిగా భావించే అవకాశం వుంది. అవకాశం అనేకంటే ఖచ్చితంగా ఇబ్బంది వుంటుంది. అలా అని మెయిడ్ ని పనిలోనుండి తీసేస్తే, కొంతకాలం పనిచేసుకొని కొంత అమౌంట్ పొదుపు చేసుకొంటేనే డెలివరీ తరువాత కొంతకాలం ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆర్ధిక వెసులుబాటు ఉంటుంది అనేది మెయిడ్ ఆలోచన. దానికి తోడుగా పనిలోనుండి తీసివెయ్యగానే ఆ అమ్మాయి ఆత్మన్యూనతాభావంతో ముడుచుకుపోయే ప్రమాదముంది.
వ్యాధి తగ్గేది కాదు కాబట్టి తానిక ఎప్పటికీ ఎటువంటి పని చేసుకోలేదు అనే ఆలోచనకు లోనవుతుంది. పని చెయ్యకుంటే గడవదు, పని చెయ్యాలంటే యజమానికి విషయం చెప్పాలి. ఒకవేళ మెయిడ్ మీద అభిమానంతో యజమానురాలు కొంతమేర ఆర్ధికసాయం చేసినా జీవితాంతం మాత్రం సరిపోదు. నిర్ణయం తీసుకోవటానికి వారి యజమానురాలికి కొంత సమయం పట్టవచ్చు.
కానీ ఇటువంటి సమస్య మనకే ఎదురైతే అని ప్రతివారు ఆలోచించాల్సిన విషయం. నైతిక విలువలు పాటిస్తున్నంత సేపూ ఎయిడ్స్ అనేది బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి జబ్బే..! కానీ అందరికీ భయం. ఎయిడ్స్ అంటువ్యాధి కాకపోవచ్చు కానీ ఎయిడ్స్ బాధితులను మాత్రం అంటరానివారిగానే చూస్తున్నది సమాజం. కుష్టువ్యాధి ప్రబలంగా సోకిన వారిని చూస్తే భయపడతారు కానీ, జాలి చూపిస్తారు. ఎయిడ్స్ సోకిన వారి పట్ల జాలి మాత్రం చూపించరు. భారతీయ సమాజంలో నిర్వచించబడినట్లుగా భావించే నైతిక విలువలకు ఎయిడ్స్ అనేది శారీరక సంబంధమైన జబ్బే కాదు, నైతికతకు సంబంధించిన తప్పు వలన వచ్చిన జబ్బు.
భారతీయ సమాజంలో తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన భావం. దశాబ్దం క్రితం అనుకొంటాను, ఎయిడ్స్ వ్యాధి సోకినందువలన కుటుంబంతో వెలి వేయబడిన ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఆమె రాసిన సూసైడ్ నోట్ చదివిన వారికి గుండె బరువెక్కిపోయింది. 65 సంవత్సరాల ఆ మహిళకు అంతకు రెండు సంవత్సరాల ముందు ఒక సర్జరీ జరిగింది. ఆ సమయంలో ఆమెకు బ్లడ్ ఎక్కించవలసి రావటం వలన ఎయిడ్స్ వ్యాధి ఆమెకు సోకి ఉంటుందని, తన నైతికతను నిరూపించుకోలేక ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని రాసింది.
కారణం తెలిసినా అప్పట్లో ఇంకా భయం ఎక్కువగా వుండేది కాబట్టి ఆమెకు అంతకంటే ప్రత్యామ్నాయం దొరికేది కాదేమో.. ఆర్థికంగా స్తోమతు ఉన్నవారి విషయం ప్రక్కన పెడితే రెక్కాడితే డొక్కాడని వ్యక్తులకు హెచ్ఐవి సోకితే వారి జీవనాధారం కుప్పకూలి పోతుంది. కేంద్రప్రభుత్వం ఎయిడ్స్ సోకినవారికి జీవితకాలం ఉచిత వైద్యసౌకర్యం కల్పిస్తున్నది. కొన్ని రాష్ట్రాలు కేంద్రప్రభుత్వ పథకాలకు తోడు పోషకాహారం అందించేందుకు పెన్షన్స్ కూడా అమలు చేస్తున్నాయి. కానీ భారతదేశంలో ఆర్థికంగా అట్టడుగువర్గాల వారిలోనే హెచ్ఐవి సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది. బ్రతుకుతెరువు కోసం కుటుంబాలను వదిలి దూరప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా దానికి ప్రధాన కారణంగా గోచరిస్తున్నది.
వ్యాధి సోకకుండా తీసుకొనవలసిన జాగ్రత్తలు తెలియకపోవటం కొంతవరకు కారణమైతే, నిర్లక్ష్యం కూడా మరో కారణమవుతున్నది. వ్యాధి సోకే కారణాలు, వైద్యసదుపాయాలు ప్రక్కన పెడితే సామాజిక బహిష్కరణ ఎక్కువ బాధిస్తున్నది. ఎవరైనా ఆదరించాలని అనుకున్నా వారిని కూడా వెలివేసే పరిస్థితి నెలకొని ఉన్నది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు తాము ఎయిడ్స్ తో సహజీవనం చేస్తున్నామంటే వారిని కధానాయకుడు అన్నట్టు ప్రశంసిస్తారు, సెల్ఫీలు తీసుకొంటారు. కానీ తమ చుట్టుపక్కల ఎవరైనా వుంటే మాత్రం భయపడతారు.
ఇక వారి పిల్లలకు చదువు చెప్పించటం అనేది మరీ కష్టం. సోకిన వ్యాధితో అల్లాడిపోతూ, ఉపాధిని కూడా కోల్పోయి, సమాజ బహిష్కరణకు గురై బాధపడే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఉపాధి అవకాశాల గురించి ప్రభుత్వాలే ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకొంటే బాగుంటుంది. ప్రభుత్వాలు చేయగలిగినంత చేస్తూనే ఉన్నాయి. కుటుంబాలు కూడా అంత సపోర్టుగా ఉండాలి. కుటుంబాలే దూరం పెడితే సమాజం మరీ దూరం పెడుతుంది.
హెచ్ఐవి బాధితులను కుటుంబాలు, సమాజం కూడా ఆదరించాలి. వారిని దూరం పెట్టే కొద్దీ సమస్యను దాచటం పెరిగిపోతుంది. అది మరీ ప్రమాదం. ప్రభుత్వం, కుటుంబం, సమాజం అందరూ చైతన్యవంతంగా వ్యవహరిస్తే, హెచ్ఐవి ని సమూలంగా నిర్మూలించవచ్చు.
– ఇంద్రాణి