– సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ… ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే ఎందుకంత ధైర్యం చేస్తున్నావని నన్ను కొంతమంది అడిగారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కావాల్సింది ధైర్యం కాదు.. అభిమానం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం యూనివర్సిటీలో మాట్లాడారు. గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని యూనివర్సిటీకి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చా… ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చా.
తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉంది. ఆ చైతన్యం, పౌరుషానికి చదువుతో పనిలేదు. ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతీసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యంపై పోరాటం కొనసాగింది. మన సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే తెలంగాణ సాధనతోనే జరుగుతుందని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారు. పీవీ నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది.
మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచింది. తెలంగాణ వస్తే మా తమ్ముళ్ళు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదు. మా తమ్ముళ్ళు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నాం. పదేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని అంటున్నారు. అవును.. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా..
నేనేం గుంటూరులో చదువుకోలేదు.. నాకు గూడుపుఠానీ తెలియదు.
నాకు విదేశీ భాష రాకపోవచ్చు.. కానీ నాకు పేదవాడి మనసు చదవడం వచ్చు… పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు. పేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. చేతనైతే ఆర్ట్స్ కాలేజీకి రమ్మని ఒకాయన గతంలో సవాల్ విసిరాడు. నాకేం ఫామ్ హౌసులు లేవు.. నేనేం ప్రజల సొమ్ము దోచుకోలేదు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా… చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే నా ఆకాంక్ష.
రెండేళ్లల్లో మీరేం చేశారని కొందరు అడుగుతున్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెడితే రాష్ట్ర గీతంగా గుర్తించాం. పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు. బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేసి సామాజిక న్యాయం చేశాం.
బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం.
కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన చేపట్టే పరిస్థితులు కల్పించాం. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు.. ఉన్నది ఉన్నట్టు చెబితే మమ్మల్ని విమర్శిస్తున్నారు. వాళ్లను నేను ఒక్కటే అడగదలచుకున్నా…. వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకున్నోళ్లు పదేళ్లలో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చు .. కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనం. విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలుగుతుంది. ఇప్పుడు విద్య అందుబాటులో ఉంది.. కానీ నాణ్యమైన విద్య కావాలి. అందుకే అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం సంకల్పించింది.
విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది.. జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కులవివక్షను రూపి కులం అడ్డుగోడలను తొలగించేందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఆనంద్ మహీంద్రా చైర్ పర్సన్ గా, గొప్ప వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి మీకు స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశాం. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం.
గొప్ప గొప్ప వ్యక్తులను బోర్డ్ డైరెక్టర్లుగా నియమించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారు. పేదలకు ఏదైనా చేయాలనేదే నా తపన. అందుకే రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించాం. తెలంగాణకు పట్టిన చీడ, పీడను ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. ఇంగ్లీషు భాష ఒక కమ్యూనికేషన్ మాత్రమే.. అది నాలెడ్జ్ కాదు.
మనకు నాలెడ్జ్, కమిట్ మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశాం. ఇందులో ఎలాంటి పొలిటికల్ ఆబ్లిగేషన్ లేదన్నారు. ఇదిలావుండగా, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్, డిజైన్స్ పై విద్యార్థుల అభిప్రాయాలు, సూచనల కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. విద్యార్థుల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా తుది మాస్టర్ ప్లాన్, డిజైన్లను యూనివర్సిటీ ఖరారు చేయనుంది.