– భూమి స్థితిని మార్చని అధికారులు
– సబ్ డివిజన్ లేకుండానే రిజిస్ట్రేషన్
– ఇప్పటికే రికార్డుల్లో చెరువు భూమిగా చూపిస్తున్న సర్వే నంబర్లు
– కోర్టు కేసు నేపథ్యంలో ఆందోళన
రాజధాని నగరంలో సమీకరణ పద్ధతిలో భూములు తీసుకున్న ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువు భూముల్లో కేటాయించింది. తుళ్లూరు, దొండపాడులో వీటికి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. భూమి స్థితిని మార్చకుండా ప్రభుత్వం ఈ కేటాయింపులు చేయడంతో రికార్డుల్లో అవి నిషేధిత భూములుగానే కనిపిస్తున్నాయి. ఇటీవల వడ్డమాను గ్రామంలో ఒక రిజిస్ట్రేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో కలకలం రేపింది.
తుళ్లూరులో సర్వే నెంబరు 80లో 35.91 ఎకరాల చెరువు భూమి ఉంది. చెరువుల్లో నీటి పరిమాణం క్రమేణా తగ్గిపోవడంతో.. గతంలో అక్కడ సాగు చేసుకునేందుకు, నివాసానికి ఎసైన్డ్ పద్దతిలో ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే సమీకరణ ప్రారంభమైన మూడేళ్ల తరువాత అనగా 2018లో వాటిని అసైన్డ్ భూములుగా చెరువుగా గుర్తిస్తూ ప్రభుత్వ ఆర్సి నెంబరు 4245/2015/ఈ1 ప్రకారం 2018 ఆగస్టు 21వ తేదీన నోటిఫై చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సర్వే నెంబరును అసైన్డ్గా ప్రభుత్వం గుర్తించింది.(ఖాతా నెంబరు 0710006). అనంతరం అభివృద్ధి చేసి ప్లాట్లు ఇచ్చే సమయంలో భూమి స్థితిని కూడా మార్చలేదు.
ప్లాట్లు వేసి రైతులకు ఇచ్చేయడంతో ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబరు 80ని చెరువు భూమిగా చూపిస్తోంది. వాస్తవంగా ఒక సర్వే నెంబరులో భూములు ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో వాటిని సబ్ డివిజన్ చేయాల్సి ఉంది. అయితే నోటిఫికేషన్ ఉండటంతో దాన్ని సబ్ డివిజన్ చేయకుండానే 2019 ఫిబ్రవరి 13వ తేదీన 65 మందికి రిజిస్ట్రేషన్లు చేసేశారు. అలాగే పిచ్చుకలపాలెంలోనూ సర్వే నెంబరు 87లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా చెరువు భూమిని నోటిఫై చేస్తూ 2018 ఆగస్టు 21వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారు(ఖాతా నెంబరు 0170007).
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం నడుస్తోంది. గ్రామ పంచాయతీల్లో ఉన్న వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఆస్తులను గుర్తించాలని 2011లో ప్రభుత్వం జిఓ నెంబరు 188 జారీచేసింది. ఇది అమలుకు నోచకపోవడంతో సమాచార హక్కు సమైక్య వేదిక ఆధ్వర్యాన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి 47/2025 నెంబరు కేటాయించింది.
దీనిపై విచారించిన కోర్టు జిఓ నెంబరు 188లోని క్లాజ్ 3(సి) ప్రకారం గ్రామ పంచాయతీల్లోని అన్నిశాఖల భూములను గుర్తించాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. దీంతో అన్ని జిల్లాల్లో తొమ్మిది మందితో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి భూములస్థితిని గుర్తించడంతోపాటు వాటిని రక్షించాలని ఆదేశించింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో భూమి స్థితిని మార్చడం అంత తేలికైన విషయం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నేలపాడు, మందడం, వెలగపూడి వంటి గ్రామాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి.
– వల్లభనేని సురేష్
9010099208