– ఇండిగో సమస్య ఈరోజు మొదలైంది కాదు
– రామ్మోహన్ రాజీనామా చేస్తే తీరేది కాదు
– ఇండిగో చేతులెత్తేస్తే భారత విమానయానం చేతులెత్తేసినట్లే
– టీడీపీని జాతీయమీడియా టార్గెట్ చేస్తున్నా బీజేపీ స్పందించదేం?
రామ్మోహన్ నాయుడుని అవసరాన్ని మించి టార్గెట్ చేయటం వెనుక ఏదైనా మర్మం ఉన్నదా?
అకస్మాత్తుగా అమెరికా సేనలు అఫ్గానిస్తాన్ ను తాలిబన్స్ కు అప్పచెప్పి, వెనుకకు మరలినప్పుడు, తాలిబన్స్ తమ ప్రాంతానికి రాకముందే పారిపోవాలని, ఏ విమానం దొరికితే అది ఎక్కే ప్రయత్నం చేసి, ఎయిర్పోర్టులో తొక్కిసలాడుకున్నారు ఆఫ్గన్లు.
ఇప్పుడు భారతదేశంలో విమానాశ్రయాలు అలాగే కిక్కిరిసి పోతున్నాయి. ఇండిగో చేసిన నిర్వాకం వలన డొమెస్టిక్ ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాలలో కాందిశీకుల్లా ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ఇండిగో సంక్షోభానికి పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు రాజీనామా చేయాలని కొంతమంది అంటున్నారు. అర్నాబ్ గోస్వామి లాంటివారు సమస్యను ఒక మంత్రిత్వశాఖ వైపుకు తోస్తున్నారు.
రామ్మోహన్ రాజీనామా చేయటం, చేయకపోవటం ఎన్డీయే చూస్తుంది. ఆర్నాబ్ కోరుకున్నట్లు ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా సమీక్షచేయాలి. అయితే ఇండిగో సమస్య ఒక్కటే కాదు, రూపాయి మారకంవిలువ మున్నెన్నడూ లేని విధంగా పడిపోవటాన్ని కూడా సమీక్షించాలి. ఢిల్లీ కారుబాంబు కేసు గురించి కూడా సమీక్షించాలి. ఢిల్లీ పర్యావరణం గురించి తప్పనిసరిగా సమీక్షించాలి. అర్నాబ్ గోస్వామి అయినా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపించే వారు ఎవరైనా, దేశంలో ఉన్న అన్ని సమస్యల గురించి కూడా గళమెత్తితే బాగుంటుంది.
వైసీపీ రామ్మోహన్ నాయుడును టార్గెట్ చేయవచ్చు. బీజేపీ మంత్రిత్వ శాఖల్లో వస్తున్న సమస్యలను నేషనల్ మీడియా ప్రస్తావించకపోవటం ప్రస్తుతం దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య. ఇండిగో సమస్య ఈరోజు మొదలైంది కాదు, రామ్మోహన్ రాజీనామా చేస్తే తీరేది కాదు. ఇది ఆర్నాబ్ కు తెలియని విషయం కాదు. కార్పొరేట్ సెక్టార్ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించేవారు లేకపోవటం, భారతదేశాన్ని ఎటువైపుకు తీసుకెళుతుందో అర్ధం కావటంలేదు. పాలకపక్షం, ప్రతిపక్షం ఒకరికొకరు శత్రువుల్లా వ్యవహరించటం, ఈదేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య.
సంవత్సరానికి నలభైకోట్ల ప్రయాణికులకు నాణ్యతతో కూడిన సేవలను అందించవలసిన విమానయాన సంస్థలలో అరవై శాతం పైగా ఒక్క ఇండిగో సంస్థ చేతుల్లో ఉన్నది. అందుకే డీజీసీఏ ఈ సంక్షోభానికి కారణంగా భావిస్తున్న నిబంధనలను ఉపసంహరించుకోవలసి వచ్చింది. కేంద్రం దిగివచ్చిందే తప్ప ఇండిగో దిగిరాలేదు. అంటే ఇండిగో చేతులెత్తేస్తే భారత విమానయానం చేతులెత్తేసినట్లే. ఇది ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఏమిటో కూడా అర్నాబ్ కు తెలుసు.
2012 లోనే ఈసమస్య వెలుగులోకి వచ్చింది. విమానాన్ని నడిపే పైలట్లు, ఇతర సిబ్బందికి విశ్రాంతి అవసరం కాబట్టి, డీజీసీఏ నిబంధనలు విధించింది. నిబంధనలు రూపొందించింది కూడా కోర్టు ఆదేశాల మేరకే అనేది ఇప్పుడు గమనించవలసిన విషయం. డీజీసీఏ రూపొందించిన నిబంధనలు ఫార్మల్ గా విమానయాన సంస్థలకు పంపించారు కానీ, వాటికి అనుగుణంగా విమానయాన సంస్థలు అడుగులు వేశాయా లేదా అనే విచారణ జరగలేదు. శీతాకాలంలో ఇండిగో సంస్థ తాను ఎన్ని ప్రయాణాలు చేస్తుందో లిస్టు ఇచ్చినప్పుడైనా.. డీజీసీఏ నిబంధనల ప్రకారం అవసరమైన సిబ్బందిని సమకూర్చుకున్నారా లేదా అనేది కనీసపు విచారణ చేయలేదు.
అకస్మాత్తుగా నిబంధనలు అమలు చేయవలసిందే అనగానే ఇండిగో సంస్థ తాను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నడపవలసిన విమానాలు రద్దుచేసి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. డీజీసీఏ నిబంధనలకు అనుగుణంగా పైలట్లకు విశ్రాంతి కల్పించాలి అంటే పైలట్లను నియమించుకోవాలి. పైలట్లను నియమించుకుంటే ఖర్చులు పెరగటం ఒక్కటే సమస్య కాదు. పైలట్లు దొరకాలి. పైలట్లు దొరకాలంటే విమానాలు నడిపే వారికి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు పెరగాలి. దానిలో కూడా గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. విమానయానంలో రెండుసంస్థల ఆధిపత్యం కొనసాగుతుంటే, ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ల పైన మోనోపోలీ కొనసాగుతున్నది.
ఇంత సంక్షోభం లో రామ్మోహన్ నాయుడు తప్ప, ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ మాట్లాడకపోవటం ఆశ్చర్యకరం. 2012 నుండి పైలట్ల పై పని ఒత్తిడి తగ్గించాలని విజ్ఞప్తి చేసినా, కోర్టుకు వెళ్లి కోర్టు ఆదేశాలు తీసుకొచ్చుకునేవరకు పైలట్ల సమస్యల గురించి కేంద్రం కనీసపు ప్రయత్నం చేయకపోవటం, ఈరోజు ఈ సంక్షోభానికి కారణం. విమానాల రద్దులో కూడా కార్పొరేట్ పనితనం ఎలావుంటుందో చూపించింది ఇండిగో సంస్థ. డొమెస్టిక్ విమానాలను మాత్రమే రద్దు చేసింది ఇండిగో. విదేశీ ప్రయాణాలు రద్దు చేస్తే ఎక్కువ పరిహారం చెల్లించవలసి వస్తుంది కాబట్టి విదేశాలకు షెడ్యూల్ చేసిన విమానాలను రద్దు చేయలేదు.
ఎంత సంక్షోభంలోనైనా కార్పొరేట్ సంస్థలు తమ లాభాలను గురించి మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నో విమానయాన సంస్థలు వచ్చాయి, పోయాయి. ఇప్పుడు కూడా దేశంలో ఉన్న విమానయాన సంస్థలు అన్నీ నష్టాలలోనే వున్నాయి, కానీ ఇండిగో ఒక్కటి మాత్రం లాభాలలో కొనసాగుతున్నది. ఇప్పుడు డీజీసీఏ విధించిన నిబంధనలు అమలు చేయటానికి ఫిబ్రవరి వరకు సమయం ఇచ్చింది కానీ ఈలోపుగా ఇండిగో అంత సిబ్బందిని నియమించుకోగలదా అనేది సందేహమే. ఇప్పుడు కేంద్రం ఈ సమస్య లోతుల్లోకి వెళ్లకుంటే, ఇప్పుడు ఇండిగో సృష్టించినట్లే భవిష్యత్తులో ఏ సంస్థ అయినా సంక్షోభం సృష్టించగలుగుతుంది.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇండిగో సీఈఓ ని మార్చుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానివలన ఎటువంటి ప్రయోజనం వుండకపోవచ్చు. ప్రస్తుతం ఇండిగో సృష్టించిన సంక్షోభం దేశంలో విమానయాన రంగం భవిష్యత్తును సూచిస్తున్నది. విమానయానం అన్నది ఇప్పుడు లగ్జరీ కాదు, అవసరం. వీటన్నిటి మధ్య తలెత్తుతున్న మరో సందేహం
ఎన్డీఏ నాయకత్వ స్థానంలో ఉన్న బీజేపీ ఏమీ మాట్లాడకపోయినా.. వారి అనుంగు మీడియా మాత్రం రామ్మోహన్ నాయుడుని అవసరాన్ని మించి టార్గెట్ చేయటం వెనుక ఏదైనా మర్మం వున్నదా అని. ఆర్నాబ్ గోస్వామి లాంటి వాళ్లు టీడీపీ అధికార ప్రతినిధులను డిబేట్ కు పిలిచి మరీ అవమానించటం స్పష్టంగా కనిపిస్తున్నది. సంక్షోభ సమయాలు వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి స్పందిస్తే బాగుంటుంది.
మణిపూర్ లో విరామం లేకుండా రెండు సంవత్సరాలు హింసాకాండ జరిగినప్పుడు కూడా మౌనాన్నే పాటించారు. ఇప్పుడు బీజేపీ అనుకూల మీడియా, భాగస్వామ్య పక్షాన్ని టార్గెట్ చేస్తున్నా ఎన్డీయే ప్రభుత్వ కెప్టెన్ గా ప్రధానమంత్రి కానీ సహచర బీజేపీ మంత్రులు కానీ స్పందించకపోవటం మాత్రం అనేక అపార్థాలకు తావిస్తున్నది.
పొత్తుధర్మంలో భాగంగా భాగస్వామ్యపక్షాలు అవసరం ఉన్నా లేకపోయినా ప్రధానమంత్రి జపం చేస్తూనే ఉంటారు. అటువంటి సంబంధాలు ఉన్నప్పుడు భాగస్వామ్య పక్షాలు కూడా తమ నుండి కొంత మద్దతును కోరుకుంటాయి అని బీజేపీ కూడా గ్రహిస్తే బాగుంటుంది అనుకోవటం సహజమే.!
– ఇంద్రాణి.