— డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రజలకు అంకితం చేసిన ఈ క్షణం నా జీవితంలో మరపురాని ఘట్టం. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణ ప్రజల స్వప్నాలకు జీవం పోసే ఆశయాల ప్రతిబింబమే ఈ విజన్ డాక్యుమెంట్.
3 ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక లక్ష్యం సాధనలో సమాన అవకాశాలు, సుస్థిర భవిష్యత్తు, సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. తెలంగాణలోని ప్రతి వర్గం, ప్రతి పౌరునికి న్యాయం చేకూరేలా — అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు, ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులైన గొప్ప మేధోవేత్తలు కలిసి ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో తమ వంతు పాత్ర పోషించారు.
ఎందరో మహానుభావుల త్యాగాల ద్వారా ఏర్పడిన ఈ తెలంగాణ గడ్డ, ఇప్పుడు ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందిన అగ్రదేశాలతో పోటీ పడి, అభివృద్ధి చెందే స్థాయికి తెలంగాణను తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించబడ్డాయి.