– “విజన్ 2047 డాక్యుమెంట్”లో కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్
– పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ మోసాలకు అడ్డుకట్ట
– “ఎస్ సీ ఎస్ సీ కాంక్లేవ్ 2025” లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణను “డిజిటల్ సేఫ్టీ”లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే “తెలంగాణ రైజింగ్ విజన్ – 2047” డాక్యుమెంట్ లోనూ కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ను పొందుపర్చామన్నారు.
గురువారం హెచ్ఐసీసీ లో నిర్వహించిన “సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్ సీ ఎస్ సీ) కాంక్లేవ్ 2025″ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు సవాలు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 265 మిలియన్లకు పైగా సైబర్ దాడులు జరిగాయన్నారు. తెలంగాణలోని కీలక రంగాలకు చెందిన సంస్థలు, కంపెనీలపై గతేడాది 17వేలకు పైగా రాన్సమ్ వేర్ దాడులు జరిగినట్లు ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ అధ్యయనంలో తేలిందన్నారు.
ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఏడాది వ్యవధిలో రూ.800 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టడం వాస్తవ పరిస్థితికి నిదర్శనమన్నారు. ఇలాంటి తరుణంలో సాంప్రదాయ పోలీసింగ్ కాకుండా స్మార్ట్ పోలీసింగ్ అవసరమని గుర్తు చేశారు. పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని వివరించారు. మోసం జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసి వ్యవస్థ అవసరమన్నారు.
కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డేటా సిస్టమ్స్, రియల్ టైం మానిటరింగ్, ఓపెన్ ఇన్ఫర్మేషన్ లాంటి అధునాతన వ్యవస్థల ద్వారా తమ ప్రభుత్వం పౌరుల డిజిటల్ సేఫ్టీకి చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ… వారిని “వారియర్స్”గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) లారా విలియమ్స్, ఏడీజీపీ చారుసిన్హా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఎస్ సీ ఎస్ సీ సెక్రెటరీ జనరల్ రమేష్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.