– కమీషన్ల కోసం విద్యార్థి మిత్ర పథకాన్ని వాడుకున్నారు
– రూ. 2,279లు వెచ్చించి తయారు చేసిన బ్యాగ్ ఉండేది ఇలాగేనా?
– నాలుగేళ్లలో విద్యార్థి కానుక కిట్ కోసం రూ. 3,366 కోట్లు ఖర్చు
– 43 లక్షల మంది విద్యార్థులకు వైయస్సార్సీపీ హయాంలో లబ్ధి
– కిట్లో 3 జతల యూనిఫారాలు, రెండు జతల బూట్లు, రెండు జతల సాక్సులు,బైలింగ్విల్ డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీ, బెల్టు, టై, బ్యాగ్
– కేవలం ఒకే ఒక్క బ్యాగుకే రూ. 2,279 వెచ్చించిన కూటమి ప్రభుత్వం
– పైగా 8 లక్షల మంది విద్యార్థులకు అందించకుండా మోసం
తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర
తాడేపల్లి: స్కూల్ విద్యార్థుల స్కూల్ బ్యాగులను కూడా వదలకుండా కూటమి నాయకులు అవినీతి దాహార్తిని తీర్చుకుంటున్నారని, రెండు వేలకు పైగా వెచ్చించామని చెబుతున్న స్కూల్ బ్యాగులు నెలరోజులు కాకుండానే చినిగిపోతున్నాయని వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాణ్యతను మూడు దశల్లో తనిఖీ చేశామని చెబుతున్నా.. కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన బ్యాగులు చినిగిపోతుండటంతో ఇప్పటికీ వైయస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న విద్యాకానుక కింద పంపిణీ చేసిన బ్యాగులనే విద్యార్థులు పాఠశాలలకు తీసుకెళ్తున్నారని వివరించారు. షూలు కూడా విద్యార్థుల సైజుకి సరిపోకపోవడంతో పాతవే వాడుకుంటున్నారని చెప్పారు.
వైయస్సార్సీపీ పాలనలో 43 లక్షల మందికి రూ. 3,366 కోట్లు ఖర్చు చేసి విద్యాకానుక కిట్ లు పంపిణీ చేస్తే, కూటమి పాలనలో కేవలం 35 లక్షల మందికి మాత్రమే కిట్లు పంపిణీ చేశారని రవిచంద్ర చెప్పారు. జగనన్న విద్యాకానుక పథకానికి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా పేరు మార్చడమే కాకుండా కమీషన్ల కోసం అవినీతిమయంగా తయారు చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్నే అవమానించారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు “డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర” పేరుతో బ్యాగులు పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 లక్షల మందికి పైగా విద్యార్థులకు పంపిణీ చేశామని, ఇందుకోసం సుమారు రూ.953 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో బ్యాగు విలువ రూ. 2,279 వెచ్చించి నాణ్యమైన బ్యాగులు అందించామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వం కంటే తక్కువ రేటుకు తయారు చేసి, ప్రజాధనాన్ని ఆదా చేశామని, నాణ్యమైన బ్యాగులు అందజేశామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. నాణ్యతను మూడు దశల్లో తనిఖీ చేశామని కూడా చెప్పారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు అవుతున్నా, పూర్తి స్థాయిలో బ్యాగులు అందించలేకపోయారు. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు నాణ్యత లోపంతో నాసిరకంగా ఉన్నాయి. బ్యాగులు తీసుకున్న విద్యార్థులకు కేవలం నెల రోజులు, 20 రోజులు, లేదా రెండు నెలల లోపలే చినిగిపోయాయి. విద్యార్థులు చినిగిపోయిన బ్యాగులను కుట్టించుకుని, అతుకులు వేసుకుని స్కూళ్లకు వెళ్తున్నారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడటం వల్లే బ్యాగుల తయారీలో నాణ్యత లోపించి నెలరోజులు కాకుండానే చినిగిపోతున్నాయి. విద్యార్థులకు సరఫరా చేసిన బ్యాగుల్లో పెద్ద ఎత్తున కమిషన్లు చేతులు మారాయని తెలిసిపోతుంది. రూ. 2,279 లతో తయారు చేయించిన బ్యాగులు ఇలాగే ఉంటాయా?
గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక ఏడాది కోవిడ్ తీసేసినా జగనన్న విద్యా కానుక పేరుతో నాలుగేళ్లలో సుమారు రూ. 3,366 కోట్లు ఖర్చు చేసి 43 లక్షల మందికి మూడు జతల యూనిఫారాలు, రెండు జతల బూట్లు, రెండు జతల సాక్సులు, బైలింగ్విల్ డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీ, బెల్టు, టై, బ్యాగ్ తో కూడిన కిట్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాగులను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో క్వాలిటీ కౌన్సిల్ సంస్థతో మానిటరింగ్ చేయించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు చిరిగిపోవడంతో, విద్యార్థులు గతంలో వైయస్ జగన్ గారు ఇచ్చిన నాణ్యమైన బ్యాగులనే ఇప్పటికీ స్కూళ్లకు తీసుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన బ్యాగులు ఎంత దారుణంగా చెప్పడానికి ఇదే నిదర్శనం. మూడు దశల్లో నాణ్యత తనిఖీ చేసిన బ్యాగులు ఇలా నెలరోజులకే చిరిగిపోతాయా? పైగా జగనన్న విద్యాకానుక ద్వారా గత వైయస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 43 లక్షల మంది విద్యార్థులకు అందించగా, ప్రస్తుతం 8 లక్షల మంది విద్యార్థులను తగ్గించి 35 లక్షల మందికే ఇచ్చింది.
పైగా కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన షూ సైజులు పిల్లలకు సరిపోక చెప్పులతోనే బడికి వెళ్తున్నారు. వైయస్సార్సీపీ హయాంలో పిల్లలకు పంపిణీ చేసిన ప్రతి వస్తువున స్వయంగా నాటి సీఎం వైయస్ జగన్ పరిశీలన చేసి అందించారు. తక్కువ క్వాలిటీ ఉన్న వాటిని పిల్లలకు ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పారు. కాబట్టే ఆ బ్యాగులు, షూలను విద్యార్థులు ఇప్పటికీ భద్రంగా వాడుకుంటున్నారు.
పాఠ్య పుస్తకాల పంపిణీ దగ్గర నుంచి తల్లికి వందనం వరకు అడుగడుగునా విద్యార్థులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ₹120, 9 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ₹240 మాత్రమే స్టిచ్చింగ్ ఛార్జీలు ఇస్తున్నారు. జగనన్న విద్యాకానుకకి పేరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా పేరు మార్చి నాసిరకం వస్తువులతో ఆయన్ను కూడా అవమానించారు. సాధారణంగా జరగాల్సిన మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ కార్యక్రమాన్ని కూడా రాజకీయ ప్రచార కేంద్రంగా వాడుకుంటున్నారు.
మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చి, విద్యార్థులు తమ ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగులు ఎంత నాసిరకంగా ఉన్నాయో స్వయంగా పరిశీలన చేయాలి. బ్యాగుల తయారీలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేసి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల కోసం బాగా చేశామని మీడియాలో ప్రగల్భాలు పలకడం కాకుండా చేతల్లో చేసి చూపించాలి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, విద్యాశాఖలో జరుగుతున్న సమస్యలను అధ్యయనం చేసి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం హెచ్చరిస్తోంది.