* 2014-19 మధ్యకాలం ఈడబ్ల్యూఎస్ కులాలకు స్వర్ణయుగం
* కాపుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు పెద్దపీట
* బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఇతర ఈబీసీ కులాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
* త్వరలో నూతన విధానంలో విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ
* ఈడబ్ల్యూఎస్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి ఆత్మీయ సమావేశం
– * రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరహాలో అన్ని ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ లో కూడా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్తను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజక వర్గంలోనూ ఏర్పాటు చేయనున్నట్టు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు.
అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల ఆర్థిక వృద్ధికి ఆయా కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టాలని సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఆయా కుల సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఇతర ఈబీసీ కులాల సాధికారితకు పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్ కులాల అభ్యున్నతే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యమన్నారు. వివిధ పథకాల అమలులో భాగంగా 2025-26 బడ్జెట్ లో ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం రూ.10,608.61 కోట్లు కేటాయించిందన్నారు. వాటిలో ఈబీసీలకు రూ. 915.28 కోట్లు, కమ్మ కార్పొరేషన్ కు రూ.1,711.42 కోట్లు, రెడ్డి కార్పొరేషన్ కు రూ.1,946.36 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్ కు రూ.260.20 కోట్లు, కాపు కార్పొరేషన్ కు రూ.4,884.83 కోట్లు, ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.545.05 కోట్లు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.345.46 కోట్లు కేటాయించామన్నారు.
కాపుల అభ్యున్నతికి పెద్దపీట
కాపుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. 2014-19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.172 కోట్లతో మంజూరు చేసిన 13 జిల్లా స్థాయి కాపు భవనాలను, 487 మినీ కాపు భవనాలు/కాపు కమ్యూనిటీ హాళ్లను గాలి కొదిలేసిందన్నారు. తొమ్మి జిల్లా స్థాయి కాపు భవనాలను, 421 మినీ కాపు భవనాలు/కాపు కమ్యూనిటీ హాళ్లను రద్దు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖపట్నం, నెల్లూరు జిల్లా స్థాయి కాపు భవనాలను, అయిదు కాపు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. 50 శాతం పనులతో అసంపూర్తిగా నిలిచిపోయిన తిరుపతి, కర్నూలు జిల్లా స్థాయి కాపు భవనాలను, 70 శాతం పూర్తయిన 39 కాపు మినీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని మంత్రి సవిత స్పష్టంచేశారు.
త్వరలో విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ
విదేశాల్లో చదువుకోవాలనే ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కల నెరవేరుస్తూ, విదేశీ విద్యా పథకానికి త్వరలో శ్రీకారం చుడుతున్నట్టు మంత్రి సవిత తెలిపారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా 2014-19 మధ్య అయిదేళ్లలో 2,234 విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించారన్నారు. ఇందుకోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.244 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. తరవాత వచ్చిన జగన్ విదేశీ విద్యా పథకాన్ని నీరుగార్చారన్నారు. నిబంధనల పేరుతో కేవలం 60 మంది విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్య చదువుకునే అవకాశం కల్పించారన్నారు. నూతన విధానంలో విదేశీ విద్యా పథకానికి పునరుద్ధరించడానికి సీఎం చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టారని మంత్రి సవిత తెలిపారు.
కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల ఏర్పాటు
బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మాదిరిగా అన్ని ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ లో కూడా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి సవిత తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. 2014-19 మధ్య ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల కోసం అమలు చేసిన అన్నిపథకాలను తిరిగి పున:ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్యవైశ్యుల కోరిన విధంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహించామన్నారు.
వైశ్యుల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ.. కన్యకాపరమేశ్వరి మాతా జన్మస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండను వాసవీ మాత పేరు మీద జీవో జారీచేసిన విషయాన్ని గుర్తు చేశారు. కోమటి, గుప్తా, శెట్టి వంటి పేర్లకు బదులు అందరినీ ఆర్యవైశ్యులుగా సంభోదించేలా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో ఆయా ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు, డూండీ రాకేశ్, బ్రహ్మయ్య చౌదరి, బుచ్చి రాంప్రసాద్, సూర్యనారాయణ రాజు, డైరెక్టర్లు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.సునీత, ఇతర అధికారులు పాల్గొన్నారు.