– సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో, 42% బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మాహుతి చేసిన విశ్వకర్మ యువకుడు సాయి ఈశ్వర చారి స్మరణార్థంగా నిర్వహించిన సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: “42% రిజర్వేషన్ ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి, ఎన్నికల తర్వాత మాట మార్చి బీసీలను నేరుగా మోసగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీసీ సమాజం తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది” అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.
బీసీ ఆర్డినెన్స్ పేరుతో తెచ్చిన చర్యలు బీసీల ఆశలను మోసం చేసిన రాజకీయ విన్యాసాలుగా మారాయి. అలాంటి మోసం చేసిన ప్రభుత్వానికి బీసీ సమాజం శవయాత్ర నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది అని విమర్శించారు.
మరోజు వీరన్న, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వంటి మహనీయులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. మలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మోసానికి వ్యతిరేకంగా శ్రీకాంత చారి ఆత్మాహుతి చేసుకున్నారు. ఇప్పుడు 2023 ఎన్నికల్లో ‘42% బీసీ రిజర్వేషన్ ఇస్తాం’ అని ప్రజలను నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ జీవోలు–ఆర్డినెన్సుల మోసపూరిత విధానాల కారణంగా మరో అమాయక విశ్వకర్మ బిడ్డ సాయి ఈశ్వర చారి ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం ప్రజలు గ్రహించాలి. బీసీల హక్కుల కోసం ఈ పోరాటం ఆగదు” అని పిలుపునిచ్చారు. సాయి ఈశ్వర చారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది” అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హామీ ఇచ్చారు.