– తెలంగాణలో పరిస్థితులు మారతాయి
-సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయని, నిరంతరం ప్రజల వెంట ఉంటే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి ప్రజలు తిరిగి అవకాశాన్ని ఇస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడితే, ప్రజలు తప్పకుండా అండగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ అధినేత నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన అఖిలేష్, కేటీఆర్‌తో సమావేశం అయి ఆయనతో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం
రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, ఒక్కోసారి ప్రజలు మన పనితీరును, విధానాలను పునఃసమీక్షించుకునే అవకాశాన్ని ఓటమి ద్వారా కల్పిస్తారని అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ప్రస్థానాన్ని ఉదహరిస్తూ.. “గతంలో మేం కూడా చాలా తక్కువ సీట్లు గెలిచాం. కానీ ప్రజలు మా వెంటే నిలిచారు. వారి మద్దతుతోనే నేడు యూపీలో బీజేపీని రెండో స్థానానికి నెట్టి, 37 మంది ఎంపీలతో లోక్‌సభలో బలంగా ఉన్నాం. ప్రజలు ఎప్పుడు ఎవరికి అండగా నిలబడతారో ఎవరూ ఊహించలేరు. ప్రజల వెంట ఉంటే వారే తమకు అవకాశాన్ని ఇస్తారన్నారు. కచ్చితంగా తెలంగాణలోనూ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.
దేశానికి ప్రగతిశీల రాజకీయాలు అవసరం
దేశంలో ప్రస్తుతం విభజన రాజకీయాలు నడుస్తున్నాయని, వాటికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని అఖిలేష్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ప్రతికూలత పోవాలని, అభివృద్ధి- సానుకూల దృక్పథంతో కూడిన ప్రగతిశీల రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. తాము అదే విజన్‌తో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
అఖిలేష్ మాకు స్ఫూర్తి: కేటీఆర్
అంతకుముందు మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అఖిలేష్ యాదవ్‌కు ఘన స్వాగతం పలికారు. శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ, పార్లమెంటు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీగా ఎస్పీని నిలబెట్టిన అఖిలేష్ తీరు తమకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అన్నారు. అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మా పార్టీ నేతలు అఖిలేష్ కి స్వాగతం కలిపి ఆయనతో వివిధ అంశాల పైన చర్చించినట్లు కేటీఆర్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ తో సమావేశం అవుతారని తెలిపారు. ఈరోజు తనతోపాటు తన పార్టీ సీనియర్ నేతలు అందరితో చర్చించి మా పార్టీ ఆతిథ్యం స్వీకరించినందుకు అఖిలేష్ యాదవ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు, త లసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాధవరం కృష్ణారావు. ఎంపి వద్దిరాజు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి-మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్‌సభ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ తదితరులు అఖిలేష్ వెంట ఉన్నారు.