– రూ.1, 50 పైసలకే రియల్ సంస్థలకు భూపందేరం
– ఆపై అడ్డగోలుగా అదనపు రాయితీలు
– ఏం ఉద్యోగాలిస్తాయని రియల్ సంస్థలకు భూకేటాయింపులు?
– లులూ మాల్ కు అడ్డగోలు దోపిడీ
– 13.50 ఎకరాలు భూమి, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, రూ.250 కోట్లు రాయితీలు
– ఇదే లులూ గుజరాత్ లో భూమలు ఎందుకు కొంటోంది?
– ఏపీకి గుజరాత్ కి ఏంటి తేడా?
– లోకేష్ ప్రమోషన్ కోసం ప్రభుత్వ ధనంతో ప్రచారం
– వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్
విశాఖపట్నం: విశాఖ విజన్ డాక్యుమెంటు రూపొందించిన ఘనత వైయస్.జగన్ దేనని.. అందులో భాగంగానే వైజాగే రాష్ట్రానికి ఎకనమిక్ గ్రోత్ ఇంజన్ అన్న విషయాన్ని ఆనాడే చెప్పారని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేశారు.
నాటి వైయస్సార్సీపీ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికే… నేడు చంద్రబాబు నోట వినిపిస్తుందన్న ఆయన… మా విజన్ డాక్యుమెంట్ భాగమే విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటైందన్నారు. తద్వారా ఇతర పరిశ్రమల రాకకూ మార్గం సుగమం అయిందన్న అమర్… ఎవరది విజన్? ఎవరు విజనరీ?
ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉపాధి, పరిశ్రమల పేరుతో కూటమి భూదోపిడీ పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం… ఊరూ పేరు లేని సంస్థకు కారుచౌకగా భూములు అప్పగిస్తోందని మండిపడ్డారు. ఏం ఉద్యోగాలిస్తాయని రియల్ సంస్థలకు కారుచౌకగా భూకేటాయింపులు చేస్తున్నారని ప్రశ్నించారు.
మరోవైపు 13.50 ఎకరాలు భూమి, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, రూ.250 కోట్లు రాయితీలు కల్పిస్తూ… లులూ మాల్ కు చంద్రబాబు అడ్డగోలుగా కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ప్రమోషన్ కోసం ప్రభుత్వ ధనంతో ప్రచారం చేస్తూ, ఆత్మస్తుతి పరనింద తప్ప… చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పారు.
ఇన్ఫోసిస్ ను విశాఖలో నెలకొల్పాలని చెప్పినప్పుడు.. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలకు చెంది, దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నవాళ్లు ఎంతమంది విశాఖపట్నం రీలొకేట్ కావడానికి సిద్ధంగా ఉన్నారని ఇన్ఫోసిస్ సర్వే చేస్తే… దాదాపు 3000-3500 మంది ఆసక్తి చూపారు. అప్పుడే దాదాపు 1000 మందితో డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభిస్తే… ఇవాళ అది కాస్తా రెండువేలకు చేరింది. తర్వాత టీసీఎస్ తో మాట్లాడాం.
ఇవాళ మంత్రి మాట్లాడుతూ.. కాగ్నిజెంట్ చేసిన సర్వేలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 3వేల మంది విశాఖ రీలొకేట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. కానీ టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి మేజర్ కంపెనీలు పేరిట వీటిని మందుపెట్టి.. ఆయా సంస్దల పేరుతో పెద్ద ఎత్తున భూపందేరం జరుగుతుందని ప్రజలు గమనించారు. పెద్ద సంస్థలకు భూములివ్వడంలో తప్పులేదు. వారిని తీసుకువచ్చి భూములివ్వడంలో తప్పులేదు. వారిని మేము కూడా ఆహ్వానిస్తాం.
కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకు మీరు ఎందుకు రూ.1, 50 పైసలకే భూములు కేటాయిస్తున్నారు? ఇందులో ఉన్న మీ స్వలాభం ఏమిటి? ఎందుకు ఈ పెద్ద కంపెనీల పేరిట ఈ రకమైన భూపందేరాలు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు అని రకరకాల పేర్లతో రూ.20, రూ.25 కోట్ల ఖరీదు చేసే భూములను కేవలం రూ.50 లక్షలు, రూ.1 కోటికి కేటాయిస్తుంటే.. దీని వెనుక ఉన్న మీ లాలూచీ ఏమిటి? ఇవే గ్రూపులకు పక్కనున్న తెలంగాణా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుంటే.. మనం కూడా ఇస్తున్నామని చెప్పడంలో ఓ అర్ధం ఉంటుంది. ప్రజలు కూడా అంగీకరిస్తారు.
కానీ ఇవే సంస్థలు పక్క రాష్ట్ర ప్రభుత్వాలు భూములుకు వేలం నిర్వహిస్తే.. రూ.100, రూ.150 కోట్లకు భూములు కొంటుంటే.. ఇక్కడ ఎందుకు ఇంత తక్కువ ధరకు ఇస్తున్నారు? అవేవీ ఐటీ సంస్థలు కావే? అవన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలు. వాటికి రూ.1, 50 పైసలకే ఎలా భూములు కట్టబెడతారు? విశాఖలో ఉన్న ప్రభుత్వ భూములే తక్కువ, ఇక్కడున్న ప్రతి సెంటు భూమీ విలువైనది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం 400-500 ఎకరాల భూములి కట్టబెట్టింది. ఏదీ కూడా మార్కెట్ లో ఎకరా రూ.10 నుంచి రూ.20 కోట్లు తక్కువ లేని భూములను రూ.1, 50 పైసలకే కట్టబెడుతున్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవోలు చూస్తే… సత్వా, కపిల్ సంస్ధలకిచ్చిన భూముల్లో 50 శాతం రెసిడెన్షియల్ కింద వాడుకోవాలని జీవో ఇచ్చారు. అంటే విల్లాలు, అపార్టుమెంట్లు కట్టుకోవాలని జీవో ఇచ్చారు. విల్లాలు, అపార్ట్ మెంట్లు కట్టుకుంటే ఉద్యోగాల కల్పన జరుగుతుందా? భూములను తక్కువకే కట్టబెట్టడంతో పాటు వారి నిర్మాణఖర్చులో ఎస్ ఎప్ టి కి రూ.2వేల వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇన్సెంటివ్ గా ఇస్తామని చెబుతున్నారు. భూములు చౌకగా ఇవ్వడంతోపాటు వారు భవనాలు కట్టడానికి డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? పైగా కంపెనీలకు ఇచ్చిన జీవోల్లో మీరు మీకిచ్చిన లక్ష్యాలు సాధిస్తేనే రిజిస్టర్ చేస్తామని ఎక్కడా నిబంధన లేదు.
లులూ మాల్ నే తీసుకుంటే 13.50 ఎకరాలు, 99 సంవత్సరాల లీజు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, రూ.250 కోట్లు ఇన్సెంటివ్స్ ఇచ్చినా.. 14 ఏళ్లుగా లులూ మాల్ విశాఖలో కడతామని చెబుతున్నారు. ఇదే లులూ మాల్ గుజరాత్ లో తమ మాల్స్ నిర్మాణం కోసం భూమి కొనుగోలు చేస్తుంది. ఏపీకి, గుజరాజ్ కి ఏంటి తేడా? ఇదే లులూ సంస్థ హైదరాబాద్ లో అద్దెకు భవనాలు లీజుకు తీసుకుంటుంది. సొంత రాష్ట్రం కేరళలో కూడా భూములు కొంటుంది. ఇదంతా కొడుకు పబ్లిసిటీ, ప్రమోషన్ కోసమే. ప్రభుత్వ పెయిడ్ ప్రచారాన్ని, తన కొడుకు ప్రమోషన్ కోసం వాడుకుంటున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం.
ఏడెనిమిది సంస్థలకు శంకుస్థాపనల చేస్తున్నామని పత్రికల్లో యాడ్స్ ఇస్తూ.. 40వేల ఉద్యోగాలిస్తామని ప్రకటనలు ఇచ్చారు. పూర్తి వివరాలు చూస్తే.. ఒక సంస్థ 8 సంవత్సరాల తర్వాత 25వేల ఉద్యోగాలిస్తుందని, మరో సంస్థ 500 ఉద్యోగాలిస్తుందని ఉంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తై దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంతవరకు ఎంతమంది యువతకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు?
ఆ రోజు మేము ఆదానీకీ డేటా సెంటర్ గురించి భూములు కేటాయిస్తే… మొత్తం ఆదానీకీ దోచిపెడుతున్నారని గగ్గోలు పెట్టిన మీరందరూ , ఇవాళ అదే ఆదానీతో కూర్చుని మాట్లాడుతున్నారు. వైయస్.జగన్ తో ఆదానీ మాట్లాడితే ఆదానీ తప్పు, ఇవాళ మీతో కూర్చుని మాట్లాడితే ఆదానీ మంచివాడు, ఇదేనా చంద్రబాబు ఉద్దేశం?
డిప్యూటీ సీఎం ఇటీవల కాలంలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళడం చూశాం. పత్రికల్లో ఇవాళ యాడ్స్ చూస్తే.. గతానికి ఇప్పటికీ తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికలకు ముందు మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉండేవాళ్లు. ఇవాళ సీఎం చంద్రబాబు, సకలశాఖా మంత్రి లోకేష్ తప్ప మరెవ్వరూ కనబడ్డం లేదు.