చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నాలుగున్నర దశాబ్దాల ఆలోచనను రాబోయే ఎన్నికలలోనే సాకారం చేయాలని ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించలేక వీగి పోయింది.
తొలిసారి 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనకు బీజం పడింది. తొలుత 1996లో హెచ్ డీ దేవెగౌడ సారధ్యంలోని యునైటెడ్ ప్రభుత్వం, తరువాత వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టినా ఆమోదం పొందలేదు.
ఎట్టకేలకు 2023లో మహిళా రిజర్వేషన్ కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు “నారీ శక్తి వందన్ అధినయమ్, 2023″ను అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఆమోదించాయి. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా:లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు కల్పించిన 33శాతం రిజర్వేషన్లు, 2023 తర్వాత జరిగే తొలి జనగణన అనంతరం అమల్లోకి వస్తాయి.
ఇండియా కూటమి వాదన..
అంటే, ప్రస్తుతం జరుగుతున్న జనగణన పూర్తయ్యాక, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం – మహిళా రిజర్వేషన్ అమలులోకి రావాలి. కానీ 2002లో ఏర్పాటు చేసిన డిలిమిటేషన్ కమిషన్ తన నివేదికను 2008లో సమర్పించిన నేపథ్యంలో ఇంత విస్తృతమైన ప్రక్రియ 2029 ఎన్నికల లోపు పూర్తి కావడం కష్టం.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం 2029 ఎన్నికల నుండే మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు అమలు చేయాలనే ఉద్దేశ్యంతో లోక్సభలో ఏప్రిల్ 16 నుండి 18వ తేదీ వరకు జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలో నారీ శక్తి వందన అధినియం చట్టానికి సంబంధించి రాజ్యాంగ (సవరణ) బిల్లు 2026, నియోజకవర్గాల పునర్విభజన (సవరణ) బిల్లు 2026, కేంద్ర పాలిత ప్రాంతాల మహిళా రిజర్వేషన్లను విస్తరిస్తు ప్రవేశ పెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది.
తద్వారా మహిళలకు మరోసారి అన్యాయం జరిగింది. దీనికి కారణం మీరంటే మీరని అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు జతచేసి డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడం వల్లనే వ్యతిరేకించామని ఇండియా కూటమి వాదన. అలా అయితే యధాతథ స్థితిలో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలి.
దానికి ఇండియా కూటమి సిద్ధమా అంటే, గత అనుభవాల దృష్యా అసాధ్యమే. 2010లో రాజ్యసభ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఎస్పీ, ఆర్జేడీ, జెడి (యు) తీవ్ర వ్యతిరేకత వలన లోక్సభ ఆమోదం పొందలేదు. చివరకు 2014లో లోక్సభ రద్దవడంతో బిల్లు మురిగి పోయింది. ఇప్పుడు ఇండియా కూటమిలోని ఎస్పీ, ఆర్జేడీ ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలలో 33శాతం మహిళలకు కేటాయించడానికి సిద్ధపడతారా?
దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం..
1970 జనగణన ఆధారంగా జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ స్థానాలు తగ్గి, ఉత్తరాది రాష్ట్రాలకు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ క్షేమం కోసం కుటుంబ నియంత్రణ పాటిస్తే ప్రోత్సహించాల్సింది పోయి శిక్షిస్తారా అని దక్షిణ భారత దేశ ప్రజలు ఉద్యమించారు.
దేశ ప్రయోజనాలు, సమస్య సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకుని 1976లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 41వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 వరకు లోక్సభ స్థానాలను యధాతధంగా కొనసాగించాలన్న హేతుబద్ధ నిర్ణయాన్ని, 2001లో బిజెపి ప్రభుత్వం (84వ రాజ్యాంగ సవరణ) 2026 వరకు పొడిగించారు.
1971 నుండి పార్లమెంట్ స్థానాలను ఫ్రీజ్ చేసిన కారణంగా, రాజకీయ ప్రాతినిధ్యంలో రాష్ట్రాలు తీవ్రమైన అసమానతను ఎదుర్కొంటున్నాయి. దేశంలోని 127 నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, ఒక నియోజకవర్గంలో 48 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిని సరి చేయాలంటే దేశ జనాభాకు అణుగుణంగా ప్రజా ప్రతినిధుల సంఖ్యను కూడా పెంచాలి.
దేశంలో జనాభా పెరుగుదల అసమానంగా జరిగింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు రాష్ట్రాల జనాభా గణనీయంగా పెరిగింది; అందువల్ల జనాభా పరంగా అవి ప్రస్తుతం తక్కువ ప్రాతినిధ్యం పొందుతున్నాయి. 2020 కేంద్ర గణాంకాల ప్రకారం, జాతీయ సగటు సంతాన సాఫల్య నిష్పత్తి (టీఎఫ్ఆర్) 2. అయితే బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, ఛత్తీస్ గడ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల సగటు టీఎఫ్ఆర్ 2.55 కాగా , దక్షిణాది రాష్ట్రాల సగటు టీఎఫ్ఆర్ 1.5కి పరిమితం అయ్యింది.
అయితే జనాభా ఆధారంగా డిలిమిటేషన్ జరిగితే, జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణ భారత రాష్ట్రాలు, లోక్సభ స్థానాలను కోల్పోతాయి. దాంతో జాతీయ రాజకీయ వేదికపై వాటి ప్రభావం తగ్గుతుంది. ఇక ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి సూచించినట్లు జీఎస్డీపీ ఆధారంగా సీట్ల కేటాయింపు చేస్తే కేరళం వంటి రాష్ట్రాలు నష్టపోతాయి. 2011 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని వాదించిన కాంగ్రెస్ పార్టీ 2026 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేయమని కోరడమే విచిత్రం.
ధర్మబద్ధ భాగస్వామ్యం దక్కాలి..
ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య లోపించిన నమ్మకం, బిల్లు ప్రవేశ పెట్టిన సమయం, లోక్సభ స్థానాల పెంపు విషయంలో స్పష్టత కొరవడటం బిల్లు చట్ట రూపం దాల్చడానికి అవరోధాలుగా నిలిచాయి. ప్రస్తుత రాష్ట్రాల ప్రాతినిధ్య శాతాన్ని తగ్గించకుండా అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల లోక్సభ స్థానాలను 50శాతం పెంచడం వలన రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని, డీలిమిటేషన్ తరువాత లోక్సభ బలం ప్రస్తుతం ఉన్న 543 స్థానాల నుండి 850కి పెరుగుతుందని, వీటిలో 272 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేస్తామని హోమ్ శాఖా మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెలిపారు.
ఏ రాష్ట్రానికి గాని, పురుష ప్రాతినిద్యానికి గాని నష్టం వాటిల్లకుండా మహిళలకు చట్ట సభల్లో 33శాతం సీట్లను కేటాయించేందుకు ఇదే సులభమైన మార్గమని, అదే విధంగా మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా రిజర్వేషన్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రతిపాదిత చట్టంలో 2011 జనగణన ఆధారంగానే డీలిమిటేషన్ చేస్తామని ఉందని కాంగ్రెస్ అభ్యంతరం తెలిపినప్పుడు, 50శాతం సీట్ల పెంపు ప్రతిపాదనను చట్ట రూపంలో తీసుకురావడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినా ప్రతిపక్షం సహకారం అందించలేదు. అత్యంత ముఖ్యమైన బిల్లును వ్యతిరేకించడమే కాదు, పరిష్కారం సూచించడం కూడా ప్రతిపక్ష పార్టీల నైతిక బాధ్యత.
ఇటీవలి టిడిపి మహానాడులో చట్టంతో సంబంధం లేకుండా మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని టీడీపీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించడం శుభ పరిణామం. ఇద్దరు ఫహిల్మానుల మధ్య కుస్తీ పోటీలో ఓడిపోయింది భారతీయ మహిళ. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశ పాలనలో మహిళలకు ధర్మబద్ధంగా రావాల్సిన భాగస్వామ్యం చట్టబద్ధంగా లభించాలని, లభిస్తాయని ఆశిద్దాం.
- లింగమనేని శివరామ ప్రసాద్
రాజకీయ, సామాజిక విశ్లేషకులు
9521185456