- మహారాష్ట్ర సీఎం అపాయిట్ మెంట్ మేమిప్పిస్తాం
- గిల్లికజ్జాలు పెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలనుకోవడం దుర్మార్గం
- 6 గ్యారంటీలు, వడ్ల కొనుగోలు అంశాలను పక్కదారి పట్టించేందుకు మహారాష్ట్ర సీఎంపై ఆరోపణలు
- రాష్ట్రంలో ‘‘ట్రిపుల్ సీ’’ పాలన నడుస్తోంది
- కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్, కమీషన్
- రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారింది
- తెలంగాణ బాగుపడాలంటే కేంద్ర నిధులు అవసరం
- బీజేపీకి అధికారమిస్తే కేంద్రం నుండి నిధులు తెస్తాం
- అందరికీ ఇచ్చారు అధికారం…. బీజేపీకి ఇవ్వండి అవకాశం
- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
6 గ్యారంటీలు, వడ్ల కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అందులో భాగంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయిట్ మెంట్ ఇవ్వడం లేదని, ఉప్పెన సృష్టిస్తారని చెబుతున్నారని అన్నారు.
కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించిందనే విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ‘‘సీఎం గారు… మీకు అపాయిట్ మెంట్ తీసుకోవడం చేతగాకపోతే… ఆ విషయాన్ని ఒప్పుకోండి. అప్పుడు నేను, కిషన్ రెడ్డి ముందుకొస్తాం. అపాయిట్ మెంట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం’’అని చెప్పారు. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు పెట్టుకుంటూ ముందుకుపోవాలే తప్ప గిల్లికజ్జాలు పెట్టుకుంటూ రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సరికాదని హితవు పలికారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. తెలంగాణ బాగుపడాలంటే కేంద్ర నిధులు అవసరమన్నారు. రాష్ట్రంలో ఈసారి బీజేపీకి అధికారమిస్తే… పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో ట్రిపుల్ సీ సినిమా కన్పిస్తోందని, కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్, కమీషన్ అని ఎద్దేవా చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్యగౌడ్, సీనియర్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, గౌతంరావు, అశోక్, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రాములు తదితరులు హాజరయ్యారు .
ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే.. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం అమరవీరులైన వారిని స్మరించుకునే సమయం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు, లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయాం. సమైక్య రాష్ట్రంలో, ఇప్పుడు ఆర్దిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో కళ్ల ముందు కన్పిస్తోంది.
బీఆర్ఎస్ పాలన ప్రజలు పెనం మీద ఉంటే… కాంగ్రెస్ పాలనలో పొయ్యిలో పడ్డట్లయింది. కుక్కల చింపిన విస్తరిలా తెలంగాణ మారింది. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటంబం బాగుపడింది. లక్షల కోట్ల రూపాయలు సాధించుకున్నారు. 1400 మందిని బలిని తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ఇస్తారా? మేమే బిల్లు పెట్టి ఇవ్వాలా? అని సుష్మాస్వరాజ్ నిలదీస్తే తప్ప కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేయలేకపోయింది.
తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది బీజేపీయే. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ కనీసం సభకు కూడా రాలేదు. తెలంగాణపై జరిగిన చర్చలో కూడా పాల్గొనలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంది.
బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే దారుణ పాలన చేస్తోంది. ఈ జనరేషన్ ట్రిపుల్ ఆర్ సినిమా మాత్రమే చూసిందే. కానీ ఓటేసిన పాపానికి ‘‘ట్రిపుల్ సీ’’ సినిమా చూపిస్తోంది. అంటే.. ‘‘కన్ఫ్యూజన్ ,కరప్షన్, కమీషన్@కాంగ్రెస్ దటీస్ ట్రిపుల్ సీ. 6 గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ను చూసి జనం అసహ్యించుకుంటున్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. కానీ కేంద్రం ఇస్తున్న నిధులను కూడా వాడుకోలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది. అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోంది. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు. భూసేకరణ చేయడం లేదు. ఇదేందని ప్రశ్నిస్తే… కేంద్రంపై ఎదురుదాడి చేస్తూ బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ప్రధానిని కలుస్తారు. కేంద్ర మంత్రులను కలుస్తారు. బయటకొచ్చి ప్రధాని, కేంద్ర మంత్రులను దూషిస్తారు. ఇట్లయితే నిధులు ఎట్లా వస్తాయో ఆలోచించాలి.
ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు. కేంద్రానికి పంపిన నివేదికల ఆధారంగా కేంద్రం వడ్లను కొంటోంది. అయినా కేంద్రం వడ్లు కొనడం లేదని ఆరోపించడం దుర్మార్గం. కేంద్రం నిజంగా వడ్లను కొనకపోతే… ఎందుకు కొనడం లేదని ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదో సమాధానం చెప్పాలి.
ఇచ్చిన హామీలను విస్మరించుకుండా చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే. పేదల పెన్నిధి బీజేపీ ప్రభుత్వం. తెలంగాణ సైతం అన్ని అభివృద్ధి చెందాలంటే బీజేపీ రావాలి.
తెలంగాణ అభివ్రుద్ధి చెందాలంటే కేంద్ర నిధులు అవసరం. ఇది జరగాలంటే… డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి.
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్నందునే పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. అక్కడ అభివృద్ధి కొనసాగుతోంది. తెలంగాణలో నిజాయితీ, నిబద్దతతో పనిచేసే బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాం. అందరికీ ఇచ్చారు అధికారం..ఈసారి బీజేపీకి ఇవ్వండి ఒక్క అవకాశం. ఒక్క అవకాశమిస్తే తెలంగాణ అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుందో మోదీ నాయకత్వంలో చేతల్లో చూపిస్తాం.
6 గ్యారంటీలు, వడ్ల కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విబేధాలు స్రుష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయిట్ మెంట్ ఇవ్వడం లేదని, ఉప్పెన స్రుష్టిస్తామని సీఎం చెప్పడం దుర్మార్గం. కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించిందనే విషయాన్ని మర్చిపోయారా?
మీకు అపాయిట్ మెంట్ తీసుకోవడం చేతగాకపోతే… ఆ విషయాన్ని ఒప్పుకోండి. అప్పుడు నేను, కిషన్ రెడ్డి ముందుకొస్తాం. అపాయిట్ మెంట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు పెట్టుకుంటూ ముందుకుపోవాలే తప్ప గిల్లికజ్జాలు పెట్టుకుంటూ రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సరికాదు. అన్ని రాష్ట్రాలు బాగుండాలి. అభివృద్ధి చెందాలన్నదే మోదీ లక్ష్యం. అందులో భాగంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది.