(మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రతిరోజూ ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తులు.. ఎదురుదాడిలో బిజీగా ఉండే ఒక ముఖ్యమంత్రి.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజాన్ని ఢీకొడుతూ, గ్రౌండ్‌ను ‘ఫుట్‌బాల్ ఆడేసే’ సందర్భాలు స్వతంత్ర భారతంలో ఇప్పటివరకూ ఎవరైనా విన్నారా? కన్నారా?.. మనకు తెలిసి క్రికెటర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. కానీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మాత్రమే కాకుండా.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ మాంత్రికుడిని గ్రౌండ్లో గుండెధైర్యంతో ఎదుర్కొన్న రాజకీయనాయకుడు కమ్ సీఎం ఎవరైనా ఉన్నారా అంటే దానికి సమాధానం రేవంత్‌రెడ్డి ఒక్కరే అని రాక తప్పదు.
అర్ధగంట ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వందకోట్ల రూపాయలు తగలేశారు.. ఆ డబ్బు హాస్టళ్లలో సౌకర్యాలకు ఇస్తే పిల్లలు రోగానబారిన పడి ఆసుపత్రి పాలవరు కదా? పారాసిట్మాల్కూ దిక్కులేని సర్కారీ దవాఖానాలకు ఆ డబ్బులిస్తే పోయేది కదా? రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తున్నట్లు.. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సరైన తిండి లేక ఆసుపత్రుల పాలవుతుంటే, వంద కోట్ల సింగరేణి నిధులు తగలేసి ఫుట్‌బాల్ ఆడటం సబబా? ఇదంతా ఎవడబ్బ సొమ్ము? క్రికెట్ స్టేడియాన్ని ఫుట్‌బాల్ పాలుచేసి ఉప్పల్ స్టేడియాన్ని ధ్వంసం చేస్తారా? .. వంటి విపక్షాల విమర్శలను పక్కనబెడితే.. రేవంత్‌లోని ఒక అద్భుత క్రీడాకారుడిని, ఈ మ్యాచ్ ప్రపంచం ముందు ఆవిష్కరించిందన్నది నిష్ఠుర నిజం.
ఫుట్‌బాల్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన రాహుల్‌బాబు సైతం.. వృద్ధజంబూకాలతో కిటకిటలాడుతున్న తన పార్టీలో, రేవంత్ లాంటి యంగ్టర్కుల్లో ఇంత సినిమా ఇందా అని ఆలోచించే ఉంటారేమో?! మైదానంలో అరనిక్కరు వేసుకుని అద్భుతంగా ఆడుతూ, ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ హీరో మెస్సీని మెరుపు వేగంతో ఎదుర్కొన్న రేవంత్‌ను చూసి.. ‘వీడు మామూలోడుకాదు’ అని రాహులబ్బాయి కూడా మురిసి ముక్కలయ్యే ఉంటారు. లేకపోతే అంతదూరం నుంచి ఉప్పల్ దాకా వచ్చి ఉండేవారు కాదేమో?!
తాజా ఫుట్‌బాల్ మ్యాచ్‌తో తెలంగాణ రాష్ట్రానికి ఏమి వచ్చింది? ఖజానాకు ఎంత బొక్క పడిందని పక్కనపెడితే… రేవంత్‌రెడ్డి మాత్రం, యువత రంలో తన ఇమేజ్-గ్లామర్ పెంచుకున్నారన్నది మాత్రం నిజం. ఒక సీఎం నిక్కరు వేసుకుని.. గ్రౌండ్లో ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ మాంత్రికుడితో మ్యాచ్ ఆడిన ఘటన, ఇప్పటివరకూ యువతరం చూసి ఉండకపోవడమే దానికి కారణం కావచ్చు. సహజంగా ఇలాంటి మ్యాచ్‌లను చూసేందుకో.. చీఫ్ గెస్టులుగా వ చ్చే సీఎంలను చూసిన యువతరానికి, అసలు ఆ సీఎమ్మే బరిలోకి దిగడం థ్రిల్లే కాదు. థ్రిల్లున్నర. యూత్‌కు అదో కిక్కు!
ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌తో కాంగ్రెస్ కంటే.. రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఇమేజీ.. ముఖ్యంగా యూత్‌లో ఆకాశమంత ఎత్తు పెరిగిందన్నది నిర్వివాదం. ఇప్పటివరకూ రేవంత్‌ను ఒక కోణంలో మాత్రమే చూసిన యూత్‌కు.. తాజా ఫుట్‌బాల్ మ్యాచ్ తర్వాత, ‘యూత్ ఐకాన్’గా మిగిలిపోవడం ఖాయం. ఇద్దరు పట్టుకుని స్టేజీ మీదకు తీసుకువచ్చే వృద్ధ నేతలను చూసి బోరు కొట్టిన యూత్‌కు.. అరనిక్కరు వేసుకుని హుషారుగా మైదానంలో విన్యాసాలు చేసే రేవంత్ వంటి యువనేతలనే హీరోగా చూస్తారు! ఇదే ఇప్పటి సైకాలజీ!!
అటు రాజకీయంగానూ ఇది రేవంత్ ఇమేజీని పెంచిందనే చెప్పాలి. ఇప్పటివరకూ రేవంత్‌కు, రాహుల్‌బాబు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న ప్రచారం దీనితో దూదిపింజలా తేలినట్లయింది. స్వయంగా అదే రాహుల్.. సీఎం రేవంత్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చారంటే.. ఢిల్లీలో రేవంత్ సినిమా అయిపోయిందనుకుని ప్రచారం చేసే అంతర్గత ప్రత్యర్ధుల నోళ్లే కాదు.. నవరంధ్రాలూ మూసుకుపోయినట్లే లెక్క.
నిజంగా రాహుల్ దగ్గర రేవంత్‌కు అంత సినిమా లేకపోతే, అదే రాహుల్.. రేవంత్ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ దాకా రారు కదా అన్నది, మెడపై తల ఉన్న వారికెవరికయినా వచ్చే సందేహం! ఏదేమయినా..మొన్ననే గ్లోబల్ సమ్మిట్‌తో హల్చేసి.. తాజాగా ఫుట్‌బాల్‌తో దుమ్మురేపిన రేవంత్, మామూలోడు కాదన్నది ఉప్పల్ స్టేడియం తేల్చిన తీర్పు!!
మామూలుగానే రేవంత్ మహా ముదురు. ఇక పార్టీలో ఆయనకు ఏముంటుంది ఎదురు?