– ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశం
– ఇంత దారిదోపిడీనా అంటూ స్పీకర్ ఆశ్చర్యం
– ప్రజలు ఇబ్బందిపడుతున్నారని డీఆర్సీలో ఆవేదన
– అనకాపల్లి జిల్లాలో స్లిప్పులే రశీదుగా ఇస్తున్న వైనం మీడియాలో వచ్చినా చర్యలు శూన్యం
– ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వ్యాపారుల తిరుగుబాటు
– కూటమిపై కమ్మ వర్గం కన్నెర్ర
– చెక్‌పోస్టులు ధ్వంసం చేసిన వ్యాపారులు, కూలీలు
– మట్టి, కంకర తీసుకువెళుతున్నా డబ్బు వసూలు చేస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు జనం ఫిర్యాదులు
– అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేల మౌనవ్రతం
– ఎమ్మెల్యేల మౌనంపై జనం అనుమానం, ఆగ్రహం
– అదనంగా డబ్బు వసూలుచేస్తున్నారని గ్రానైట్ వ్యాపారులు, ప్యాక్టరీల ఫైర్
– ఎప్పుడూ లేనిది కంపెనీలోకి వచ్చి తనిఖీ చేస్తున్నారని ఆగ్రహం
– ఈ డీల్ వెనుక ఓ మీడియా అధిపతి ఉన్నారంటూ ప్రచారం
– ఒక్క ప్రకాశం జిల్లాలోనే నెలకు 100 కోట్లకు పైగా వసూళ్లు
– ఏఎంఆర్ సర్కారుకు చెల్లించేది నెలకు 48 కోట్లు మాత్రమే
– తమను ఏమీ చేయలేరని బహిరంగంగానే చెబుతున్న ఏంఎంఆర్ సిబ్బంది
– పైవారి మద్దతు లేకపోతే మేం ఈ వసూళ్లు చేస్తామా అని ఎదురు ప్రశ్నలు
– జగన్ జమానాలో కేవలం 5 జిల్లాలకే సీనరేజీ వసూళ్లు చేసిన ఏఎంఆర్
– కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం వసూళ్లు ‘రెడ్డిగారి కంపెనీకే’
– షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్, మేఘా దారిలోనే ఏఎంఆర్
– అప్పుడు.. ఇప్పుడూ.. ‘రెడ్డి’ కార్పెట్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన శాసనసభాపతి. అంటే రాష్ట్రంలోని ఎమ్మెల్యేల గళానికి ప్రతినిధి. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా తమ సమస్యలను శాసనసభాపతికి విన్నవిస్తారు. మరి ఆ శాసనసభాధిపతే స్వయంగా తమ జిల్లా ప్రజలను వే ధిస్తున్న ఓ ప్రధాన సమస్యను డిఆర్సీలోనే గళమెత్తితే? ఆయన లేవనెత్తిన సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందా? ఆయన ఇచ్చిన ఆదేశాలపై కలెక్టర్ చర్యలు తీసుకుంటారా? రాష్ట్ర వ్యాప్తంగా సీనరేజీ వసూళ్లను గుత్తకు తీసుకున్న ఏఎంఆర్ కేంద్రంగా, అనకాపల్లిలో కనిపించిన తాజా దృశ్యమిది. స్వయంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడే, ఏఎంఆర్ కంపెనీ దోపిడీపై అగ్గిరాముడయ్యారంటే.. మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
‘‘నిబంధనలకు విరుద్ధంగా సీనరేజీ వసూళ్లు చేస్తు కుమ్మర్లు, రైతులను ఏఎంఆర్ కంపెనీ ఇబ్బంది పెడుతోంది. దానిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కుమ్మర్లు ఇటుకల బట్టీకి తీసుకువచ్చే మట్టికి, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును ఏఎంఆర్ అమలు చేయడం లేదు. రైతులు, కుమ్మర్లను వేధిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది. కలెక్టర్ గారూ మీరు ఏఎంఆర్ సంస్థపై తక్షణం చర్యలు తీసుకోండి’’
– ఇది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరైన అనకాపల్లి జిల్లా డిఆర్సి మీటింగ్‌లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహావేశం.
* * *
ఇది ఒక్క అనకాపల్లి జిల్లాకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. రాష్ట్రం మొత్తం ఏఎంఆర్ బాదుడు బాధితులే. రైతులు, జనం సొంత పొలం నుంచి మెరక కోసం మట్టి తోలుకుంటుంటే కూడా… సీనరేజీ చెల్లించాలంటూ ట్రాక్టర్లు ఆపుతున్న ఏఎంఆర్ దోపిడీపై ప్రజలే కాదు. కూటమి కార్యకర్తలు కూడా, తమ ఎమ్మెల్యేలకు మొర పెట్టుకుంటున్న పరిస్థితి రాష్ట్రం అంతా నెలకొంది.
‘‘ఇళ్ల నిర్మాణాలకు వాగుల నుంచి ఇసుక, వృధా సైజు రాళ్లు తోలాలన్నా ఏఎంఆర్ వాడు డబ్బులు అడుగుతున్నాడు. ఇట్టాగయితే మేం ఇల్లు కట్టుకునేదెట్టా? జగన్ ఉన్నప్పుడు ఈ పద్ధతి లేదు. మన ప్రభుత్వంలోనే ఇలా చేస్తే ఎట్లా? ఇందుకేనా మనం మన పార్టీకి గెలిపించుకుంది’’? అని కరుడుగట్టిన టీడీపీ సానుభూతిపరులైన రైతులు.. స్థానిక టీడీపీ నేతలను నిలదీస్తుంటే, జవాబివ్వలేని నిస్సహాయ పరిస్థితి వారిది.
ఈ విషయాన్ని గ్రామ-మండల స్థాయి నేతలు.. స్థానిక కూటమి ఎమ్మెల్యేలకు చెబితే, వారి నుంచీ ఎలాంటి హామీ రాని వైచిత్రి. పైగా ‘‘ పైన వాళ్లు అన్నీ మాట్లాడుకునే చేస్తుంటే మనమేం చేయగలం? పైవాళ్ల అనుమతి లేనిదే ఏఎంఆర్ వాడు అంత ధైర్యంగా మనదగ్గరకొచ్చి చేయలేడు కదా? మీరు దీనిపై గట్టిగా మాట్లాడవద్దు. మళ్లీ పార్టీకి చెడ్డపేరు. మీరు గొడవ చేస్తుంటే నువ్వేమి చేస్తున్నావని నాకు ఫోన్లు. పక్క నియోజకవర్గం వాళ్లు మౌనంగా ఉంటే మనమెందుకు మాట్లాడి, పైవాళ్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల’’ని పొలిటికల్ క్లాసులిస్తున్న పరిస్థితి.
దీనితో తమ ఎమ్మెల్యేలకూ, మామూళ్లు ముట్టినట్లు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక మంత్రి గారు, జిల్లాలోని ప్రజాప్రతినిధులను నెలకు ఇంత అని అలాగే సెట్ చేశారన్నది కార్యకర్తల్లో జరుగుతున్న ప్రచారం.
డిసెంబర్ 2న ఇదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం, బల్లికురవ వద్ద నక్కబొక్కలపాడు రైతులు ట్రాక్టర్లలో మట్టి తోలుకుపోతున్నారు. దానిని కూడలిలోని ఏఎంఆర్ సిబ్బంది ఆపి, డబ్బులు కట్టాలని అడిగారు. ‘మా పొలంలో మట్టి తోలుకుంటే మీకెందుకు డబ్బులివ్వాల’ని రైతులు అడ్డం తిరిగారు. అయితే అదేమీ కుదరదు. డబ్బులు కట్టాల్సిందేనన్న సిబ్బంది దౌర్జన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. బల్లికురుల, నక్కబొక్కలపాడు, కొత్తపాలెం, గుంటుపల్లి మరో 4 గ్రామాలకు చెందిన వారంతా అక్కడ చేరి నిరసన వ్యక్తం చేశారు. దానితో ట్రాఫిక్ స్తంభించింది. ఏఎంఆర్ సిబ్బంది తమ కంపెనీ వారికి ఫిర్యాదు చేయడంతో.. అప్పటికి సీనరేజీ వసూలు చేయకుండా వదిలేశారు.
ఆ తర్వాత ఏఎంఆర్ వసూళ్ల దందాకు విసిగిపోయిన మైనింగ్ సంస్థల వ్యాపారులు, వాటిలో పనిచేసే కూలీలు.. వేమవరం జంక్షన్‌లోని ఏఎంఆర్ చెక్‌పోస్టులను ధ్వంసం చేసి, కంప్యూటర్లు, సిసి టీవీ కెమెరాలు నేలకేసి కొట్టారు. ఆందోళనకారుల్లో 90 శాతం టీడీపీ సానుభూతిపరులు, కమ్మవారే ఎక్కువగా ఉండటమే విశే షం. వీరంతా ప్రతి ఎన్నికలకూ పార్టీకి-టీడీపీ అభ్యర్ధులకు చందాలు ఇస్తున్న వారే. పైగా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమకు బాగుందని, ఈ వేధింపులు లేవని ఏకంగా మీడియాకే చెప్పడం కలకలరం రేపింది. ఆ తర్వాత ఏఎంఆర్ వేధింపులకు నిరసనగా గ్రానైట్‌లో సమ్మె కట్టారు. ఫలితంగా ప్రభుత్వానికి రావలసిన ఆదాయం ఆగిపోయింది.
ఆ క్రమంలో ఏఎంఆర్ దోపిడీపై కమ్మ సామాజికవర్గానికి చెందిన గ్రానైట్ వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానులు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తోపాటు, స్థానిక ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం. మధ్యలో మంత్రి కొల్లు రవీంద్రతో భేటీ, కమిటీల పేరుతో హడావిడి చేసినా.. ఫలితం శూన్యం. అన్ని గ్రేడ్ల ముడి సరుకుకు ఒకే విధంగా పన్ను చెల్లించడం ఇబ్బందిగా ఉన్నందున, ఈ సమస్య పరిష్కరించాలని మంత్రులను కోరారు. అయితే ఇప్పటికే అది సమస్యగానే మిగిలిపోయిందే తప్ప, మంత్రులు ఏమీ చేయకపోవడం ప్రస్తావనార్హం.
దానితో.. ‘‘ఏంఎంఆర్ను వీళ్లేమీ చేయలేరు. ఇది అమరావతి స్థాయిలో జరిగిన ఒప్పందం. ఈ ఒప్పందం చేసింది ఒక మీడియా అధిపతిట. ఆయనే దుబాయ్‌లో ప్రభుత్వ పెద్దలకు-కంపెనీకి డీల్ కుదిర్చారట. ఇప్పుడు ఈ జిల్లాలో ఆయన కూడా ఒక పార్టనర్ట. అందుకే ఏఎంఆర్‌పై ఆ పత్రిక-చానెల్లో వ్యతిరేకవార్తలు గానీ- దానిపై మా నిరసన కార్యక్రమాలు గానీ రావు’’ అన్న బహిరంగ చర్చకు తెర లేచింది.
వైసీపీ కంటే డబుల్ రేట్లపై ఆగ్రహం
తాము ఏరి కోరి తెచ్చుకున్న కూటమి ప్రభుత్వం.. జగన్ పాలనలో కంటే, డబుల్ పన్నులు వేయడమే వారికి మింగుడుపడటం లేదు. జగన్ పాలనలో ఒక సింగిల్ కట్టర్‌కు( ముడిరాయిని పలకలుగా కోసే యంత్రం) నెలకు రూ. 27 వేలు, మల్టీ కట్టర్‌కు రూ. 54 వేలు రాయల్టీ మాత్రమే వసూలు చేయగా.. కూటమి ప్రభుత్వం సింగిల్ కట్టర్ కు రూ. 35 వేలు, మల్టీ కట్టర్‌కు రూ. 70 వేలు వసూలు చేస్తోంది. గతంలో లేని జీఎస్టీని విధించింది.
సింగిల్ కట్టర్‌కు నెలకు రూ. 35 వేలు, మల్టీ కట్టర్‌కు రూ. 70 వేలు చొప్పున కప్పం వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే అదనంగా సింగిల్ కట్టర్‌కు రూ. 43 వేలు, మల్టీ కట్టర్‌కు రూ. 86 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది పరిశ్రమల యజమానులకు మరింత భారంగా మారింది. పోనీ గతంలోవున్న కట్టర్‌కు 22 క్యూబిక్ మీటర్ల రాయిని మాత్రమే తెచ్చుకునే ఆంక్షలను సడలించారా అంటే అదీలేదు. ఇంతకు మించి రాయిని తెచ్చుకోవాలంటే, క్యూబిక్ మీటరుకు రూ. 2,500 అదనంగా చెల్లించాలి.
గత ప్రభుత్వం కట్టర్ల విషయంలో సడలింపు ఇవ్వగా కూటమి ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. గతంలో ఒక్కో పరిశ్రమలో ఉదాహరణకు 6 కట్టర్లు ఉంటే 4 కట్టర్లకు, నాలుగు కట్టర్లు ఉన్నవారు రెండు లేదా మూడు కట్టర్లకే టాక్స్ చెల్లించేవారు. ఇప్పడు ప్రభుత్వం పరిశ్రమల్లోవున్న మొత్తం కట్టర్లను లెక్కగట్టి టాక్స్వసూలు చేస్తోంది. క్వారీల్లో 10 మీటర్ల రాయి బయటకు వస్తే.. డ్రస్సింగ్ చేయకుండా క్రాకులు, జాయింట్లు పోను 4 లేదా 5 మీటర్లకు రాయల్టీ కట్టి పరిశ్రమలవారు రాయిని తెచ్చుకుంటారు. ఆ తరువాత డ్రస్సింగ్ చేస్తే .. 1 మీటరు లేదా 2 మీటర్ల రాయి కలిసి వచ్చే అవకాశముంటుంది.
క్వారీ నుంచి తెచ్చిన మొత్తం రాయికి రాయల్టీ, జీ ఎస్టీ చెల్లించాలని కూటమి ప్రభుత్వం కొత్తగా నిబంధన పెట్టింది. ఎగుమతి చేసే పలకలకు చెలించే పన్నులతో పనిలేకుండా ప్రభుత్వం టన్నుకు రూ. 1000 వసూలు చేస్తోంది. కటింగ్ అనంతర వచ్చే వేస్ట్ బెడ్స్‌ను తీసుకెళ్లినందుకు కంకరమిల్లులకు పరిశ్రమలవారు ట్రిప్పర్‌కు రూ. 1500 చెల్లించేవారు. కూటమి ప్రభుత్వం దానికి క్యూబిక్ మీటరుకు రూ. 325 చొప్పున వసూలు చేస్తుండడంతో, వేస్ట్ రాయిని తీసుకెళ్లినందుకు ట్రిప్పర్‌కు రూ. 3 వేలు చెల్లించాల్సి వస్తోందని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు.
ప్రభుత్వం పన్నుల వసూలు బాధ్యతలు ఏఎంఆర్‌కు అప్పజెప్పడంతో వారు బాపట్ల జిల్లాలో వందలాది చెక్‌పోస్టులు పెట్టి నిబంధనలకు విరుద్దంగా పన్నులు వసూలు చేస్తున్నారని పరిశ్రమల యజమానులు మండిపడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్టూరు,బల్లికురవ, సంతమాగులూరు, గురిజేపల్లి, కారంచేడు ప్రాంతాలతోపాటు చీమకుర్తి, ఒంగోలు, నాగులుప్పలపాడు ప్రాంతాల్లో సుమారు 5 వేల కట్టర్లు ఉన్నట్లు అంచనా.
పన్నులు వసూలు బాధ్యతలు చూస్తున్న ఏఎంఆర్ ప్రభుత్వానికి నెలకు రూ. 47 కోట్లు మాత్రమే చెల్లించాల్సివున్నా.. జిల్లానుంచి నెలకు రూ. 120 కోట్లు వసూలు చేస్తున్నట్లు.. అదనపు వసూళ్లలో పై నుంచి జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులకు పంచుతున్నారని గ్రానైట్ వ్యాపారులు చెబుతున్నారు.
ఏఎంఆర్ దోపిడీ జగన్‌కు పట్టదా?
కేవలం వందలమంది ఉపయోగపడే మెడికల్ కాలేజీ నిర్మాణాల కోసం కోటిసంతకాల ఉద్యమం చేస్తున్న వైసీపీ అధినేత జగన్.. వేలాదిమంది కార్మికులను రొడ్డున పడేస్తున్న ఏఎంఆర్ దోపిడీపై మాట్లాడకపోవడమే ఆశ్చర్యం. నిజానికి ఏఎంఆర్ కంపెనీ జగన్ జమానాలో కేవలం 5 జిల్లాల్లో మాత్రమే సీనరేజీ వసూలు చేసింది. కానీ అదే రెడ్డిగారి కంపెనీ ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సీనరేజీ వసూళ్లు చేస్తుండటం విశేషం. అఆయితే సీన రేజీ వసూళ్లలో లేని మట్టి, కంకర నుంచి పన్ను వసూలు చేస్తున్న వైనం రైతులు-సగటు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏఎంఆర్ దోపిడీపై మీడియాలో కూడా కథ నాలు వస్తున్నాయి. అయినా జగన్ సామాన్యుల పక్షాన నిలబడకపోవడమే వింత.
బహుశా.. ఒక్క ఏఎంఆర్ రెడ్డిగారు మాత్రమే కాదు. మేఘా రె డ్డిగారు.. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ రెడ్డి గారు.. అదే ఇండోసోల్ రెడ్డిగారు.. ఇంకా తన పాలనలో అన్ని శాఖల్లో పనులు చేసిన బడా కాంట్రాక్టర్లే, కూటమి ప్రభుత్వంలోనూ నిర్విఘ్నంగా, నిరాటంకంగా పనులు చేస్తున్నారన్న ఆనందంతో జగన్.. రాజకీయ పార్టీ తర హాకు భిన్నంగా, వ్యాపార ధోరణిలో వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్లు లేదని టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదైనా జగన్ జమానాలోని కాంట్రాక్టర్లు అదృష్టవంతులబ్బా! ఏఎంఆర్, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్‌పై ప్రతిపక్ష నేత జగన్ పల్లెత్తు మాట్లాడరు. సర్కారుపై చెలరేగే ఆయన పత్రిక సాక్షి అసలు రాయదు. అటు అధికార పార్టీ ఏమో.. పరిశ్రమలను వెళ్లగొట్టలేము కదా? మనం వద్దంటే వాళ్లు పక్క రాష్ట్రానికి వెళతారన్న వాదన- కమ్ లౌక్యమైన ఎదురుదాడిలో పయనిస్తోంది. ఏదైనా ఏపీలో ఇంకా ‘రెడ్డి’కార్పెట్టే విజయవంతంగా కనిపిస్తోందన్నది తమ్ముళ్ల వా(వే)దన.