కాంగ్రెస్ పార్టీలో వ్యూహకర్తలు కరువయ్యారో, సోనియా కుటుంబానికి సలహా చెప్పాలంటే భయపడతారో, లేదా చెప్పినా వారికి వినే లక్షణం లేదో అర్థం కావడంలేదు. కానీ ఒక జాతీయపార్టీకి అవసరమైన వేగం కనిపించడం లేదు.
ఇప్పటివరకు కాంగ్రెస్ సాధిస్తున్న విజయాలలో ప్రధాన భూమిక పోషిస్తున్నది ఆయా రాష్ట్రాలలో ఉన్న నాయకులకు తోడుగా నిలిచే సాంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే విధమైన వ్యూహం. కొత్తదనం లేని వ్యూహాలు.
ప్రపంచం ఇంత వేగంగా మారిపోతుంటే నలభై సంవత్సరాల క్రితంలా ఓట్లు అడగడం తప్ప మరొక వ్యూహం లేదు. ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం నిలవకపోయినా, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి దారేదో దేశంలో ఉన్న పార్టీలకు తెలిసింది.
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అంటే అభేద్యమైన కోటగోడ అనుకున్నారు. అప్పుడే దేశంలో మొదలైన ట్రెండ్, ప్రభుత్వ వ్యతిరేకతను చీలకుండా చూసుకోవడం. చివరకు వామపక్షాలు కూడా ఈ మంత్రాన్ని గట్టిగానే ఆచరించాయి. దానితోనే సంకీర్ణ ప్రభుత్వాల హవా మొదలైంది.
అక్కడ కూడా కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించింది. అటువంటి అవకాశం ఉండి, రెండు దఫాలు సంకీర్ణ ప్రభుత్వాన్ని వరుసగా నడిపినప్పుడు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని నిర్ధారించుకోలేకపోయింది. ఇందిరాగాంధీ ఇచ్చిన ‘గరీబీ హఠావో’ నినాదం తరువాత కాంగ్రెస్ నుండి ప్రజలను ఆకర్షించే నినాదం ఒక్కటి కూడా రాలేదు.
ప్రాంతీయ పార్టీలను హ్యాండిల్ చేయడంలో విఫలమవుతున్నది, కొత్తగా అవతరించిన బీఎస్పీ, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలను కలుపుకొని అడుగు వేయలేకపోతున్నారు. పార్లమెంటులో రోజురోజుకీ దిగిపోతున్న సంఖ్యాబలం చూస్తూ కూడా ఆలోచనలో కొత్తదనాన్ని చేర్చుకోలేకపోతున్నారు.
2019 సాధారణ ఎన్నికలలో పూర్తిగా తిరస్కరించిన ప్రజలు, ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానో, యువ నాయకుడు రాహుల్ గాంధీ జనంలో కలసిపోయిన దాని ఫలితంగానో, 2024 ఎన్నికలలో పార్టీకి ప్రతిపక్ష హోదాను కట్టబెట్టారు. కానీ ఆ తరువాత జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయాన్ని సాధించలేకపోతున్నారు.
కశ్మీర్లో గెలుపును కూడా ఒమర్ అబ్దుల్లా ప్రెస్ ఎదుట కనిపించిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ వల్లనే పెద్ద విజయాన్ని కోల్పోయాం అని మాట్లాడుతున్నాడు. హర్యానాలో ఓడిపోవడానికి కారణాలు విశ్లేషించాలంటారు కానీ, గెలుపును కోల్పోవటానికి కారణం చివరి నిమిషం వరకు ఇరవై నియోజకవర్గాలలో అంతర్గత పోరును నివారించలేకపోవడమే. మహారాష్ట్రలో కూడా గెలవలేక పోయారు.
పార్లమెంటు ఎన్నికలలో మహారాష్ట్రలో వచ్చిన ఫలితాన్ని విపక్షం చెదరగొట్టే ప్రయత్నం చేస్తుందని తెలిసీ జాగ్రత్త పడలేకపోయారు. ఇప్పటివరకు బీజేపీ వేయబోయే అడుగు ఏమిటో అర్థం చేసుకునే పరిస్థితుల్లో, వంద సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ లేకపోవడం అంటే, తెలుసుకోవాలన్న ఆలోచన చేయడం లేదనే అర్థం.
బీహార్ ఎన్నికలలో ‘ఓట్ చోరీ’ నినాదంతో ముందుకు వెళ్లారు. ఫలితం రాలేదు. ఇంకా ఇప్పుడు కూడా అదే నినాదం పట్టుకొని ముందుకు వెళితే ఫలితం ఉండదు. కానీ రాహుల్ గాంధీ పార్లమెంటులో దానిని ప్రధానాంశంగా మాట్లాడారు. ఓట్ చోరీ గురించి ఢిల్లీలో ఒక బహిరంగసభ ఏర్పాటు చేయటం వలన ఉపయోగం లేదు. ‘ఓటు చోరీ’ అనేది ప్రజలకు నమ్మశక్యంగా లేదు.
ముఖ్యంగా ఈవీఎంల గురించిన వివాదం ఎప్పటినుండో నడుస్తున్నది. దేశంలో ఒక్క బీజేపీ అగ్ర నాయకత్వం తప్ప, అన్ని రాజకీయ పక్షాల అధినాయకులు ఎప్పుడో ఒకసారి ఈవీఎంల పైన సందేహం వెలిబుచ్చినవారే. కాకుంటే ఏ రాజకీయ పక్షమైనా ఓటమి చెందినప్పుడు మాత్రమే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు, గెలిచిన తరువాత అదే సందేహాన్ని ఖండిస్తున్నారు.
చివరకు ఈవీఎంల పైన సందేహం వెలిబుచ్చేవారి విశ్వసనీయతే సందేహాస్పదం అవుతున్నది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల గురించి మేధావులు చెప్పే విషయాలు సాధారణ ఓటర్లకు అర్థం కావడం లేదు. చెప్పేవాళ్లు కూడా పూర్తిస్థాయిలో సందేహాలన్నీ తీర్చలేకపోతున్నారు. వారికున్న సందేహాలను ప్రజలతో పంచుకుంటున్నారు.
ఓటర్ల సమగ్ర సర్వేను కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. బీహార్ ఎన్నికల ముందు ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) పైన పెద్ద యుద్ధమే చేశారు. ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించడం అనే కార్యక్రమాన్ని చేపట్టింది ఎన్నికల సంఘం. కాంగ్రెస్ పార్టీ సమగ్ర సర్వే మీద యుద్ధం చేసేకొద్దీ బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతున్నది.
ఎస్ఐఆర్ పైన కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టు కూడా సమగ్రంగా పరిశీలిస్తే తప్పేముంది అంటూ ప్రశ్నించింది. సమగ్ర పరిశీలన పేరుతో అక్కడ జరిగేదేమిటో అందరికీ తెలుసు. కానీ దేనినీ నిరూపించలేరు. ఎన్నికల సంఘం వ్యవహారశైలి అనేక అనుమానాలకు తావిస్తుంది.
ఎన్నికల సంఘం నియామకాల నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించటంతో పాటు వారికి రాజ్యాంగరక్షణ కల్పించడంలోనే కేంద్రప్రభుత్వ నిరంకుశ వైఖరి అర్థం అవుతున్నది. కానీ కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఎన్నికలను ఎదుర్కోవడానికి అది ప్రధానమైన ఆయుధం కాదు. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం ఒక విషయం మీద అందరూ కలసికట్టుగా పోరాడే పరిస్థితి కనిపించడం లేదు.
బీహార్ ఎన్నికలను చూసిన తరువాత, ఎన్నికలలో తలపడాలనే ఆసక్తి ఉన్న రాజకీయపక్షాలు ముందుగా బూత్ స్థాయిలో పోరాడగలిగే కార్యకర్తలను తయారు చేసుకోగలగాలి. కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న ప్రధాన సమస్యలను పార్టీ పరిష్కరించుకోవడం కష్టంతో కూడుకున్న పని.
రాజకీయానికి భావోద్వేగాలను జోడించారు. వ్యవస్థలను ఎలా ఉపయోగించవచ్చో నేర్పించటంలో కాంగ్రెస్ ‘పాఠశాల’ స్థాయిలోనే ఉంటే, భారతీయ జనతా పార్టీ ‘యూనివర్సిటీ ‘ స్థాయికి వెళ్లిపోయింది. దానిని బద్దలు కొట్టాలంటే కాంగ్రెస్ ఎంతో సమన్వయంతో అన్ని పార్టీలను కూడగట్టగలగాలి. కూడగట్టే స్థాయికి వెళ్లాలంటే కాంగ్రెస్ బలపడాలి.
కాంగ్రెస్ బలపడాలంటే తన కార్యకర్తలను బలోపేతం చేయాలి. వారు పార్టీకి లాయల్‌గా ఉండేలా చూసుకోవాలి, అంతేకానీ ఒక ముఖ్యమంత్రి సంవత్సరంలో మూడువందల సార్లు ఢిల్లీ పర్యటనలో గడపకూడదు. రాష్ట్ర శాఖల పైన నియంత్రణ ఉండాలి కానీ, కేవలం ఢిల్లీ పెత్తనంలో మాత్రమే నడుస్తున్న భావనలో నుండి కార్యకర్త బయటకు రాగలగాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఒక కొత్త వ్యూహంతో ముందుకెళ్లాలి.
కానీ, ఒకే ఆయుధం పట్టుకొని వెళితే ఉపయోగంలేదు. బలమైన ప్రాంతీయ పార్టీలను, అంతకంటే శక్తివంతమైన జాతీయపార్టీని ఎదుర్కోవాలి. ఏ రెండు రాష్ట్రాలలోనూ ఒకే వ్యూహం ఫలించే అవకాశంలేదు. ఎన్నికల ఫలితాలు రాగానే ఓట్ల శాతం పెరిగింది, సీట్లు మాత్రమే తగ్గాయి అనుకుంటే ఉపయోగం లేదు.
సంప్రదాయ ఓటు బ్యాంకు మీదనే ఆధారపడి ఉంటే రాబోయే రోజుల్లో వారికి కూడా నిరాశ కలుగుతుంది. 75 సంవత్సరాల ప్రధానమంత్రి దేశ యువతను ఆకర్షిస్తున్నారు, యువ నాయకత్వం ఉన్న కాంగ్రెస్ యువతను ఆకర్షించడంలో ఎందుకు విఫలం అవుతుందో ఆలోచించుకోవాలి. రాబోయే రోజులు మరింత కఠినమైన రోజులు. తట్టుకోవాలంటే కాంగ్రెస్ తన శక్తియుక్తులకు పదును పెట్టవలసిన అవసరం ఉంది.
– ఇంద్రాణి