– సునీల్ తల్లిగారి క్రైస్తవ సమాధి ఫొటోను బయటపెట్టిన రఘురామరాజు
– క్రైస్తవుడిగా పుట్టి దళితుడిగా ఉద్యోగం సంపాదించారని వ్యాఖ్య
– ఆయన సర్టిఫికెట్ రద్దు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌కు లేఖ?
– ఇప్పటివరకూ ఆయన జీతాన్ని రికవరీ చేయాలని డిమాండ్
– మతం మారిన నిజం దాచిపెట్టి ఉద్యోగం సంపాదించిన సునీల్ కుమార్‌పై చర్య తీసుకోవాలని డీఓపీటీకి రఘురామరాజు లేఖ
– అమిత్‌షాను కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయం
– ఆ తర్వాత హిందూ సంస్థలతో కలసి దానిని జాతీయ అంశం చేయాలని నిర్ణయం
– ఇప్పటికే హిందూ సంస్థలతో రఘురామరాజు చర్చలు
– రఘురామరాజునూ సస్పెండ్ చేయాలంటూ సునీల్ పోస్టు
– ఆ తర్వాత సునీల్ తల్లిగారి సమాధి ఫొటోతో రఘురామరాజు కౌంటర్
(సుబ్బు)
జగన్ జమానాలో తనను కస్టోడియల్ టార్చర్ చేసిన నాటి సీఐడీ చీఫ్ పివి సునీల్ కుమార్‌ను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వదిలిపెట్టేలా లేరు. కూటమి సర్కారు వచ్చి, సునీల్‌పై శరవేగంగా చర్య తీసుకోకపోయినప్పటికీ.. రఘురామరాజు మాత్రం, కేసు-ఫిర్యాదు-ప్రెస్మీట్లతో సునీల్ దుంపతెంచుతూనే ఉన్నారు.
తాజాగా డిటెక్టివ్ అవతారమెత్తిన రఘురామరాజు.. సీనియర్ ఐపిఎస్ సునీల్‌కుమార్ మూలాలలను బయటపెట్టి, ఆయనను మత కమ్ కుల సంకటంలో పడేశారు. క్రైస్తవ శ్మశానవాటికలో ఉన్న సునీల్ తల్లిగారి సమాధి ఫొటోలను విడుదల చేసి.. ‘‘సునీల్ మతం మారినా ఆ విషయాన్ని దాచిపెట్టి దళిత కోటాలో ఉద్యోగం సంపాదించారనడానికి ఇదిగో సాక్ష్యం’’ అంటూ ఆ ఫోటో, సమాధి ఉన్న క్రైస్తవ శ్మశానవాటిక వీడియోను మీడియాకు విడుదల చేసి, సునీల్‌కుమార్‌ను కల-మత సంకటంలో నెట్టేసిన వైనం ఆసక్తికరంగా మారింది.
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన ఫిర్యాదు మేరకు, ఇటీవల పివి సునీల్‌కుమార్‌ను ఎస్పీ దామోదర్ విచారణకు పిలిచారు. సరే. ఆయన ఆ విచారణలో అడిగిన వాటికి సమాధానాలు చెప్పకపోయినా.. తనకు ఏమీ గుర్తు లేదని చెప్పినా.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గుంటూరు సీసీఎస్‌లోనే గడిపారు. మళ్లీ పిలిచినప్పుడు రావాలని ఎస్పీ చెప్పడం.. అలాగేనని సునీల్ అనడం జరిగిపోయింది. ఈలోగా.. సునీల్ కుమార్ తల్లిగారి క్రైస్తవ సమాధి ఫొటోను, రఘురామ కృష్ణంరాజు మీడియాకు విడుదల చేయడం కలకలం సృష్టించింది.
‘‘ ఈ సమాధి గతం మర్చిపోయిన పీవీ సునీల్‌కుమార్ గారి మాతృమూర్తి గతించిన పిమ్మట పూడ్చి చింతలపూడి వెలవలలో కట్టినది. ఆమె వీడీఓగా పనిచేశారు. పాతాళ గ్రేస్ డెయిజీ దయాలు ఆమె పేరు. వారి బిడ్డ ఎస్సీ సర్టిఫికెట్ (ఫేక్)తో ఐపిఎస్ సంపాదించారు. అందుకే గట్టిగా క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్‌కై ఏఐఎం పెట్టారేమో? ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వయిరీ చే యాలి. మరి చూద్దాం. ఇప్పుడు గ జనీగా మారిన సునీల్‌కుమార్ గారికి.. తల్లిగారి, వారి మతం గుర్తు ఉందో? లేదో?’’ అంటూ ఫోటో కాప్షన్ పెట్టారు.
కాగా ఇప్పటికే మతం మారి దళిత కోటాలో ఉద్యోగం సంపాదించారంటూ.. సునీల్‌పై నానా యాగీ చేస్తున్న రఘురామరాజుకు, తాజాగా సునీల్ తల్లిగారి సమాధి ఫొటో కొత్త అస్త్రంగా పరిణమించినట్లయింది. దాని ఆధారంగా.. పివి సునీల్ కుమార్ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ, ఏలూరు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసేందుకు రఘురామ కృష్ణంరాజు సిద్ధమవుతున్నారు. పివి సునీల్ కుమార్ తండ్రి గంగరాజు, ప్రతి ఆదివారం సీఎస్ఐ చర్చికి వెళ్లి ప్రార్ధనలు చేస్తున్న విషయాన్ని కూడా ఫిర్యాదు చేయనున్నారు.
తాను స్వయంగా ఏలూరు జిల్లా కలె క్టర్ కార్యాలయానికి వెళ్లి, ఫిర్యాదు చేయాలని రఘురామరాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ సందర్భంగా మీడియాకు.. సునీల్ మతానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఆ తర్వాత మతం మారిన విషయాన్ని దాచి పెట్టి, దళిత కోటాలో ఐపిఎస్ సంపాదించిన సునీల్‌పై తగిన చర్య తీసుకోవడంతోపాటు.. ఇప్పటివరకూ ఆయన ప్రభుత్వం నుంచి పొందిన జీతాన్ని, పూర్తిగా రికవరీ చేయాలని కోరుతూ డిఓపీటీ అధికారులను స్వయంగా కలసి ఫిర్యాదు చేయనున్నారు.
కాగా.. దేశంలో ఒక ఐపిఎస్ అధికారి మతం మారి, ఆ సర్టిఫికెట్తో ఉద్యోగం సంపాదించారనడానికి తొలిసారి ఆధారాలు లభించిన నేపథ్యంలో.. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని, రఘురామ కృష్ణంరాజు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో ఆయన తాడో పేడో తేల్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది.
అందులో భాగంగా మతం మారి దళిత కోటాలో ఐపిఎస్ సాధించిన సునీల్ కుమార్ వ్యవహారాన్ని.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కు వివరించాలని రఘురామరాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దేశంలోని ఐపిఎస్‌లలో సునీల్ తరహాలో.. ఎంతమంది మతం మారి ఉద్యోగాలు సంపాదించుకున్నారన్న దానిపై విచారణ జరపాలని కోరుతూ, ఆయన ఒక వినతిపత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్‌షాను కలసిన తర్వాత, సునీల్ అంశాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు.. మతం మారి ఉద్యోగాలు సంపాదించిన వారిపై, జ్యుడి షియల్ కమిషన్ వేయాలని గళం విప్పనున్నారు. ఆ మేరకు ఆయనతో కొన్ని హిందూ సంస్థలు చర్చిస్తుండటం ప్రస్తావనార్హం.
కాగా.. ఉదయం పివి సునీల్ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై ఒక పోస్టు పెట్టారు. తాజాగా రఘురామరాజు కంపెనీలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకుని, ఆ పోస్టు పెట్టినట్లు కనిపించింది. ఆ మేరకు సునీల్.. ‘‘ దర్యాప్తు సక్రమంగా జరగటం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే. మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణంరాజుగారిని కూడా అన్ని పదవుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలి కదా? సిబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుంచి పదవుల నుంచి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్లాలి’’ అని పోస్టు పెట్టారు.
సునీల్ పోస్టు పెట్టిన తర్వాత… రఘురామరాజు డిటెక్టివ్ అవతారమెత్తారు. వెంటనే తన అనుచరులను చింతలపూడికి పంపించడం.. అక్కడి క్రైస్తవ శ్మశానవాటికలోని సునీల్ తల్లిగారి సమాధి ఫొటోలు, వీడియో తీయించడం.. దానిని అంతే వేగంతో సోషల్‌మీడియాలో పోర్టు చేయడం చకాచకా జరిగిపోయింది.
‘‘ ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరిగి మూడేళ్లయింది. అది కూడా తెలియకుండా పోస్టులు పెట్టే అజ్ఞానుల గురించి నేనేం మాట్లాడను’’ అని రఘురామరాజు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.
నేను క్రైస్తవ వ్యతిరేకి ని కాను
‘‘నేను క్రైస్తవులకు ఏమాత్రం వ్యతిరేకం కాదు. పైగా క్రైస్తవులను గౌరవిస్తా. క్షమా హృదయం ఉన్న క్రైస్తవాన్ని వ్యతిరేకించడం తెలివితక్కువ పని. కానీ క్రైస్తవ మతం తీసుకుని, దళిత కోటాలో ఉద్యోగాలు సంపాదించడం.. మళ్లీ ఆ ముసుగులో ఇతరులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి మాత్రమే నేను వ్యతిరేకం. సుప్రీంకోర్టు కూడా మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అని స్పష్టంగా చెప్పింది. అసలు క్రైస్తవానికి చెడ్డపేరు తీసుకువస్తున్నదే ఈ మతం మారిన వారు. కాబట్టే నా పోరాటానికి నిజమైన క్రైస్తవులు మద్దతునిచ్చి, ఆశీర్వదిస్తున్నార’’ని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
దీనివల్ల అసలైన క్రైస్తవుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నదే తన ఆవేదన, ఆందోళన అని ఆయన వివరించారు. ‘‘ పాపం అసలు నిజమైన క్రైస్తవులు తెలుగు రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు? మతం మారిన వారే ఎక్కువన్నది ప్రభుత్వాలకూ తెలుసు. నిజమైన క్రైస్తవుల కోసం ప్రభుత్వాలు ఏం చేసినా స్వాగతించాల్సిందే. నా పోరాటం కూడా మతం మారి ఉద్యోగాలు సంపాదిస్తున్న ఇలాంటి సునీల్ లాంటివారిపైనే’’ అని రఘురామరాజు స్పష్టం చేశారు.