– లైసెన్సు నుంచి అన్ని పంచాయతీలు సెటిల్ చేస్తారట
– విశాఖలో పీసీబీ మాజీ అధికారుల కొత్త అవతారం
– కన్సల్టెన్సీ అవతారమెత్తిన మాజీ అధికారులు
– భేటీకి రావాలంటూ కంపెనీ యజమానులకు ఫోన్లు
– ‘పీసీబీ పెద్ద’ ఆశీస్సులతో కొత్త వ్యాపారం
– నేడే కంపెనీ ప్రతినిధులతో భేటీ
– హాజరుపై కంపెనీల సందిగ్ధం
– వెళ్లకపోతే సమస్యలు సృష్టిస్తారన్న భయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
వాళ్లంతా పీసీబీలో చీఫ్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లుగా పనిచేసి రిటైరయిన అధికారులు. వారి అడ్డా విశాఖ. మరి విశాఖ అంటే తెలుసుకదా? వందల సంఖ్యలో కెమికల్ కంపెనీలుంటాయి. వాటికిఈసీబీ నుంచి సవాలక్ష సమస్యలుంటాయి. కొత్త కంపెనీలకు లైసెన్సు దొరకడం కష్టం.
అందుకే రిటైరయి ఖాళీగా ఉండే బదులు.. ఒక కన్సల్టెన్సీ పెట్టుకుని, ఈ వయసులో కూడా నాలుగు రాళ్లు వెనకేసుకుంటే పోలా? అన్న అద్భుత ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా.. మేం ఒక సమావేశం పెట్టాం. దానికి మీరు గానీ, మీ ప్లాంట్ మేనేజర్లను గానీ పంపిస్తే.. మీకు పరిశ్రమలపై అవగాహన కల్పిస్తామన్న పేరుతో సందేశాలు పంపించారు. చూడ్డానికి ఇదో అవగాహన సమావేశంగా కనిపించినా అసలు లక్ష్యం వేరన్న ప్రచారం జరుగుతోంది.
పీసీబీలో వివిధ స్థాయిలో పనిచేసిన కొంతమంది ఇంజనీర్లు కలసి.. విశాఖలో ఒక కన్సల్టెన్సీ ప్రారంభించినట్లు సమాచారం. ఆ ప్రకారంగా.. పీసీబీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా, తాము పరిష్కరిస్తామని ఇప్పటికే కంపెనీలకు సమాచారం పంపించారట. మరి కన్సల్టెన్సీ పెట్టింది ఒకప్పుడు విశాఖలో చక్రం తిప్పిన పీసీబీ అధికారులే కాబట్టి, వారికి వర్కులు ఇస్తే తమ సమస్యలు కూడా పరిష్కారమవుతాయన్న ఆశ కంపెనీ యజమానుల్లో సహజంగానే ఉంటుంది. ఈ ఆశనే పెట్టుబడిగా చేసుకుని, వ్యాపారం చేసుకునేందుకు పీసీబీ మాజీ అధికారులు సిద్ధమయ్యారట. పైగా వీరికి పీసీబీ పెద్ద ఒకరి మద్దతు కూడా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
సహజంగా కెమికల్ కంపెనీలకు సంబంధించి పీసీబీకి లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తుంటాయి. ప్రధానంగా ఆయా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు, విష వ్యర్ధాల తరలింపులో అనేక ఫిర్యాదులొస్తుంటాయి. ఈ కంపెనీలు తమ విష వ్యర్ధాలను శుద్ధి చేయకుండా, నేరుగా కాల్వలు-చెరువులు, కొండ ప్రాంతాల్లో పారబోస్తుంటాయి. ఇక తరచూ జరిగే పేలుళ్లు.. విడుదలయ్యే గ్యాస్ వల్ల కార్మికులు చనిపోతుంటారు. అప్పుడు పీసీబీ ఆ కంపెనీలను మూయిస్తుంటుంది. మళ్లీ అవి తెరిపించడం ఒక ప్రహసనం. విజయవాడ హెడ్డాఫీసు చుట్టూ తిరగాలి. బోలె డు లాబీయింగ్ చేయాలి. అందరినీ సంతృప్తి పరచాలి. దానికి బోలెడంత ఖర్చు పెట్టాలి. ఈ సినిమా కష్టాలేమీ లేకుండానే..తాము పెట్టుకున్న కన్సల్టెన్సీకి వర్కులిస్తే వ్యవహారం చక్కదిద్దుతామన్నది ఈ మాజీ అధికారులు, కంపెనీలకు ఇస్తున్న బంపర్ ఆఫర్.
రాంకీ, హెటిరో వంటి బడా కంపెనీలపై ఇప్పటికే లెక్కలేనన్ని ఫిర్యాదులున్నా పీసీబీ వారిపై ఈగ వాలనివ్వకుండా రక్షిస్తోందన్న విమర్శలు కార్మిక సంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. పాలకుల కుటుంబ సభ్యులతో తమ కంపెనీ యజమానలకు సాని్నిహ త్యం ఉన్నందున, తమ కంపెనీలను ఎవరేమీ చేయలేరని.. ఆ కంపెనీకు పీసీబీ ఆఫీసులో లాబీయింగ్ చేసే లాబీయిస్టులు, బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి. బహుశా అందుకే రాంకీపై ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా పెట్టకపోయి ఉండవచ్చు. పీసీబీ ఆఫీసులో రెడ్డిగారి కంపెనీల లాబీయిస్టులే ఎక్కువ దర్శనమిస్తుండటం విశేషం.
కాగా అవగాహన పేరిట గురువారం విశాఖలో ఒక సమావేశం ఏర్పాటుచేసి, దానికి కంపెనీ యజమానులకు ఫోన్లు చేసి.. మీరొచ్చినా సరే, లేదా మీ ప్లాంటు మేనేజర్లు వచ్చినా సరే.. తప్పకుండా మీ ప్రతినిధిని పంపించండి అని ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే వీరంతా ఒకప్పుడు పీసీబీలో చక్రం తిప్పిన వారే కావడం.. పైగా విజయవాడ హెడ్డాఫీసుతో విస్తృత సంబంధాలు ఉండటం.. దానికంటే ఒక ‘పీసీబీ పెద్ద’ మద్దతు ఉందన్న ప్రచారం జరుగుతుండటంతో.. ఆ సమావేశానికి వెళ్లాలా? వద్దా? అన్న అని కంపెనీ యజమానులు డోలాయమానంలో ఉన్నారట.
పైగా ఒకప్పుడు విశాఖలోనే పనిచేసిన సదరు అధికారుల సత్తా తెలిసిన కంపెనీల యజమానులు.. వారంతా కలసి కన్సెల్టెన్సీ పెట్టుకున్నారని తెలిసి హడలిపోతున్నారట. తమ కంపెనీ లోపాలపై సదరు మాజీ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉన్నందున, సమావేశానికి వెళ్లకపోతే ఏమవుతుందోనన్న భయంతో హడలిపోతున్నారట.
పీసీబీలో పనిచేసినంత కాలం.. పరిశ్రమలతోపాటు, విజయవాడ పీసీబీ ఉద్యోగులను కంటిచూపుతో శాసించిన నాటి అధికారులే, ఈ కన్సల్టెన్సీలో ఉన్నారని తెలిసి భయపడుతున్నారట. వారికి పీసీబీ పెద్ద ఒకరు, తొలి నుంచి దన్నుగా ఉన్నారన్న విషయం వారిని ఆలోచనలో పడేసిందట.
ఒకవేళ ఆ సమావేశానికి వెళ్లి, వారు చెప్పినట్లు వింటే.. సదరు మాజీల కన్సల్టెన్సీ చెప్పిన రేటు ఇచ్చుకోవాల్సిందే. హాజరుకాకపోతే.. తమ పలుకుబడి వినియోగించి, పీసీబీ ఇప్పటి అధికారులతో ఎక్కడ వేధింపులకు పాల్పడతారోనన్న భయం!
ఎందుకంటే ఇప్పుడు పీసీబీలో పనిచేస్తున్న అధికారుల్లో .. రిటైరయి కన్సల్టెన్సీ పెట్టుకున్న మాజీల వద్ద పనిచేసిన వారే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ ప్రకారం రిటైరయిన అధికారుల ప్రభావం, ప్రస్తుత అధికారులపై ఎక్కువగా ఉంటుంది. దీనితో రిటైరయి కన్సల్టెన్సీ పెట్టుకున్న పీసీబీ మాజీ అధికారుల సమావేశానికి వెళ్లాలా? వద్దా అని కంపెనీ యజమానులు మీమాంసలో ఉన్నారట.
కాగా ఇప్పుడు కన్సల్టెన్సీ పెట్టుకున్న పీసీబీ మాజీ అధికారులంతా.. వైసీపీ హయాంలో చక్రం తిప్పిన వారేనంటున్నారు. వారికి ఇప్పటి పీసీబీ పెద్దల దన్ను ఉందన్న ప్రచారమే విస్మయం కలిగిస్తోంది. కేకేఆర్, క్రెబ్స్ను తిరిగి ప్రారంభించేందుకు సైతం తెరవెనక పెద్ద లాబీ పనిచేసిందన్న ప్రచారం జరుగుతోంది.