– 12702 గ్రామ పంచాయతీలలో 7527 కాంగ్రెస్, 808 మంది కాంగ్రెస్ రెబల్స్ నెగ్గారు
– 8335 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారు
– కేసీఆర్ ..గోదావరి, కృష్ణా జలాలపై సభలో చర్చకు సిద్ధం
– గోదావరి, కృష్ణా జలాలపై ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం
– ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తాం
– కేసీఆర్ కు రేవంత్ సవాల్
– మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఎలాంటి లోటు పాట్లు లేకుండా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసిన అధికారులకు అభినందనలు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మాకు సంపూర్ణ మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు.
12702 గ్రామ పంచాయతీలలో 7527 కాంగ్రెస్, 808 మంది కాంగ్రెస్ రెబల్స్ నెగ్గారు. 8335 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారు. అంటే 66 శాతం కాంగ్రెస్ గెలుచుకుంది.బీఆరెస్, బీజేపీ కూటమిగా 33 శాతం, కమ్యూనిస్టులు 1 శాతం ఫలితాలు సాధించాయి. ఇవి రెండేళ్ల ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. 94 శాసనసభ నియోజవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల జరిగితే 87 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక ఫలితాలు సాధించింది. బీఆరెస్ 6 నియోజవర్గాల్లో , బీజేపీ 1 నియోజకవర్గంలో అత్యధిక ఫలితాలు సాధించాయి.
పేదలకు మేం అందించిన సన్నబియ్యం, ఉచిత కరెంటు, సజ్జ వడ్లకు బోనస్, 500 కే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన ఇతర పథకాలతో ప్రజలు మమ్మల్ని ఆదరించారు. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించాం. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించాం.
హోదాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేసేలా మేం నిర్ణయం తీసుకోలేదు. గెలిస్తే కళ్లు నెత్తికెక్కినట్లుగా మేం ఏనాడు వ్యవహరించలేదు. ఈ ఫలితాలు మాపై మరింత బాధ్యతను పెంచాయి. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర బీజేపీ చేస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం.
ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కొందరికి ఇంకా అహంకారం తగ్గలేదు. ఒకాయన కడుపులో మూసీలో కాలుష్యం కంటే ఎక్కువ విషం కనిపిస్తోంది. ఈ ఫలితాలుచూసే అద్భుతం అని కొందరు జబ్బలు చరుచుకుంటున్నారు. 2029 లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి. 2/3 మెజారిటీతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆరెస్ గెలవలేదు. కేటీఆర్ ను తప్పించాలని హరీష్ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టింది. అందుకే ఆ విషయం చర్చకు రాకుండా కేటీఆర్ జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారు.
మీ కోపంతో అసూయతో ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకోవద్దు. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉండగానే ఆయన్ను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు. కెసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా.
ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమనండి. కృష్ణా జలాలపై ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం. ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తాం. గోదావరి, కృష్ణా జలాలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేళ్లలో తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసింది బీఆరెస్, కేసీఆర్. గోదావరి, కృష్ణా జలాలపై వారు చేసిన ద్రోహం ఆధారాలతో సహా నిరూపిస్తాం. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రజాస్వామ్య బద్ధంగా అసెంబ్లీలో చర్చ చేసి ముందుకు వెళతాం.