– గణపురం ఆనకట్టకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి
– యాసంగి సాగుపై మెదక్ జిల్లా రైతాంగం తీవ్ర అయోమయంలో ఉంది
– వేసవిలో చేయాల్సిన సింగూరు మరమ్మతులు ఇప్పుడు చేయడం ప్రభుత్వ అసమర్థత కు నిదర్శనం
– కేసీఆర్ పాలనలో బోరు బండి మాయమైతే, రేవంత్ పాలనలో మళ్లీ బోర్లు వచ్చాయి
– సింగూరు ప్రాజెక్టు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హక్కును కాపాడాలి
– సాగునీరు ఇవ్వకపోతే క్రాఫ్ హాలిడే ప్రకటించి ఎకరాకు నష్టపరిహారం చెల్లించాలి
– గత యాసంగి, ఈ వానాకాలం బకాయి 1800 కోట్ల బోనస్ విడుదల చేయాలి
– స్మార్ట్ఫోన్లు లేని మహిళా రైతులు అధికారుల చుట్టూ తిరగాలా?
– వ్యవసాయానికి యాప్‌లు, మ్యాప్‌లు కాదు.. నీళ్లు, కరెంటు, ఎరువులు కావాలి
-మాజీ మంత్రి హరీష్ రావు
మెదక్: కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల మెదక్ జిల్లా రైతాంగం నేడు అగమ్యగోచర స్థితిలో ఉంది. యాసంగి పంట సాగు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. సింగూరు ప్రాజెక్టు నుండి గణపురం ఆనకట్టకు సాగునీరు విడుదల చేస్తారా లేదా అన్న అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం దారుణం. పాపన్నపేట, హవేలీఘన్పూర్, కొల్చారం, మెదక్ రూరల్ మండలాల్లోని వేలాది ఎకరాలు గణపురం కట్టపైనే ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తారు.
సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో ప్రభుత్వం నీటిని ఖాళీ చేసింది. నిజానికి ఈ పనులు వేసవి కాలంలోనే పూర్తి చేసి ఉంటే ఇప్పుడు యాసంగికి ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు ఉంది, పంటను కాపాడుతూనే మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదు. నాట్లు వేసే సమయం ఆసన్నమైనా అధికారులు, పాలకులు స్పందించకపోవడంతో రైతులు గత్యంతరం లేక మళ్ళీ బోర్లు వేస్తూ అప్పుల పాలవుతున్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో బోరు బండి మాయమైతే, రేవంత్ రెడ్డి పాలన వచ్చిందంటే మళ్ళీ పాత రోజులు వచ్చాయి. సింగూరు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హక్కును కాపాడాలి. తక్షణమే నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలి, లేని పక్షంలో క్రాఫ్ హాలిడే ప్రకటించి ఎకరాకు తగిన నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి. గత పది సంవత్సరాల్లో రెండు పంటలకు నీళ్లు ఇచ్చి హైదరాబాద్ కు రైతులు రాకుండా చూసింది బిఆర్ఎస్ ప్రభుత్వం.
అవసరమైతే కాళేశ్వరం నీళ్లను మళ్లించి పంటలను కాపాడాం. కానీ ఈ ప్రభుత్వం రైతులను అయోమయానికి గురి చేస్తూ మొద్దు నిద్ర పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, రైతుబంధు, బోనస్ విషయంలో రైతులను దారుణంగా మోసం చేసింది. ఏడుపాయల సాక్షిగా ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి, నేటికీ కేవలం 40 శాతం మందికి మాత్రమే పూర్తి చేశారు. గత యాసంగి ఈ వానాకాలం కలిపి రైతులకు రావాల్సిన సుమారు 1800 కోట్ల రూపాయల బోనస్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.
యాసంగి సీజన్ ప్రారంభమైనా పెట్టుబడి సాయం ఊసే లేదు. సాగు చేసిన వారికే ఇస్తామంటూ సాకులు వెతుకుతూ పత్తి, చెరుకు, పసుపు సాగు చేసే రైతులకు ఎగనామం పెట్టాలని చూస్తున్నారు. ఎటువంటి కోతలు లేకుండా రైతుబంధు నిధులను తక్షణమే విడుదల చేయాలి. పోయిన వానాకాలంలో యూరియా, జనుము, జీలుగు విత్తనాలు దొరక్క రైతులు అష్టకష్టాలు పడ్డారు. వ్యవసాయానికి నీళ్లు, కరెంటు, ఎరువులు ఇవ్వడం చేతగాక ఈ ప్రభుత్వం యాప్‌లు, మ్యాప్‌ల పేరుతో దొంగ నాటకాలు ఆడుతోంది.
అక్షరాస్యత లేని రైతులు, స్మార్ట్ఫోన్లు లేని మహిళా రైతులు అధికారుల చుట్టూ తిరగాలా? నెట్వర్క్ లేని గ్రామాల్లో రైతులు ఈ యాప్‌లు ఎలా వాడతారు? ఇది కేవలం ఎరువుల సరఫరాను తగ్గించి రైతులను వేధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న నాటకం. పత్తి రైతులకు కపాస్ యాప్ తెచ్చి బీజేపీ ముంచితే, ఎరువుల కోసం యాప్ తెచ్చి కాంగ్రెస్ ముంచుతోంది. కౌలు రైతుల భవిష్యత్తును కూడా ఈ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసింది. తక్షణమే ఈ యాప్ నాటకాలు బంద్ చేసి, గతంలో మాదిరిగా ఫెర్టిలైజర్ షాపుల ద్వారా యూరియా అందించాలి.
కేసీఆర్ హయాంలో యూరియా, కరెంటు, రైతుబంధు, పంట కొనుగోలుకు ఎన్నడూ ఇబ్బంది లేదు. ఇప్పుడు అన్ని ఇబ్బందులే, ఎక్కడా 14 గంటల కరెంటు కూడా రావడం లేదు. రైతులకు, కౌలు రైతులకు మధ్య పంచాయతీలు పెడుతూ అడుగడుగునా రైతులను కష్టాల పాలు చేస్తున్నారు. పంట కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
తక్షణమే రుణమాఫీ పూర్తి చేయాలి, బోనస్ బకాయిలు చెల్లించాలి, రైతుబంధు విడుదల చేయాలి మరియు గణపురం ఆనకట్ట నీటిపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.