– గాంధీ పేరును వాడుకున్నంత మాత్రాన గాంధీ సిద్ధాంతాలను గౌరవించినట్లు కాదు
– గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుపై కాంగ్రెస్ రాజకీయాలు
– దక్షిణాది రాష్ట్రాల్లో మార్పు మొదలైంది
– భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్: ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో ఏదో జరిగిపోయిందన్నట్లుగా చూపిస్తూ, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యాలయాలను ముట్టడించేలా కార్యక్రమం నిర్వహించింది. మొట్టమొదటగా ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్న అంశం. ఈడీ జారీ చేసిన నోటీసులు, దర్యాప్తు అన్నీ చట్టబద్ధమైనవే. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవించే పార్టీ.
కోర్టు తీర్పు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటే “న్యాయవ్యవస్థ గొప్పగా పనిచేసింది” అంటారు. అదే తీర్పు అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టు తీర్పులు, ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ శాఖలను కూడా తూర్పారబట్టి, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, ఎన్నికల వ్యవస్థను, హోం మంత్రిత్వ శాఖను లక్ష్యంగా చేసుకుని ఏది పడితే అది బురద జల్లే రాజకీయాలకు దిగుతున్నారు.
రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గే నుంచి మొదలుకొని, కాంగ్రెస్ నాయకత్వం అంతా ఈ విధమైన ఆందోళనల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ, వరుసగా బ్రహ్మాండమైన ఎన్నికల ఫలితాలు సాధిస్తున్న సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. బీహార్‌లో అత్యధిక స్థానాలు గెలవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో త్రివేండ్రంలో భారీ మెజారిటీతో విజయం సాధించడం.. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి జీర్ణించుకోలేని విషయాలుగా మారాయి.
ఈ విజయాలన్నిటి నేపథ్యంలో, ఒక కుట్రపూరిత రాజకీయ వాతావరణంలో, ప్రజల దృష్టిని మళ్లించేందుకు “ఏదో జరిగిపోయింది” అన్న భావన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ఖండించాలి.
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ అది చట్ట పరిధిలో, శాంతియుతంగా ఉండాలి. బీజేపీ కార్యాలయాలపై దాడులు చేయడం, విధ్వంస కార్యక్రమాలకు పాల్పడడం అత్యంత శోచనీయం. ఈ విధమైన కాంగ్రెస్ చేస్తున్న హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో, హోం మంత్రిగా అమిత్ షా పనిచేసిన కాలంలో వారిపై అనేక ఏజెన్సీల ద్వారా తీవ్రంగా వేధింపులు జరిగాయి. అయినప్పటికీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి హోదాలోనే విచారణలకు పూర్తిగా సహకరించారు. ఆ సమయంలో పెట్టిన అన్ని కేసులను న్యాయస్థానాలు సమగ్రంగా పరిశీలించి పూర్తిగా కొట్టివేశాయి. న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులను మేం గౌరవించాం.
కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినప్పుడు న్యాయవ్యవస్థ గొప్పదని చెప్పి, ప్రతికూలంగా వచ్చినప్పుడు బీజేపీ కార్యాలయాలపై దాడులు చేయడం, విధ్వంసానికి పాల్పడటం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. “శాంతియుత నిరసన” అంటూ ముందుకొచ్చి, లోపల కుట్రపూరితంగా విధ్వంసానికి పాల్పడటాన్ని ఖండిస్తున్నాం.
వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి, పేదరికాన్ని జయించి మూడోసారి దేశ ప్రధానిగా నిలిచిన నరేంద్ర మోదీ ఎదుగుదలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ విజయాలను ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీలతో గెలిస్తే వెంటనే “ఓటు చోరీ” అని ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది.
రామలీలా మైదానం నుంచి నేషనల్ హెరాల్డ్ కేసు వరకు ప్రతీ అంశాన్ని ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ వాడుకుంటోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుపై కూడా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది. గాంధీ పేరును వాడుకున్నంత మాత్రాన గాంధీ సిద్ధాంతాలను గౌరవించినట్లు కాదని దేశానికి తెలుసు. గాంధీ కుటుంబాన్ని నిజంగా గౌరవించిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదని దేశ ప్రజలకు బాగా తెలుసు.
ఈరోజు గాంధీ పేరు ట్యాగ్‌గా వాడుతూ, ఏదో జరిగిపోతున్నట్లు ప్రజలను భ్రమింపజేయడమే కాంగ్రెస్ రాజకీయ లక్ష్యంగా మారింది. ఉపాధి హామీ పథకంపై కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభ, రాజ్యసభల్లో స్పష్టమైన వివరణ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ విలువలపై నిజమైన గౌరవం లేదు. ఎమర్జెన్సీ విధించింది వాళ్లే, ఈరోజు రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చేది వాళ్లే.
బిజెపి రాష్ట్ర కార్యాలయం ఎదుట కాంగ్రెస్ చేసిన హింసాత్మక చర్యలను, ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఖండిస్తున్నాం. దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మార్పు మొదలైంది – కర్ణాటక, త్రివేండ్రం, తమిళనాడు సహా. రాబోయే ఎన్నికల్లో కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి బ్రహ్మాండమైన ఫలితాలు రానున్నాయి. ఈ మార్పును జీర్ణించుకోలేకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దురహంకార, విధ్వంసాత్మక చర్యలకు పాల్పడుతోంది.