– గ్రామాభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే
– రాష్ట్ర ప్రభుత్వ వాటా నయాపైసా లేదు
– గాంధీజీ పేరును కుటుంబ రాజకీయాలకు వాడుకున్నది సోనియా, రాహుల్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీయే.
– నిర్మల్ జిల్లా సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు
నిర్మల్ : సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఒక ఒప్పందం కుదిర్చేందుకే యుపి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి, బీజేపీపై దాడి చేయడమే అఖిలేష్ పర్యటన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
జిల్లా సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఘన విజయం సాధించిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను ఈ సందర్భంగా ఆయన సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ… ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 181 గ్రామపంచాయతీలు ఉంటే, అందులో 103 గ్రామపంచాయతీల్లో బిజెపి అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారు. అదే విధంగా నిర్మల్ జిల్లాలో 128 గ్రామపంచాయతీలు ఉంటే, దాదాపు 80కి పైగా గ్రామపంచాయతీల్లో బిజెపి సర్పంచులు విజయం సాధించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా 32 మంది బీజేపీ సర్పంచులు గెలిచారు.
పక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల్లో కూడా బిజెపి అభ్యర్థులు సర్పంచులుగా మంచి విజయాలు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1000 నుంచి 1200 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారినీ కాంగ్రెస్ గెలుపుగా ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. గెలిచిన వారందరినీ తమవారిగా చెప్పుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదు. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అందుకే రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా బుద్ధి చెబుతారు. తెలంగాణ వ్యాప్తంగా బిజెపి తరఫున సుమారు వెయ్యికి పైగా సర్పంచులు, 1200 మందికి పైగా ఉపసర్పంచులు, 10 వేల మందికి పైగా వార్డు సభ్యులు విజయం సాధించారు.
గతంలో భారతీయ జనతా పార్టీకి కేవలం 163 మంది మాత్రమే సర్పంచులు ఉండగా, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వెయ్యికి పైగా సర్పంచులుగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా, ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు.
ప్రధాని నరేంద్ర మోదీ పేదల కోసం, గ్రామీణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వీధి దీపాలు, స్మశానవాటికలు, రైతు వేదికలు, పేదలకు ఉచిత బియ్యం, పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, ఉజ్వలా పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు, యువతకు స్వయం ఉపాధి రుణాలు, ఉపాధి హామీ నిధులు, 14వ, 15వ ఆర్థిక సంఘాల నిధులను గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నేరుగా అందించడం.. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది.
ఇంటింటికి తాగునీరు, పక్కా రోడ్లు, గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, పీఎం-కిసాన్ సమ్మాన్ కింద ప్రతి రైతుకూ ఏటా రూ.6000- ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వమే. ప్రస్తుతం తెలంగాణలో వేలకోట్లతో విలువైన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది.
గతంలో ఫైనాన్స్ కమిషన్ నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా నిధులను దారి మళ్లించే ప్రమాదం ఉంది. నిజామాబాద్-ఆదిలాబాద్ రైల్వే లైన్, నిర్మల్ రైల్వే స్టేషన్ వంటి అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమయ్యాయి.
ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కేటీఆర్, రేవంత్ రెడ్డిలను కలిశారు. వారిద్దరి మధ్య ఒప్పందం కుదర్చడానికే ఈ భేటీ జరిగింది. వికసిత్ భారత్ రోజ్గార్, ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) – VB-G RAM G పై కాంగ్రెస్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోంది. మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం లేదు. ఇది పదే పదే చెబుతున్నా కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
నేటి గ్రామీణ అవసరాలకు అనుగుణంగా మరింత పటిష్టంగా, విస్తృతంగా అమలు చేయడానికే వికసిత్ భారత్–2047 లక్ష్యానికి అనుగుణంగా VB-G RAM G తీసుకొచ్చింది. ఇది ఉపాధిని మరింత పెంచడం. గతంలో 100 రోజుల ఉపాధి హామీ ఉంటే, ఇప్పుడు 125 రోజుల ఉపాధి హామీ కల్పించడం జరుగుతోంది.
కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనలో ఉపాధి హామీకి సుమారు రూ.1.08 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 11 ఏళ్లలోనే సుమారు రూ.8 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు జరిగాయి.
మహాత్మాగాంధీ ని బీజేపీ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. గాంధీజీ పేరును కుటుంబ రాజకీయాలకు వాడుకున్నది సోనియా, రాహుల్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీయే. VB-G RAM G పథకంలో “రామ్” అనే పదం ఉందనే కారణంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాయి. బిజెపి కార్యాలయాలపై దాడులు చేస్తే కాంగ్రెస్ ఎదుర్కోలేని ప్రతిస్పందన తప్పదని హెచ్చరిస్తున్నాం. రాజకీయాల్లో హింస ప్రజాస్వామ్యం కాదు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోద్భలంతో అధికార దుర్వినియోగం, పోలీసుల ఒత్తిడి, బెదిరింపులు జరిగాయి.
రైతుబంధు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం, ఫసల్ బీమా యోజనను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. కానీ మోదీ ప్రభుత్వం పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు నేరుగా మద్దతు ఇస్తోంది. గత 11 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకునే రాజకీయాలే చేశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును ఎలా పంచుకోవాలో చూస్తుంటే, మరొకరు అదే దోపిడి సొమ్మును ఎలా పంచుకోవాలో చూస్తున్నారు. తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ కావాలంటే, అభివృద్ధి మార్గంలో ముందుకెళ్లాలంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. రానున్న అన్ని ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని కోరుతున్నాను.