– ఫ్యూచర్ సిటీ, ఫోర్త్‌సిటీ గ్రామాల్లో కాంగ్రెస్ ఓటమి
– పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పాలనపై రాజకీయ రిఫరెండం
– ఫలితాలు కాంగ్రెస్ బలుపు కాదు… వాపు
– సీఎం ప్రచారం చేసినా ఫలితాలు ఉల్టానే
– కాంగ్రెస్‌కు వాస్తవంగా వచ్చిన సంఖ్య సుమారు 6,300–6,400 మధ్యే
– దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి
– బీజేపీ అభ్యర్థులు గెలవడం ఆరు రెట్లకు పైగా పెరుగుదల
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్
హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనపై గ్రామీణ ప్రజల తిరస్కారానికి నిదర్శనం. గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పాలనపై రాజకీయ రిఫరెండం. 50 శాతం మద్దతు కూడా పొందలేని ప్రభుత్వం ప్రజల ముందు మాట్లాడే నైతిక హక్కును కోల్పోయింది.
దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. అబద్ధాల లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. 2029 అన్న మాటలతో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినట్టే. సీఎం ప్రచారం చేసినా ఫలితాలు ఉల్టానే. గ్లోబల్ సమ్మిట్ ను నమ్మా రు.. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను మాత్రం ప్రజలు నమ్మడంలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ చెప్పే లెక్కలు – పూర్తిగా అబద్ధాలు. గ్రామం నుంచి పార్లమెంట్ వరకూ బీజేపీనే ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ కు ప్రజల మద్దతు ఉందని భావిస్తే, ఎంపిటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలను ఎందుకు వాయిదా వేస్తున్నట్లు? గత రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 90 శాతం ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయం. అయితే ఈ సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవని తెలిసినా, రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. అందులో కాంగ్రెస్ పార్టీ 7,527 సర్పంచులు గెలిచిందని, రెబల్స్‌ను కలిపి 8,335 అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అబద్ధాల మేళవింపే.
రెబల్స్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 1000 నుంచి 1200 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని కూడా కాంగ్రెస్ గెలుపుగా చెప్పుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. అందులో యునానిమస్‌గా ఎన్నికైన సర్పంచులు, అలాగే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన రెబల్స్‌ను కూడా తమ ఖాతాలో కలిపి, మొత్తం 8,335 మంది కాంగ్రెస్ సర్పంచులు గెలిచారని చెప్పడం పూర్తిగా తప్పుడు సమాచారమే.
రాష్ట్రంలో రెబల్స్, ఏకగ్రీవమైన సర్పంచులను తీసివేస్తే, కాంగ్రెస్‌కు వాస్తవంగా వచ్చిన సంఖ్య సుమారు 6,300–6,400 మధ్యే ఉంటుంది. గెలిచినోళ్లంతా మనోళ్లే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డబ్బులు, మద్యం పంచి, పోలీసుల ద్వారా భయపెట్టే ప్రయత్నాలు చేసినా, గ్రామీణ ప్రజలు ఈసారి స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
గతంలో బీజేపీకి కేవలం 167 సర్పంచ్ స్థానాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు 1000కి పైగా సర్పంచ్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం ఆరు రెట్లకు పైగా పెరుగుదల. ముధోల్ అసెంబ్లీ పరిధిలో 181 గ్రామ పంచాయతీలకు గాను 103 చోట్ల బీజేపీ మద్దతున్న అభ్యర్థులు గెలుపొందారు. నిర్మల్ జిల్లాలో 128 గ్రామ పంచాయతీల్లో 80కు పైగా బీజేపీ మద్దతున్న అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కూడా బిజెపి అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్‌లో తొలిసారిగా ఎస్సీ మహిళ సర్పంచ్‌గా అంజమ్మ భారీ మెజారిటీతో గెలవడం, కాంగ్రెస్‌కు కేవలం 100 ఓట్లు మాత్రమే రావడం, ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. గత పంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధతిలో 22 సర్పంచ్ స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు.
ఈసారి మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 106 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. అంటే గతంతో పోలిస్తే బీజేపీ దాదాపు 5 రెట్లు అధికంగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. మరో 130 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. వీరు గాకుండా సర్పంచ్ లుగా గెలిచిన మరో 30 మందికిపైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈనెల 24న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సమక్షంలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఫలితాలు కాంగ్రెస్ బలుపు కాదు… వాపును చూస్తున్నాయి. గ్రామాల్లో ఎవరు గెలిచినా వారంతా కాంగ్రెస్ వారేనని ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనడంలో సందేహమే లేదు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టబోతున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్కక్కయ్యారని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోంది.
బీఆర్ఎస్ తో కుమ్కక్కైంది ముమ్మాటికీ కాంగ్రెస్సే. అందుకే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోకుండా, బాధ్యులైన కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా కాపాడుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలవడమే కాకుండా, రాష్ట్రంలోని 57–60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అగ్రస్థానం లేదా రెండో స్థానంలో నిలవడం ప్రజల మద్దతు పెరుగుతున్నదానికి నిదర్శనం.
గ్రామం నుంచి పార్లమెంట్ వరకూ బీజేపీ మరింత బలపడుతోంది. తెలంగాణలో రానున్న రోజుల్లో అధికారంలోకి రానున్నది భారతీయ జనతా పార్టీనే. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసిన ప్రాంతాల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురవడం ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనం. ప్రత్యేకంగా సీఎం ప్రచారం ప్రారంభించిన మక్తల్ మండలంలోనే కాంగ్రెస్ ఓటమి పాలవడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం. ఫ్యూచర్ సిటీ ప్రధాన గ్రామం మీర్ఖాన్పేటలో, గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా, ప్రజలు కాంగ్రెస్‌ను స్పష్టంగా తిరస్కరించారు.
కాలికి బలపం కట్టుకుని సీఎం ప్రచారం చేసినా, ప్రజలు పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ఫెయిల్యూర్ పాలనపై పట్ల ప్రజావ్యతిరేకతను స్పష్టంగా చూపిస్తోంది. ఉదాహరణకు.. కందుకూరు మండలాన్ని నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించి, ఫోర్త్ సిటీ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడి ప్రజలు కాంగ్రెస్ పాలనను నమ్మలేదు. ఇక్కడ మొత్తం 35 గ్రామ పంచాయతీల్లో బీజేపీ – 12, బీఆర్ఎస్ – 10, కాంగ్రెస్ – 10, ముగ్గురు ఇండిపెండెంట్లు గెలుపొందారు.
సీఎం ప్రచారం చేసిన బ్యాగరికంచె, ముచ్చర్ల, ఆకుల మైలారం గ్రామాల్లో బిజెపి విజయం సాధించింది. ఫోర్త్ సిటీ పేరుతో జరుగుతున్న ప్రచారానికి, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని స్పష్టం చేస్తోంది.
కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బహిరంగంగా “2029లో మళ్లీ గెలుస్తాం” అని చెబుతుండడం ద్వారా, 2028లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి, వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతిస్తున్నట్టే కనపడుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ప్రజల మద్దతు ఉందని భావిస్తే, ఎంపిటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలను ఎందుకు వాయిదా వేస్తున్నారు..?
ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డిలా విస్తృతంగా గ్రామాలు తిరిగి, హెలికాప్టర్లతో ప్రచారం చేసి, ప్రజలను నయానో భయానో మభ్యపెట్టే ప్రయత్నం చేయలేదు.. కానీ హామీలు అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించి తీర్పునిచ్చారు. ఇప్పటికైనా ప్రజాతీర్పును గౌరవించాలి.
ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి గెలిచినా తర్వాత పార్టీ మారాలంటే.. తప్పనిసరిగా రాజీనామా చేసి మళ్లీ ప్రజల ముందుకు రావాలి. ఇదే బీజేపీ స్పిరిట్. కాంగ్రెస్‌కు ఈ ధైర్యం ఉందా? ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నది ఏమిటంటే ..బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రజల తీర్పును అవమానిస్తూ కండువాలు కప్పడం. అభివృద్ధి కోసం వచ్చామనడం అబద్ధం. అది పూర్తిగా కుటిల రాజకీయమే.
నిజంగా కాంగ్రెస్ ప్రజల మద్దతు ఉంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. అప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అనైతిక రాజకీయాలకు ప్రజలు బుద్ధిచెబుతారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్‌కు రిఫరెండం అని సీఎం చెబుతున్నారంటే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసురుతున్నాం. గ్రామం నుంచి పార్లమెంట్ వరకూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్న ఏకైక పార్టీ బీజేపీనే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, రానున్న MPTC, ZPTC, కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికలకు ట్రైలర్ మాత్రమే, తెలంగాణలో రానున్న రోజుల్లో అధికారంలోకి రానున్నది భారతీయ జనతా పార్టీయే.
ఇంతకుముందు ఐటీ సిటీ, ఫార్మా సిటీ, గ్లోబల్ సిటీ, సింగపూర్ మోడల్, దావోస్ టూర్లు, మిస్ వరల్డ్ షోలు.. ఇలా అన్నీ అయ్యాయి. ఫలితం ఏంటి? ఒక్క పెద్ద కోర్ ఇండస్ట్రీ లేదు, పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి, యువతకు ఉద్యోగాలు లేవు. గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు ఎంత? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? వైట్ పేపర్ విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
డెవలప్మెంట్కు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అబద్ధపుమాటలు, మభ్యపెట్టే వాగ్ధానాలను ప్రజలు ఇక నమ్మరు. దేశమంతా మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ దిశగా నడుస్తుంటే, తెలంగాణలో మాత్రం రావణ రాజ్యం కొనసాగుతోంది. ఈ పరిస్థితిని మార్చాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కారే తెలంగాణ అభివృద్ధికి ఏకైక మార్గం. రాబోయే ఎంపిటీసీ-జెడ్పిటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అఖండ విజయం వైపు నడిపించాలని ప్రజలను కోరుతున్నాం.