– అధికారులపై నింద వేసి తప్పించుకునేందుకు సీఎం యత్నం
– కలెక్టర్లు ప్రభుత్వ నిర్ణయాల డెలివరీ మెకానిజమ్ మాత్రమే
– పాలనా యంత్రాంగం అంతా సీఎం వద్దే. అదే దిశ తప్పింది
– బసవ తారకం ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తున్నారా?
– ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు కలగా మారిన వైనం
– మాజీ మంత్రి, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)
మచిలీపట్నం: కలెక్టర్లు సరిగా పని చేయడం లేదంటే అది చంద్రబాబు వైఫల్యమేనని మాజీ మంత్రి, వైయస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు కలెక్టర్లు కేవలం డెలివరీ మెకానిజమ్ మాత్రమే అని, వారికి దిశానిర్దేశం చేసేది సీఎం అని ఆయన గుర్తు చేశారు. తన వైఫల్యాలు, తప్పులను అధికారులపై వేసి, సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కలెక్టర్లు, ఎస్పీల సమావేశం పేరుతో సీఎం చేసింది పాలనా సమీక్ష కాదని, ఒక కాలక్షేప కార్యక్రమం అని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు మెరుగైన వైద్యం దూరం చేస్తున్నారని మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు.
సీఎం చంద్రబాబుగారు రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను పిలిచి వారిని దాదాపు 20 గంటలు కూర్చోబెట్టారు. ఈ సమావేశంలో పాలనా సమీక్ష జరగాల్సిన చోట, అధికారులు ఎలా ఉండాలి. ఎలా ఉద్యోగం చేయాలి. ఎవరైనా లావుగా ఉంటే బరువు ఎలా తగ్గాలి. ఫిట్‌గా ఎలా ఉండాలి. వంటి అంశాలపై కాలక్షేప బఠానీ కబుర్లు చెప్పారు. ఆ కాలక్షేపాన్ని కూడా ప్రజలు చూసేలా టీవీల్లో ప్రసారం చేయించారు.
ఇంకా ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘మీరు గొప్పగా పని చేస్తున్నామని అనుకుంటున్నారు. నేనూ అలా అనుకుంటున్నాను. కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు’ అంటూ కలెక్టర్లు, ఎస్పీల పనితీరుపై నిందలు వేశారు. రెండేళ్లు పూర్తి అవుతున్న సందర్భంలో ఆయన సూక్తిముక్తావళి చెబుతూ అధికారులను దోషులుగా చూపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వారిని పని చేయనివ్వకుండా, అనేక ఆంక్షలు విధించడం ఆయన ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది.
మొట్టమొదటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మాత్రం చంద్రబాబు పూర్తిగా భిన్నంగా మాట్లాడారు. ‘మనది పొలిటికల్ గవర్నెన్స్. మా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు మీ వద్దకు వస్తారు. వారికి మర్యాద ఇవ్వండి. మా ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాకుండా చూసుకోండి’ అంటూ అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు చెప్పిన మాటలకు, ఇవాళ చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది.
‘మీరు సరిగ్గా పని చేయడం లేదు, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు’ అంటూ అధికారులనే లక్ష్యంగా చేసుకున్నారు. నిజానికి కలెక్టర్లు, ఎస్పీలు కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే. ప్రభుత్వాన్ని నడిపించడం, విధానాలు రూపొందించడం, అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేయడం సీఎం బాధ్యత. ముఖ్యమంత్రి బాధ్యత. కలెక్టర్లు, ఎస్పీలు సరిగ్గా పని చేయడం లేదంటే దాని అర్థం ముఖ్యమంత్రి పనితీరు బాగోలేదన్నదే.
తన వైఫల్యాలను దాచుకునేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై నిందలు వేయడం అన్యాయం. ప్రజల ముందు మాత్రం మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు పత్తిత్తుల్లా, ప్రతివ్రత కబుర్లు చెబుతూ అధికారుల పనితీరును తప్పు బట్టడం చేతకాని పాలనకు నిదర్శనం. అధికారుల పనితీరు ప్రజలకు నచ్చలేదంటే, ప్రభుత్వ పనితీరు కూడా ప్రజలకు నచ్చనట్లేనన్న సత్యాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి.
ఈ మెడికల్ కాలేజీలను మొత్తం 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ 66 ఏళ్లలో మీరు, మీ లోకేష్, మీ పవన్ కళ్యాణ్, సత్యకుమార్ ఎవరు ఉంటారు? మేము కూడా అప్పటికి ఉండం కదా? అని ప్రశ్నించారు. ఎకరానికి రూపాయి అద్దెకు ప్రభుత్వ భూములను 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వారికి ఇవ్వడం అంటే అమ్మేయడమే. పీపీపీ ఆస్పత్రి బయట ‘ప్రభుత్వ ఆసుపత్రి’’ అని పెద్ద బోర్డు పెట్టి, కింద చిన్న అక్షరాల్లో ప్రైవేట్ వ్యక్తి పేరు రాస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే.
రాష్ట్రంలో ఉన్న మీ భూములను కూడా ఎకరా రూపాయి చొప్పున 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వండి. 66 ఏళ్ల తర్వాత మళ్లీ దేవాన్ష్ లేదా ఆయన కొడుక్కి అప్పగిస్తారు. చంద్రబాబుకు జ్వరం వస్తే ఆస్పత్రికి ఎందుకు వెళ్తున్నారు? మొన్న డాక్టర్లకు ఏం తెలుసు అని, ఏఐని అడగాలని చంద్రబాబు చెప్పడం కూడా అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. డాక్టర్లు ఇచ్చిన సమాచారంతోనే ఏఐ ఒక నాలెడ్జ్ హబ్‌గా, డేటా సెంటర్‌గా తయారవుతుందని, ఏఐ డాక్టర్ కాదని స్పష్టం చేశారు. జ్వరం వస్తే చంద్రబాబు కంప్యూటర్ ఎదుట కూర్చొని ఏఐని అడుగుతారా? లేక వెంటనే నాగార్జున ఆసుపత్రికి పరుగెత్తుకెళ్తారా? అని ప్రశ్నించారు.
2015లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్‌కు ఇచ్చారు కదా అని గుర్తు చేస్తూ, మీరు ఒక్కరోజైనా ఆ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారా? ఒక్క ఇంజక్షన్ అయినా వేయించుకున్నారా? ఒక్క మందు బిళ్ల అయినా తీసుకున్నారా? ప్రైవేట్ ఆసుపత్రులకు పేదలు ఎలా వెళ్తారు. పీపీపీ వల్ల మెడికల్ సీట్లు పెరుగుతాయి, ఫీజులు అలాగే ఉంటాయని జర్నలిస్టులను చంద్రబాబు దబాయిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థికి ఏడాదికి కేవలం రూ.15 వేలే ఫీజు ఉంటుంది, స్కానింగ్, ఎంఆర్ఐ, రక్త పరీక్షలు అన్నీ ఉచితంగా లభిస్తాయి. ప్రైవేట్ నిర్వహణలో ఇవన్నీ ఉచితంగా ఇస్తారా. డయాలసిస్, చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితం కదా?
చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ కలిసి నడుపుతున్న బసవతారకం ఆసుపత్రిలో 70 శాతం ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం వద్ద భూమి తీసుకున్నప్పుడు అంగీకరించారని గుర్తు చేశారు. కానీ ఆ ఆసుపత్రిలో ఒక్క పేదవాడికైనా ఉచితంగా చికిత్స ఇచ్చారా? పేదలు ఆ ఆసుపత్రికి వెళ్లగలుగుతున్నారా? అని ప్రశ్నించారు. అక్కడ పేదల్ని పట్టించుకునే పరిస్థితే లేదని విమర్శించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలను నిర్లక్ష్యం చేసి హోం శాఖలో జోక్యం చేసుకుంటూ మాటలకే పరిమితమయ్యారు. భీమవరం, పిఠాపురం వంటి ప్రాంతాల్లో పేకాట, ల్యాడ్ సెటిల్మెంట్లు, రాజకీయ జోక్యంతో పోలీసు–రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దళితులపై కుల వివక్ష, జర్నలిస్టులపై దాడులు జరిగినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం చేతకాని పాలనకు స్పష్టమైన నిదర్శనం.
ఎయిమ్స్‌ను ఎందుకు పీపీపీ పద్ధతిలో ఇవ్వడం లేదు?:
లోకేష్ ఇచ్చిన కాగితం చదవడానికి హడావిడిగా వచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, బీజేపీ ప్రతినిధిలా కాకుండా చంద్రబాబు–లోకేష్ ఆదేశాలతో పని చేసే వ్యక్తిగా మారిపోయారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నది తానేనని బహిరంగంగా చెప్పుకుంటూ, ప్రశ్నించే వారిని బెదిరించడం ఆయన అవివేకానికి నిదర్శనం. పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం దొరుకుతుందనడం అబద్ధం. ఉచిత, నాణ్యమైన చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధ్యం. ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీకి ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని మంత్రి, అధికార మదంతో మాట్లాడుతున్నారు.
సుష్మా స్వరాజ్ ఏమన్నారో తెలుసా?:
జగన్‌పై కేసుల విషయాన్ని వక్రీకరిస్తూ మాట్లాడే నైతిక హక్కు సత్యకుమార్‌కు లేదు. ఎందుకంటే ఆయన పని చేస్తున్నది సుమారు 150 కేసులు ఎదుర్కొన్న చంద్రబాబునాయుడు చేతి కింద. చంద్రబాబు పలు కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు రాలేదా అన్నది రాష్ట్ర ప్రజలకు తెలిసిన వాస్తవం. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేత సుష్మాస్వరాజ్ స్వయంగా, వైయస్ జగన్‌పై కేసులు రాజకీయ ప్రతీకారమేనని స్పష్టం చేశారు. అధికార మదంతో మాట్లాడడం సత్యకుమార్ అవివేకానికి నిదర్శనం అని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.