( ఇంద్రాణి)
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకురాలు బృందా కారత్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక లేఖ రాశారు. ఆమె రాసిన లేఖ; దేశంలో చాలాకాలం చర్చనీయాంశం అయిన ‘దాద్రి లించింగ్’ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముద్దాయిల పైన కేసును ఉపసంహరించుకొంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయటానికి రాష్ట్రప్రభుత్వానికి గవర్నర్ అనుమతి ఇవ్వటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాశారు.
కేసు పూర్వాపరాలలోకి వెళితే, ఉత్తరప్రదేశ్ లోని బిషాడ గ్రామంలో మహమ్మద్ అక్లాక్ కుటుంబం గోవు మాంసం తిన్నారు అనే వదంతి ఆధారంగా గ్రామస్థులు వారి ఇంటిపై దాడి చేసి తండ్రీకొడుకులను ఇంట్లోనుండి బయటకు లాగి అందరూ కలసి కొట్టటంవలన తండ్రి మరణించగా కుమారుడు తీవ్రమైన గాయాలపాలయ్యాడు. కుమారుడు తరువాత శాశ్వతంగా అవిటివాడయ్యాడు.
ఈ సంఘటన జరిగింది 2015 సెప్టెంబరులో. అప్పట్లో ఈ సంఘటన దేశంలోని ప్రసారమాధ్యమాలలోనే కాక, అంతర్జాతీయ ప్రసారమాధ్యమాలలో కూడా ప్రముఖంగా చోటు చేసుకున్నది. దేశంలో మతసామరస్యంపైన అనేక సందేహాలు వెల్లువెత్తాయి. సంఘటన జరిగిన తరువాత పోలీసులు విచారణ జరిపి ముందు పద్దెనిమిది మందిపైన కేసు నమోదు చేశారు. తరువాత పదిమందిపైన నేరారోపణపత్రం దాఖలు చేశారు. వారిలో స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుడి కుమారుడు కూడా ఉన్నాడు.
సంఘటన జరిగిన తరువాత కేసు అనేక మలుపులు తిరిగింది. పోలీసు విచారణలోనూ, వెటర్నరీ రిపోర్ట్ ప్రకారం దాడి జరిగిన వారింట్లో ఉన్నది బీఫ్ కాదని, మీట్ అని తేలింది. కొద్దిరోజుల తరువాత ముద్దాయిల అభ్యర్థన మేరకు మధుర ల్యాబ్ కు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించగా, వారి రిపోర్టులో బీఫ్ అని ఇచ్చారు. సెకండ్ రిపోర్టును ఆధారం చేసుకుని మరణించిన అక్లాక్ కుటుంబంపై గోవధ నిషేధచట్టం క్రింద కేసు నమోదు చేశారు. ఆ కేసు కూడా పెండింగులో ఉన్నది.
బాధిత కుటుంబం స్వంత ఊరు వదిలిపెట్టి ఢిల్లీకి వలసపోయే పరిస్థితి కల్పించారు గ్రామస్తులు. కేసు విచారణ దశకు వచ్చింది. ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించి సెకండ్ రిపోర్టును ఆధారంగా చూపిస్తూ, బీఫ్ ను చూసిన ఆవేశంలో జరిగిన నేరంగా పరిగణించాలి అని కోరగా, హత్యా నేరానికి, టైప్ ఆఫ్ మీట్ కు సంబంధం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
ఈదశలో వుండగా ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం హత్యకేసులో ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకుంటూ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 321 క్రింద కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందుకు గవర్నర్ అనుమతి ఇవ్వటం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాబట్టి పరిశీలించవలసిందిగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ బృందా కారత్ లేఖ రాశారు. ఈ కేసు ఉపసంహరించుకోవటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పత్రంలోని అంశాలు ఆశ్చర్యం గొలిపే విధంగా ఉన్నాయి.
ఈ కేసు విచారణ సమాజంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నది అనేది మొదటి కారణంగా పేర్కొన్నారు. ఇది చాలా విచిత్రమైన కారణం. సంఘటన జరిగిన తరువాత చుట్టుప్రక్కల కర్ఫ్యూ విధించి, మతప్రాతిపదికన ఎవరూ ఎటువంటి ఉపన్యాసాలు ఇవ్వకూడదు అని రాష్ట్రప్రభుత్వం నిబంధన విధించింది.
అయినా బీజేపీ స్థానిక నాయకుడు సంగీత్ సోమ్ ఒక మతానికి చెందిన వారిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు గానూ గౌతమ బుద్దా జిల్లాకోర్టు వారి శిక్ష ప్రకారం 800 రూపాయలు జరిమానా కట్టవలసి వచ్చింది. కానీ రాష్ట్రప్రభుత్వం కేసు విచారణ కొనసాగితే సామాజిక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది అనే సాకు చూపిస్తున్నది.
ఇక ప్రభుత్వం వారు పేర్కొన్న రెండు మూడు కారణాలు పూర్తిగా న్యాయమూర్తులు మాత్రమే నిర్ణయించవలసిన విషయాలు. రెండవ కారణం విచారణలో సాక్షులు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మూడవ కారణం ముద్దాయిలు తీసుకొని వెళ్లిన ఆయుధాలు మారణాయుధాలు కావని. ప్రతి హత్యానేరంలోనూ ఈ తరహా వాదనలు వుండనే వుంటాయి.
ప్రతి కేసులోనూ ప్రభుత్వమే విచారించి దోషులను నిర్ణయిస్తే ఇక న్యాయస్థానాల అవసరం వుండనే వుండదు. సాక్షులు పోలీసుల ముందు చెప్పే విషయానికి ప్రాధాన్యత వుండదు. న్యాయస్థానం ముందు వారు ఏం చెబుతారో అనే సంకోచం ప్రభుత్వానికి ముందే కలగటం అనవసరం.
ముఖ్యంగా 2015 లో జరిగిన ప్రస్తుత కేసులో 2022 లో విచారణ మొదలైనది. సాక్షుల విచారణ ముగిసింది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కోర్టుకు సమర్పించటం జరిగింది. న్యాయస్థానం డిసెంబర్ 18వ తేదీ తుది వాదనలకు సమయాన్ని నిర్ణయించింది. ఈదశలో న్యాయస్థానంలో జరిగిన విచారణ ఆధారంగా సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని, న్యాయస్థానంలో సమర్పించబడిన ఆయుధాల ఆధారంగా కోర్టు చెప్పవలసిన తీర్పును ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది.?
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనిస్తే, న్యాయస్థానంలో తీర్పు ముద్దాయిలకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం కనిపిస్తున్నది కాబట్టి, వారిని కాపాడే దురుద్దేశంతోనే ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకోవటానికి పిటిషన్ వేసింది అని స్పష్టమవుతున్నది. న్యాయస్థానం తీర్పు చెప్పబోతున్న దశలో, అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించిన కేసులో, ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం, భారతదేశంలో మత సామరస్యం ఎంత దెబ్బతిన్నదో ప్రపంచానికి స్పష్టం చేసినట్లు అవుతున్నది.
బాధితుడు తప్పు చేశాడనే విషయం తెలిసినప్పుడు పోలీసుస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే హక్కు వ్యక్తులకు వుండదు. ఎవరికి వారు ఇదేరకంగా చట్టాన్ని తామే అమలు పరచుకుంటూ వెళితే దేశంలో ఎవరి ప్రాణానికీ రక్షణ ఉండదు. భావోద్వేగాల ఆధారంగా సమాజం చీలిపోకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇది ఒక సున్నితమైన సమస్యే. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన సున్నితమైన సమస్య జటిలంగా మారే అవకాశం ఉన్నది.
ఒక సామాజికవర్గం భారతదేశంలో తమకు రక్షణ లేదు అని భావించే పరిస్థితి ఉండకూడదు. వసుధైక కుటుంబం అనే పదాన్ని ఎంత అందంగా, గొప్పగా పలుకుతామో, ఆచరణలో అంత అర్థవంతంగా, బలంగా చూపించగలగాలి. ప్రపంచంలో ఇండోనేషియా, పాకిస్తాన్ తరువాత అత్యంత ఎక్కువగా ముస్లిం జనాభా ఉన్న దేశం భారతదేశం. ముస్లిం జనాభా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న నాలుగు దేశాలలో మూడు భారత ఉపఖండంలోనే ఉన్నాయి.
దేశంలో మన ఇరుగిళ్లు పొరుగిల్లే కాకుండా మన ఇరుగు పొరుగు దేశాలు కూడా మత సామరస్యంతో జీవించవలసిన అవసరాన్ని సూచిస్తున్నాయి. చట్టపరంగా ఎవరు తప్పు చేసినా కులమతాలకు అతీతంగా శిక్షార్హులే. ఈకేసు మతాలకు సంబంధించిన కేసుగా పరిగణించ కూడదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతను విస్మరించటమే కాదు, న్యాయవ్యవస్థను సవాల్ చేస్తూ అవమానించినట్లుగా ఉన్నది.
తీర్పు చెప్పే అధికారం న్యాయస్థానికే ఉన్నప్పటికీ, దాని నోరు కుట్టెయ్యగల అధికారం చట్టసభలకు ఉన్నది అనే సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతుంది. ఇదే కొనసాగితే, రాజకియవ్యవస్థ చెలరేగిపోయే ప్రమాదం ఉన్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే దేశ సర్వోన్నత న్యాయస్థానం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 321 ప్రకారం కేసులు ఉపసంహరించుకోవటంపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి అనేక నిబంధనలు విధిస్తూ తీర్పులు ఇచ్చింది.
సుప్రీమ్ కోర్టు నిర్ధారించిన మార్గదర్శకాలన్నింటినీ తోసిరాజని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే, ఈ విషయంపై చర్చ మరింత పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయపోరాటం కొనసాగిస్తామని బాధిత కుటుంబం ఇప్పటికే ప్రకటించింది. లౌకికరాజ్యంలో జరిగే ఇటువంటి విషయాలు, అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశాన్ని తలదించుకునేలా చేస్తాయి. అటువంటి పరిస్థితి మోదీజీకి రాకుండా చూసే బాధ్యత యోగి చేతుల్లోనే ఉన్నది.