అయోధ్య రామ నగరి కేంద్రంగా ప్రపంచ స్థాయి కేన్సర్ ఆస్పత్రి రానుంది. నమో క్యాన్సర్ ఫౌండేషన్ నాయకత్వంలో, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సహకారంతో ఈ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. ఈ ఆస్పత్రి 6 నుంచి 8 ఎకరాల్లో నిర్మించనున్నారు. కేన్సర్ నివారణ చికిత్సను అత్యంత తక్కువ ధరకే అందించనున్నారు.
ఈ ఆస్పత్రి నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యంత అధునాతన చికిత్సను, అత్యంత సరసమైన ధరలోనే అందివ్వాలని ట్రస్ట్ వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ 6 ఎకరాల భూమిని అయోధ్య రాజ కుటుంబం ఉచితంగా ఇవ్వనుంది.
అయోధ్యలో ఈ కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం పూర్తైతే, అయోధ్య, సమీప జిల్లాల నుంచి కేన్సర్ రోగులు చికిత్స నిమిత్తం లక్నో, ఢిల్లీ, ముంబైకి వెళ్లాల్సిన అవసరం వుండదని, రవాణా సమయం, ఖర్చు కూడా తగ్గనుంది.అలాగే రోగులకు మెరుగైన వైద్యం, తక్కువ ధరలకే లభించనుంది.
అయోధ్య నగరం ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. ఈ కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం పూర్తై, అందుబాటులోకి వస్తే, ప్రజా సేవలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా కూడా అవతరించనుంది.
అయితే అయోధ్యలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన ‘‘సూర్యకుండ్’’ ప్రాంతంలో ఈ కేన్సర్ ఆస్పత్రిని నిర్మించనున్నారు.
అలాగే దీనికి రాజా విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా పేరును పెట్టాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అయోధ్య రాజు యతీంద్ర మిశ్రా ఈ కార్యక్రమానికి తన పూర్తి మద్దతును అందించారు, ఆసుపత్రి నిర్మాణం కోసం 6-8 ఎకరాల భూమిని అందించడానికి అంగీకరించారు. ఇదో చారిత్రాత్మక చొరవ అని అభివర్ణిస్తూ… దీని ద్వారా చాలా మందికి సౌలభ్యం, ప్రయోజనం చేకూరుతుందన్నారు.
దీనిపై రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ… భారతదేశం అంతటా నాణ్యమైన క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలనే దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా దార్శనికత నుండి ఈ ప్రాజెక్ట్ ఆలోచన ప్రేరణ పొందిందని వెల్లడించారు. రోగులు చికిత్స నిమిత్తం పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేని వ్యవస్థను రూపొందించాలని టాటా భావించేవారని, వారి కలను సాకారం చేసే దిశగా ఇదో ముందడుగు అని మిశ్రా పేర్కొన్నారు.