– పరీక్షల నిర్వహణ లో వార్షిక క్యాలండర్ తప్పని సరి
– తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తోంది
– రిజర్వేషన్ లు సంఖ్యలకే కాదు.. వాస్తవిక ఫలితాలు ఇచ్చేలా చూడాలి
– పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్లు, కమిషన్ సభ్యులు, నిపుణులు, అధికారుల రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. న్యాయమైన, పారదర్శకమైన, సమగ్ర నియామక విధానాల ద్వారానే ప్రజాసేవలో ప్రతిభకు సరైన స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు.
పరీక్షల నిర్వహణలో వార్షిక క్యాలెండర్ తప్పనిసరిగా ఉండాలని, దానికి కట్టుబడి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల్లో జాప్యం వల్ల యువతలో నిరాశ పెరుగుతోందని, అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికతో పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్లపై ఉందన్నారు. వార్షిక క్యాలెండర్ అమలు చేయడం ద్వారా వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తోంది కమిషన్ చైర్మన్ , సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినదిస్తున్నాం అన్నారు.
పారదర్శకతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ప్రాణమని ఆయన అన్నారు. ప్రశ్నాపత్రాల తయారీ నుంచి తుది ఎంపిక వరకు ప్రతి దశ స్పష్టంగా, సందేహాలకు తావులేకుండా ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి రియల్‌టైమ్ సమాచారం అందించాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందడమే కమిషన్ల ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ప్రశ్నాపత్రాల లీకేజ్‌లు ప్రజాసేవ విలువలకు విరుద్ధమని, ఇవి అభ్యర్థుల కలలను చిదిమేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలను అడ్డుకునేందుకు ఆధునిక భద్రతా వ్యవస్థలు అమలు చేయాలని, సిబ్బందికి నైతిక విలువలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. తప్పిదాలు చోటుచేసుకుంటే వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంటర్వ్యూ లు కేవలం జ్ఞాన పరీక్షలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వం, నైతికత, నిర్ణయ సామర్థ్యాన్ని అంచనా వేసేలా ఉండాలని సూచించారు. పక్షపాతానికి తావులేకుండా, న్యాయంగా ఇంటర్వ్యూలు నిర్వహించాలన్నారు. విభిన్న నేపథ్యాల నిపుణులతో ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో కమిషన్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రిజర్వేషన్లు కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా వాస్తవికంగా ఫలితాలు ఇచ్చేలా చూడాలన్నారు. అర్హులైన అభ్యర్థులు అవకాశాలు పొందేలా కోచింగ్, సడలింపులు, పర్యవేక్షణ వ్యవస్థలు ఉండాలని సూచించారు.
నియామక ప్రక్రియల్లో న్యాయపరమైన వివాదాలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. స్పష్టమైన నిబంధనలు, ముందస్తు సమాచారం ఇవ్వడం ద్వారా లిటిగేషన్‌ను తగ్గించవచ్చని చెప్పారు. కోర్టుల తీర్పుల నుంచి పాఠాలు నేర్చుకొని వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థలని, రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. స్వతంత్రతను సద్వినియోగం చేసుకొని సంస్కరణలకు నాయకత్వం వహించాలని సూచించారు.
ఈ సదస్సు చర్చలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవ్వాలని కోరారు. విశ్వాసాన్ని పునర్నిర్మించి, ప్రతిభకు సమానత్వంతో అవకాశం కల్పిస్తూ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లను నిజాయితీకి ప్రతీకగా నిలపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు మనం ఎంపిక చేసే అధికారులపై ఆధారపడి ఉందని, కాబట్టి నియామకాలు న్యాయంగా, పారదర్శకంగా జరగాలని ఆయన అన్నారు.