– రామరాజ్యం మోదీతోనే సాధ్యం
– తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావలసిందే
– మోదీ పాలన చూసే బీజేపీలో చేరానన్న ఆమని
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రముఖ సినీనటి ఆమని బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా, ఈ సందర్భంగా రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా స్వాగతించారు. అదేవిధంగా ఆమె సహచరురాలు, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్, నంది అవార్డు గ్రహీత శోభలత కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ , పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ , బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ….. శోభలత సినీ ఇండస్ట్రీలో మహిళా మేకప్ ఆర్టిస్టులకు మార్గదర్శకులు. సినీరంగంలో మహిళలకు మేకప్ ఉమెన్‌గా పనిచేసే అవకాశం లేకపోయిన సమయంలో, ఆమె కోర్టును ఆశ్రయించి ప్రత్యక్షంగా న్యాయపోరాటం చేశారు. ఆమె పోరాటం ఫలితంగా సినీ ఇండస్ట్రీలో మహిళలు మేకప్ ఆర్టిస్టులుగా పనిచేయవచ్చనే నిర్ణయం తీసుకోబడింది. మహిళల హక్కుల కోసం పోరాడిన ఆమె కృషి అభినందనీయం. అలాంటి ధైర్యవంతురాలైన మేకప్ ఆర్టిస్ట్, నంది అవార్డు గ్రహీత శోభలత గారు భారతీయ జనతా పార్టీలో చేరడం గర్వకారణం.
ఆమని తన ప్రతిభ, వైవిధ్యం, గౌరవప్రదమైన తెరపై ఉనికితో తెలుగు సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ భారతీయ నటి. 1992లో విడుదలైన జంబలకిడి పంబ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి, ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఆమెను ఇంటింటా తెలిసిన పేరుగా నిలిపింది. ఆమని తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలలో ప్రముఖ నటులతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల మనసుల్లో విశేషమైన స్థానం సంపాదించారు. అదేవిధంగా వివిధ టీవీ సీరియల్స్ లోనూ నటిస్తున్నారు.
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనతో ఆకర్షితులై.. తాము కూడా దేశానికి సేవ చేయాలనే భావనతో ఆమని , శోభలత బిజెపిలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి సుమారు వెయ్యి మంది సర్పంచులు, 1200 మందికి పైగా ఉపసర్పంచులు, అలాగే పదివేల మందికి పైగా వార్డు మెంబర్లు ప్రజల మద్దతుతో గెలుపొందారు.
గెలిచిన ప్రజాప్రతినిధుల్లో కొంతమందిని అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరించే ప్రయత్నాలు చేసినా, తాము బీజేపీలోనే కొనసాగుతామని సర్పంచులు స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇది బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. గతంలో బీజేపీ నగరాలకు మాత్రమే పరిమితమైందని విమర్శించిన వారి కళ్లు తెరుచుకునేలా, గ్రామీణ ప్రాంతాల్లోనూ బీజేపీ బలం పెరుగుతోందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో వందలాది మంది బీజేపీ సర్పంచులు గెలుపొందడం గమనార్హం. దేశవ్యాప్తంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయి. అదే విధంగా తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలన్నా, అవినీతి అంతం కావాలన్నా, అధికార దుర్వినియోగానికి చెక్ పెట్టాలన్నా, ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమగ్రంగా, పారదర్శకంగా అందాలన్నా డబుల్ ఇంజిన్ సర్కారు అత్యవసరం.
రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీని ఆదరించి, అత్యధిక సంఖ్యలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లను గెలిపించిన తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
సినీ నటి ఆమని మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మార్గదర్శకత్వంలో, ఇటీవల నియమితులైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ దేశం కోసం అమలు చేస్తున్న సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సుపరిపాలన, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు-దేశ భద్రత నుంచి అభివృద్ధి వరకు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశాన్ని నేడు ప్రపంచంలో గౌరవప్రదమైన స్థాయికి తీసుకెళ్లాయి.
ఈ రోజు మనం విదేశాలకు వెళ్లినప్పుడు “వీ ఆర్ ఇండియన్స్” అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే, దానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వమే. దేశ భద్రతకు సంబంధించిన అనేక కీలక సందర్భాల్లో, కాశ్మీర్ అంశంలో అయినా, దేశ గౌరవాన్ని కాపాడే నిర్ణయాల్లో అయినా, ప్రధాని మోదీ చూపించిన ధైర్యం, స్పష్టమైన నిర్ణయాలు ఎంతో ప్రభావం చూపాయి.
అలాంటి గొప్ప నాయకత్వానికి ప్రేరణ పొంది, సుపరిపాలనతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో, దేశం కోసం, సమాజం కోసం మంచి పనులు చేయాలనే తపనతోనే నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. అలాగే, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రధాని మోదీ చేస్తున్న కృషి కూడా ఎంతో ప్రేరణనిచ్చింది. ఆ విలువలను కాపాడుతూ, ముందుకు తీసుకెళ్లాలనే భావనతోనే నేను ఈ పార్టీలో చేరాను. ఈ రోజు నన్ను ఇంత సాదరంగా ఆహ్వానించిన పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.