– ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారులుగా ఉండాలి
– ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో విద్యా, సంక్షేమ రంగాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఖమ్మం: ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం అర్హులైన లబ్ధిదారునికి చేరాల్సిందేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని అధికారులు, ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, అయితే నిర్లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు.
ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే ప్రభుత్వ జీతాలు వస్తున్నాయని, అందుకే ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని అన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే మానవ సంపద సృష్టి కీలకమని తెలిపారు. అందుకే విద్యారంగంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్,ల్ నిర్మాణం, ప్రభుత్వ, జిల్లా పరిషత్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
సంక్షేమ పథకాలకు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని, ఆలస్యం జరిగితే బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
గిరిజన రైతుల అభివృద్ధి కోసం ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్, పంపుసెట్లు, డ్రిప్, ప్లాంటేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. ప్రజా సంక్షేమమే ప్రతి నిర్ణయానికి కేంద్రబిందువు అని డిప్యూటీ సీఎం అన్నారు.