– వైయస్సార్సీపీపై బురదలో సీన్ రివర్స్
– కదిరి ఘటనను వక్రీకరించి పార్టీపై నింద వేశారు
– అసలు అజయ్‌కి వైయస్ఆర్సీపీతో సంబంధం లేదు
– అజయ్ జనసేన కార్యకర్త అని ఆ పార్టీ ఎంపీటీసీ ధృవీకరణ
– పోలీసులపై ఎస్సీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టరు?
– పవన్ కళ్యాణ్ రౌడీ భాష ప్రజలు అంగీకరించరు
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి
తాడేపల్లి: వైయస్సార్సీపీని అప్రతిష్టపాలు చేయాలనుకున్న మంత్రి నారా లోకేష్ ప్రయత్నం బూమరాంగ్ అయిందని, పార్టీపై బురద చల్లే ప్రయత్నంలో సీన్ రివర్స్ అయిందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కదిరి ఘటనలో దళిత యువకుడు అజయ్‌ని వైయస్సార్సీపీకి అంటగట్టి బురద చల్లాలనుకున్నారని, అసలు అజయ్ మా పార్టీకి చెందిన వ్యక్తి కాదని, అతను జనసేన కార్యకర్త అని ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యుడే ధ్రువీకరించాడని ఆయన వెల్లడించారు.
దళిత యువకుడు అజయ్‌ను దారుణంగా హింసించి, నడిరోడ్డుపై నడిపించిన పోలీసులపై ప్రభుత్వం ఎందుకు ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసు పెట్టడం లేదని సతీష్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. లోకేష్, చంద్రబాబును పూర్తిగా పక్కన పెట్టి రెడ్‌బుక్ పాలన కొనసాగిస్తున్నారు. మంగళవారం కదిరిలో జరిగిన సంఘటనను పరిశీలిస్తే ఈ అరాచక పాలన ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా కనిపిస్తోంది.
అజయ్ అనే దళిత యువకుడికి వైయస్సార్సీపీతో ఎలాంటి సంబంధం లేదు. శ్రీసత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గం, తనకల్లు మండలం, ముత్యాలవారిపల్లెలో రెండు కుటుంబాల మధ్య తగాదాలో జరిగిన చిన్న ఘర్షణలో తోపులాట కారణంగా ఒక గర్భిణి కిందపడితే, దాన్ని వక్రీకరించి వైయస్సార్సీపీ కార్యకర్తలంతా అరాచకం చేస్తున్నట్లు, గర్భిణిపై దౌర్జన్యం చేసినట్లు చిత్రీకరించారు.
ఆ యువకుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు ఏమిటో ముందుగా పరిశీలించాలి. ఏదో ఒక చిన్న సాకు దొరికిందని వైయస్సార్సీపీపై బురద జల్లేందుకు చేసిన ప్రయత్నం చివరకు మీపైనే బూమరాంగ్ అయ్యింది. అజయ్ జనసేనకు సంబంధించిన వ్యక్తేనని, ఆ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అజయ్ పవన్ కళ్యాణ్ అభిమాని అని, తాను జనసేన నుంచి ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు తన గెలుపునకు అజయ్ ఎంతో సహకరించాడని అమర్ మీడియాతో వెల్లడించారు.
కదిరిలో ఎస్సీ యువకుడిపై దాడి చేసి నడిరోడ్డుపై నడిపించిన ఘటనలో పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టకూడదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒక ఫిర్యాదు వస్తే, ఏ మాత్రం వాస్తవాలు విచారించకుండా ఈ తరహా చర్యలకు పాల్పడటం చట్ట విరుద్ధం. ముత్యాలవారిపల్లెలో అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. దగ్గరి బంధువులే. వారి మధ్య ఉన్న కుటుంబ తగాదాల వల్ల ఘర్షణ జరిగితే దాన్ని వైయస్సార్సీపీకి ఆపాదించడం ఎంతవరకు సమంజసం?
పవన్‌గారూ… నోరు అదుపులో పెట్టుకోండి
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు మరోసారి చెబుతున్నాం. మా పార్టీ వారెవ్వరూ మీ గురించి మాట్లాడడం లేదు. కానీ మీరు మాత్రం ప్రతిరోజూ అనవసరంగా మామీద నోరు పారేసుకుంటున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతూ, విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విధంగా మమ్మల్ని రెచ్చగొడితే, మా పార్టీ నుంచి ఎవరైనా గట్టిగా స్పందిస్తే, దాన్ని రాజకీయం చేయాలని మీరు చూస్తున్నారు. అలా మీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మీరు ఇదంతా చేస్తున్నారు. కానీ, మీ కుట్ర నెరవేరదన్న విషయాన్ని గుర్తించండి.
.