– బాధితురాలినే నిందితురాలు చేసిన ప్రభుత్వం
– గుమ్మడి సంధ్యారాణి పీఏ వేధింపుల కేసులో బరితెగింపు
– మంత్రి సంధ్యారాణి డైరెక్షన్ లోనే పోలీసుల విచారణ
– ఇది ముమ్మాటీకీ అధికార దుర్వినియోగం
– అధికార పార్టీ కార్యకర్తల్లా పచ్చ చొక్కాలు వేసుకున్న ఖాకీలు
– పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలి
– వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆగ్రహం
విశాఖపట్నం: కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ శూన్యమని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… బాధితురాలినే నిందితురాలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గానికి పాల్పడిందని మండిపడ్డారు.
మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ వేధింపుల కేసులో బాధితురాలిని అరెస్టు చేయడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమని.. ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట అని ఆమె తేల్చి చెప్పారు. తనకు అన్యాయం జరిగిందని ఒంటరి మహిళ పోలీసుల్ని ఆశ్రయిస్తే… వారు మాత్రం మంత్రి సంధ్యారాణి డైరెక్షన్ లో విచారణ చేయడం ముమ్మాటీకీ అధికార దుర్వినియోగమేనని స్పష్టం చేశారు. అధికార పార్టీ కార్యకర్తల్లా పచ్చ చొక్కాలు వేసుకోవడం ద్వారా… పోలీసులు తమ వ్యవస్థ సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించారని మండిపడ్డారు.
మహిళల పాలిటి శాపంగా మారిన మంత్రి సంధ్యారాణి వ్యవహారంతో, కూటమి పాలనలో మహిళలకు రక్షణలేదన్న విషయం స్పష్టమైందన్నారు. ఇక మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజన్న సీఎం చంద్రబాబు, మహిళలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తమ కేబినెట్ సహచరి పీఏ వేధిస్తే ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు.
ఇప్పటికైనా బాధితుడుని అరెస్టు చేసి.. బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరిపి, నిందితుడుతో పాటు ఆతడికి సహకరించిన పోలీసులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిందితుడుని వదిలేసి బాధితురాలినే అరెస్టు చేయడం అత్యంత దారుణం, ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందనడానికి ఇదే నిదర్శనం. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్నవాళ్లు బాధితులకు అండగా నిలబడతారు, నిందితులను శిక్షిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. బాధితురాలినే తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, ఆమె పైనే తిరిగి కేసులు నమోదు చేసి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. నిందితుడు మాత్రం నిర్భయంగా, ధైర్యంగా నెల రోజుల నుంచే బయటే తిరుగుతున్నాడు.
నిందితుడు సాక్షాత్తూ స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి పీఏ గా పనిచేస్తున్నాడు. ఒక మహిళా అయి ఉండి కూడా మంత్రిగారు… ఒక బాధితురాలికి అండగా నిలబడాల్సింది పోయి తన పీఏను వెనుకేసుకుంటూ రావడం అత్యంత దురదృష్టకరం. ఈ కేసు విచారణలో పోలీసులు అడుగడుగునా మంత్రి సంధ్యారాణి డైరెక్షన్ లో పనిచేశారు.
ఒక మహిళగా, బాధ్యతగల మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉండాల్సిన సంధ్యారాణి మహిళల పాలిట శాపంగా మారారు. ఈ రాష్ట్రంలో మహిళా హోం మంత్రిగా ఉన్నా.. ఒక బీసీ మహిళా ప్రభుత్వ ఉద్యోగికి అన్యాయం జరుగింది. ఆమెపైనా అక్రమకేసులు పెట్టి జైల్లో పెట్టడం దారుణం.
మహిళలపై చేయి వేస్తే తాటతీస్తా, తోలు తీస్తా అంటూ పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. ముగ్గురు పిల్లలతో ఒక ఒంటరి బాధిత మహిళ తనకు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగుతున్నా.. మీరు ఎవరి తాట తీశారు? మీ అసమర్థ ప్రభుత్వంలో చివరకు బాధితురాలి తాట తీశారా? మీరు ఏం చేస్తున్నారు?
పోలీసులను ఇంత దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలకే ఉపయోగిస్తున్న పరిస్ధితి అనేక సందర్భాలలో కనిపిస్తోంది. తాజాగా కదిరిలో ఓ గర్భిణీపై దాడి చేశారని ఒక వ్యక్తిని అరెస్టు చేసి… విపరీతంగా వేధించారు. అతడిని వైయస్సార్సీపీ కార్యకర్తగా భావించి వేధిస్తే.. సదరు వ్యక్తి జనసేన కార్యకర్త అని తేలింది. వైయస్సార్సీపీ కార్యకర్తగా భావించి తక్షణమే అతడ్ని అరెస్టు చేసి, వేధించారు. ఇప్పుడు కాదని తేలడంతో మౌనంగా ఉన్నారు.