(సాయిధనుష్)
ఇటీవల ఒక విషయం యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. నెల రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మీడియా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఆయన చెప్పింది ఏమిటంటే—ప్రపంచంలో ఎన్నో దేశాలు అణు ఆయుధాలపై పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నాయి.
రష్యా ఇప్పటికే ఇందులో ముందుంది, చైనా గోప్యంగా ప్రయోగాలు చేస్తోంది, పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మాటలు బయటకు వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది—అమెరికా కూడా మళ్లీ అణు పరీక్షల వైపు వెళ్తుందా?
ఇప్పటికే హిరోషిమా, నాగసాకి అనుభవించిన భయానక ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయి. ఒక్క అణుబాంబే ఎంత విధ్వంసం సృష్టిస్తుందో ప్రపంచం చూసింది. అలాంటప్పుడు మళ్లీ పరీక్షలు ఎందుకు? అవసరం ఏమిటి?
ఇక్కడే మనిషి బుద్ధి ఎంత ప్రమాదకరంగా మారుతుందో అర్థమవుతుంది. భూమి నాశనమైపోయినా సరే—మా శక్తి, మా ఆధిపత్యం, మా డామినేషన్ ఉండాలి అన్న ఆలోచన కొందరి మైండ్‌సెట్‌లో ఇంకా బలంగా ఉంది.
ఇప్పుడు ఈ చర్చల మధ్యలో మరో పేరు మళ్లీ వినిపిస్తోంది—ప్రాజెక్ట్ సీల్ (Project Seal). ఇది 1944లో మొదలైన ఒక ప్రాజెక్ట్. అప్పట్లో లక్ష్యం ఏమిటంటే—సముద్ర అడుగున భారీ పేలుళ్లు సృష్టించి, కృత్రిమ సునామీలను తయారు చేయగలమా అనే పరిశోధన. అప్పట్లో ఇది ప్రయోగ దశలోనే ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ దీనిని రివైవ్ చేస్తున్నారనే వార్తలు కలవరపెడుతున్నాయి. కారణం ఒక్కటే—ఆధిపత్య పోరు.
బయటకు చూస్తే “మేమంతా మిత్రులం, శాంతి కావాలి” అంటారు. కానీ వెనుక నుంచి గోతులు తవ్వడం, కుట్రలు పన్నడం—ఇదే అంతర్జాతీయ రాజకీయాల అసలు స్వరూపం.
కొంతమంది చెబుతున్న కథలు వినిపించినప్పుడు మొదట నమ్మలేం. ఉదాహరణకు, 2004లో ఇండోనేషియాలో వచ్చిన సునామీ. అది సహజ విపత్తేనా? లేక ఏదైనా ప్రయోగ ఫలితమా? అప్పుడు ఇదంతా విన్నప్పుడు చాలామందిలాగే నేనూ నమ్మలేదు. కానీ ఇప్పుడు వస్తున్న చర్చలు చూస్తే, ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయో అర్థమవుతుంది.
ఇక రింగ్ ఆఫ్ ఫైర్ విషయానికి వస్తే—దాదాపు 40 వేల కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో 260కి పైగా అగ్ని పర్వతాలు ఉన్నాయి. జపాన్ లాంటి దేశాలు ఇక్కడే ఉన్నాయి. ఏ అగ్ని పర్వతం ఎప్పుడు పేలుతుందో చెప్పలేం. బయటకు చూస్తే ఇది సహజ ప్రక్రియ. కానీ కొందరు చెబుతున్నది ఏమిటంటే—దీని వెనుక మానవ జోక్యం, ప్రయోగాలు కూడా ఉండొచ్చని.
ఇంతకుముందు నందాదేవి పర్వతం వద్ద జరిగిన రేడియేషన్ చర్చలు గుర్తున్నాయి. చైనా మీద నిఘా కోసం అమెరికా అక్కడ ఏదో పరికరం పెట్టిందన్న కథలు అప్పట్లో వినిపించాయి. మంచు తుఫాన్ల వల్ల అది కప్పబడిపోయిందని, ఇప్పటికీ దాని పూర్తి వివరాలు బయటకు రాలేదని అనేక మంది చెప్పారు. ఇదంతా నిజమా కాదా పక్కన పెడితే—ఇలాంటి ఉదంతాలు అనుమానాలకు తావిస్తాయి.
ఇప్పుడు చెబుతున్న కొత్త ఆలోచన ఏమిటంటే—సముద్ర అడుగున అణు చార్జీలు లేదా భారీ పేలుడు పదార్థాలు అమర్చి, అవసరమైనప్పుడు పేల్చడం. అలా జరిగితే 10–12 మీటర్ల ఎత్తు సునామీ అలలు తీర ప్రాంత నగరాలను ముంచేయగలవు. ఇది కేవలం యుద్ధమే కాదు—ఇది ఎన్విరాన్మెంటల్ వార్ఫేర్.
ఒక దేశాన్ని ఓడించాలనే స్వార్థంతో సముద్ర జీవ వ్యవస్థను, ఎకోసిస్టమ్‌ను నాశనం చేయడం ఎంతటి నేరం?
వింత ఏమిటంటే—పర్యావరణం గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే దేశాలే ఇలాంటి ప్రయోగాలపై ఆలోచిస్తున్నాయన్న ఆరోపణలు. దీపావళి పటాకుల వల్ల కాలుష్యం అంటారు, కానీ వేలాది సముద్ర పరీక్షల వల్ల ఏమవుతుంది? చేపలు, జీవరాశులు, సముద్ర సమతుల్యత—ఇవన్నీ ఎవరు లెక్కలోకి తీసుకుంటారు?
ఇక రష్యా విషయానికి వస్తే—అమెరికా ఇలాంటి ప్లాన్లు వేస్తే, రష్యా చేతులు ముడుచుకుని కూర్చుంటుందా? వాళ్ల దగ్గర కూడా 1944 నాటి డేటా ఉంటుంది. ఒకవేళ అదే తరహా ప్రయోగాలు యూకే, ఫ్రాన్స్ వంటి దేశాల సముద్ర తీరాల్లో జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? రష్యా లాంటి పెద్ద దేశంతో ఆడుకోవడం అంత ఈజీ కాదు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం—అమెరికా ఎప్పుడూ యుద్ధాన్ని తన గడ్డపై జరగనివ్వదు. ఆయుధాలు సరఫరా చేస్తుంది, అప్పులు పెడుతుంది, చివరికి దేశాలను బానిసలుగా మార్చుతుంది. ఇదే వారి స్ట్రాటజీ అని విమర్శకులు అంటున్నారు.
మధ్యప్రాచ్యం, ఇజ్రాయెల్, గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్, రెడ్ సీ–మెడిటరేనియన్ ప్రాంతాలు—ఇవన్నీ కూడా ఈ గ్లోబల్ పవర్ గేమ్‌లో భాగమేనని కొందరి అభిప్రాయం.
ఇక భారత్ విషయానికి వస్తే—మన తీరప్రాంత నగరాలు, మన భద్రత? ఒకవేళ ఈ తరహా ఆయుధాలు పాకిస్తాన్ లాంటి దేశాల చేతుల్లో పడితే మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి?
ఇవన్నీ కలిపి చూస్తే, ఇది కేవలం ఒక దేశం విషయం కాదు. ఇది మానవజాతి భవిష్యత్తు గురించి.
ఇది నిజమా? కుట్రమా? లేక భయపెట్టే కథనా?
కనెక్టింగ్ ద డాట్స్ చేస్తే చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.