– ‘సింగిడి కలెక్టివ్’ బ్రాండ్‌ను ఆవిష్కరించిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా, పర్యావరణ హితమైన వస్త్రధారణను ప్రోత్సహిస్తూ రూపొందించిన ‘సింగిడి కలెక్టివ్’ (Singidi Collective) నూతన ఫ్యాషన్ బ్రాండ్‌ను నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఘనంగా ఆవిష్కరించారు.
తెలంగాణ నేల స్వభావానికి అద్దం పట్టేలా, పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో , మన సంప్రదాయ చేనేత నైపుణ్యంతో ఈ బ్రాండ్ రూపుదిద్దుకోవడం విశేషం.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణ గడ్డ ఎప్పుడూ కొత్తదనానికి వేదికగా నిలుస్తుంది. ఇక్కత్ నుండి గొల్లభామ చీరల వరకు మన నేతన్నల నైపుణ్యం అద్భుతం. ఈ వారసత్వాన్ని నేటి యువత అభిరుచులకు తగ్గట్టుగా మార్చుతూ, పర్యావరణానికి హాని లేని రీతిలో ‘సింగిడి కలెక్టివ్’ ముందడుగు వేయడం హర్షణీయం. వ్యాపారమే కాకుండా, మన నేతన్నలకు అండగా నిలుస్తూ, సామాజిక బాధ్యతతో యువత ఇటువంటి స్టార్టప్‌లను స్థాపించడం గర్వకారణం” అని కొనియాడారు.
సంప్రదాయం – ఆధునికత కలబోతగా ‘సింగిడి’:
తెలంగాణ మాండలికంలో ఇంద్రధనస్సును ‘సింగిడి’ అంటారు. పేరుకు తగ్గట్టే, రసాయనాలకు దూరంగా, కేవలం ఆకులు, వేళ్లు, పూల నుండి సేకరించిన సహజ రంగులను మాత్రమే ఇందులో వినియోగించడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ప్లాస్టిక్ రహిత, సేంద్రీయ పత్తితో రూపొందించిన ఈ వస్త్రాలు పర్యావరణ స్పృహ కలిగిన నేటి తరాన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.
సింగిడి కలెక్టివ్ ఫౌండర్ విశ్వ సారథి మాట్లాడుతూ, “కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా, మన మూలాలను గౌరవించేలా వస్త్రధారణ ఉండాలన్నదే మా లక్ష్యం. అంతరించిపోతున్న సహజ రంగుల అద్దకం విధానాలపై లోతైన పరిశోధన చేసి ఈ వస్త్రాలను రూపొందించాం. చేనేత రంగానికి ఎప్పుడూ అండగా ఉండే కేటీఆర్ మా ప్రయత్నాన్ని గుర్తించి ఆశీర్వదించడం మాకు కొండంత బలాన్నిచ్చింది” అని పేర్కొన్నారు.