ఏపీ సంతోష సూచీ ప్రయాణం గత ఎనిమిది ఏళ్లలో ఎన్నో భావోద్వేగాలను, మలుపులను చూసింది. 2017లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం, మధ్యలో ఒక పీడకల లాంటి అనిశ్చితిని ఎదుర్కొంది. నేడు 2024-25లో మళ్లీ అభివృద్ధి, ఆత్మవిశ్వాసం వైపు అడుగులు వేస్తోంది.
2017 లో ఆంధ్రప్రదేశ్ ఐక్యరాజ్యసమితి సహకారంతో చేపట్టిన సర్వేలో 5.368 స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా 74వ ర్యాంకు పొందిన దేశాల సరసన నిలిచింది. భారతదేశం 122వ స్థానంలో ఉన్నా, ఏపీ మాత్రం ఒక వెలుగు వెలిగింది. ‘విజన్ 2029’తో శ్రీకాకుళం వంటి జిల్లాలు కూడా గ్లోబల్ టాప్-40 దేశాలతో పోటీపడ్డాయి. ఆనాడు ఆంధ్ర అంటే అభివృద్ధికి, సంతోషానికి కేరాఫ్ అడ్రస్.
అయితే, దిష్టి తగిలిందో ఏమో.. రాజకీయ చదరంగంలో ప్రజలు తీసుకున్న నిర్ణయం ఊహించని ఫలితాలనిచ్చింది. “45 ఏళ్లకే పెన్షన్” అనే అందని ద్రాక్ష ఆశ, “పెన్షన్ల పెంపు” అనే అబద్ధపు ప్రచారాలు, “ఒక్క ఛాన్స్” అనే జాలి కలిసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాయి. 2019 తర్వాత అమరావతిపై అనిశ్చితి, నిలిచిపోయిన ప్రాజెక్టులతో ప్రజల నమ్మకం దెబ్బతింది. సంతోష సూచీలో అగ్రస్థానం నుండి అట్టడుగుకు పడిపోవడం ఏపీ చేసిన స్వయంకృతాపరాధంగా మిగిలిపోయింది. గుండెజారి గల్లంతు చేసుకుంది.
2024 ఎన్నికల్లో ప్రజలు తమ కోపాన్ని “పదకొండు” స్థానాలకే పరిమితం చేసి మోసపోయిన కోపాన్ని చల్లార్చుని తమ తప్పును దిద్దుకున్నారు. గాడిన పడి స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలతో అడుగులు వేస్తూ.. 2025 నాటికి ఏపీ 12.94% వృద్ధి రేటును నమోదు చేసింది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ డేటా సెంటర్లు వంటి రూ. 10.7 లక్షల కోట్ల పెట్టుబడులు యువతలో మళ్లీ ప్రాణం పోశాయి.
2025 ఇండియా జస్టిస్ రిపోర్టులో ఏపీ 2వ స్థానానికి చేరడం, పంచాయతీ రాజ్ వ్యవస్థలో 1వ స్థానం సాధించడం పాలనాపరమైన విజయాలకు నిదర్శనం. పెన్షన్ రూ. 4,000 కు పెంచడం, ‘తల్లికి వందనం’, 3 లక్షల గృహాల పూర్తి వంటి చర్యలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో సంతృప్తిని పెంచుతున్నాయి.
ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో సంతోషాలు విచ్చుకుంటున్నా, అడపాదడపా వినిపిస్తున్న “రఫ్ఫా రఫ్ఫా” వంటి హెచ్చరికలు, ఆ రాజకీయ భూతం ఇంకా పూర్తిగా భూస్థాపితం కాలేదనే చిన్న సంకోచం ప్రజల మనసుల్లో మిగిలే ఉంది. ఇవి మానసికమైన అంతరంగ మథన భయాలే అయినప్పటికీ, ఆందోళన కలగడం సహజం.
దేశ ప్రపంచ సంతోష సూచీలో 118వ స్థానానికి (2025) చేరడంలో ఏపీ పురోగతి కీలకంగా ఉంది. ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంతం పాట లెక్కన 2025 సంవత్సరం గతం కంటే ఎక్కువ సంతోషంతోనే ముగుస్తోంది. ఆంధ్రప్రదేశ్ హెపీనెస్ ఇండెక్స్ లో మళ్లీ మొదటి స్థానంలో నిలవాలని, ఆ దిశగా 2026 మరింత కలిసి రావాలని బలంగా కోరుకుందాం.