– వీధి రౌడీ భాష ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక అవమానకర అధ్యాయం
– సర్పంచ్‌లను కిరాయి సైన్యంగా భావిస్తున్నారా?
– బూతుల సామ్రాజ్యమా? గ్రామ స్వరాజ్యమా?
– ముఖ్యమంత్రిగా బాధ్యత మరిచి వీధి భాషతో పాలన
– రాజ్యాంగం నేర్పాల్సిన చోట రేవంత్ రెడ్డి ‘మటన్ షాప్ భాష’
భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యుడు డా. శ్రవణ్ దాసోజు ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషా సంస్కారం, పాలనా ధోరణి పట్ల భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యుడు డా. శ్రవణ్ దాసోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, తాగునీరు, నిరంతర విద్యుత్, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, మానవతా పథకాలతో కేసీఆర్ తెలంగాణను నిర్మించిన బిల్డర్ అయితే, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అమ్ముకుంటున్న బ్రోకర్ అని ఆయన స్పష్టం చేశారు.
కొడంగల్ వేదికగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ఉపయోగించిన అనాగరిక, బూతు, వీధి రౌడీ భాష తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక అవమానకర అధ్యాయంగా మిగిలిపోతుందని ఆయన అన్నారు.
గ్రామ స్వరాజ్యానికి పునాది అయిన పంచాయతీ వ్యవస్థకు నాయకత్వం వహించాల్సిన ముఖ్యమంత్రి, గ్రామ ప్రజాస్వామ్యానికి పాఠాలు చెప్పాల్సిన సందర్భంలో, బూతులు, బెదిరింపులు, హింసాత్మక పదజాలం ఉపయోగించడం రాష్ట్ర పాలన దిగజారుడుకు నిదర్శనమని డా. శ్రవణ్ దాసోజు వ్యాఖ్యానించారు. “ఇది గ్రామ స్వరాజ్యానికి మార్గదర్శకత్వమా? లేక బూతుల సామ్రాజ్యానికి శిక్షణా శిబిరమా?” అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.
73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీలకు కల్పించిన 29 అధికారాలు, నిధులు–విధులు–అధికారాల సమన్వయం, గ్రామాభివృద్ధి ప్రణాళికలు గురించి వివరించాల్సిన ముఖ్యమంత్రి, “తోలు తీస్తా… పేగులు తెంచుతా…” వంటి వీధి రౌడీ భాష వినిపించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. గ్రామానికి తొలి పౌరులైన సర్పంచ్‌లను మీరు ప్రజాసేవకులుగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగించే కిరాయి సైన్యంగా భావిస్తున్నారా? అని ఆయన నిలదీశారు.
కేటీఆర్ విదేశాల్లో కష్టపడి పనిచేసిన నేపథ్యాన్ని “బాత్రూంలు కడగడం, చిప్పలు కడగడం” అంటూ అవహేళన చేయడం ద్వారా, ముఖ్యమంత్రి శ్రమ గౌరవం అనే మూల విలువలపై దాడి చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి ఎదిగినవారికి శ్రమ విలువ తెలుస్తుందని, అడ్డదారుల్లో, బెదిరింపులు–బ్లాక్మేయిల్ల ద్వారా పైకి వచ్చినవారికి అది చిప్పలాగా మాత్రమే కనిపిస్తుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆంధ్రాలో చదివారని కేటీఆర్‌పై అసూయతో మాట్లాడే ముఖ్యమంత్రి, తన ఆంధ్రా అల్లుడి ఫార్మా కంపెనీల ప్రయోజనాల కోసం లగచర్లలోని అమాయక గిరిజన రైతుల భూములు లాక్కోవడం, వారిని జైళ్లకు పంపించడం ఏ నైతికత అని డా. శ్రవణ్ దాసోజు ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల కష్టార్జిత సొమ్ముతో తాతా–మనవడు మెస్సీ ఆటలు చూడటం, ప్రజాధనాన్ని ఇలా వ్యక్తిగత వినోదానికి ఖర్చు చేయడం నేరం కాదా? అని ఆయన నిలదీశారు.
రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ వేదికపై, పాఠశాల పిల్లల సమక్షంలో తెలంగాణను సాధించిన 75 ఏళ్ల కేసీఆర్ పై అత్యంత జుగుప్సాకరమైన భాష వాడటం మానసిక వికృతికి, రాజకీయ పతనానికి నిదర్శనం అని దాసోజు అన్నారు. పిల్లలకు ముఖ్యమంత్రి నేర్పాల్సింది దేశభక్తి, రాజ్యాంగ విలువలు, భవిష్యత్ దృష్టి; కానీ మీరు నేర్పింది దూషణ సంస్కారం మాత్రమేనని తీవ్రంగా విమర్శించారు.
ప్రశ్నిస్తే నేరమా? ఇదేనా ప్రజాస్వామ్య పాలన? అని ఆయన నిలదీశారు. కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయం ₹1.24 లక్షల నుంచి ₹3.17 లక్షలకు పెరిగిందని, GSDP ₹4 లక్షల కోట్ల నుంచి ₹15 లక్షల కోట్లకు చేరిందని, వ్యవసాయ ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు పెరిగిందని డా. శ్రవణ్ దాసోజు గుర్తు చేశారు. కేసీఆర్ ఒక్కసారి బయటకు వస్తే, మీ అరుపులు ప్రజల ఆక్రోశంలో కొట్టుకుపోతాయని అన్నారు.