– జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే ఒప్పు
– రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ జగన్ పై విమర్శలా ?
– రాజకీయ పార్టీగా మారిన ఈనాడును బహిష్కరిస్తున్నాం
– వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టీకరణ
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిస్మస్ సందర్భంగా తిరుపతిలో చేసిన వ్యాఖ్యల్ని వైఎస్సార్సీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు.
హైందవ సంప్రదాయంలో అమ్మవారికి బలులు ఇవ్వడం సహజమే. అమ్మవారికి మొక్కుకున్నప్పుడు, లేదా జాతరలలో లేదా అమ్మవారి మీద ఉన్న ప్రేమను అత్యధికంగా ప్రదర్శించడానికి, మొక్కులు తీర్చుకోవడానికి బలార్పణలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఎంచుకునే మార్గాలు ఈ బలిదానాలు. రాష్ట్రంలో జగన్ అభిమానులు రకరకాలుగా ఉంటారు, రాజకీయంగా, వ్యక్తిగతంగా, సిద్ధాంతపరంగా అభిమానించే ఉండే వాళ్లతో పాటు ఏ పార్టీకీ సంబంధం లేకుండా ఆయన ఏం చేసినా అభిమానించే వారు ఉంటారు.
తన నాయకుడి పుట్టినరోజు తన అభిమానాన్ని తన నాయకుడికి ప్రదర్శించడానికి ఆ అభిమాని ఎంచుకున్న మార్గం రక్తాభిషేకం. దాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇదేంటి, ఓ పుట్టినరోజున రక్తార్పణలు, బలులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కానీ ఆయన పుట్టినరోజున అభిమానులు ఇచ్చిన బలి అర్పణలు ఏంటో చూడాలి. (చంద్రబాబు, బాలకృష్ణ పుట్టినరోజుల సందర్భంగా రాష్ట్రంలో చేసిన రక్త తర్పణల వీడియోలు వ్రదర్శించారు) మేం ఏ రోజూ ఇలాంటి చర్యల్ని ఉన్మాదం కింద ఏరోజూ మాట్లాడలేదు.
క్రిస్మస్ సందర్భంగా గతంలో జగన్మోహన్ రెడ్డి పాస్టర్లందరికీ ఆర్ధిక సహాయం చేశారు. దాన్ని అప్పట్లో చంద్రబాబు తప్పుబట్టారు. ఇవాళ పరమత సహనం పాటించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవుల్ని అవమానించేలా వేడుకలు జరిపించారు. ఎవరికి భయపడుతున్నారో, ఎందుకు భయపడుతున్నారో ముఖ్యమంత్రికి తెలియదు.