– డెస్క్ జర్నలిస్టులు ఏం పాపం చేశారు?
– మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్: సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన సింగరేణి కార్మికుల సమస్యలపై సింగరేణి డైరెక్టర్ గౌతమ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ ఆర్థిక స్థితిని దెబ్బతీసేలా వ్యవహరిస్తూ, ప్రైవేటీకరణకు దారితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
సంస్థలో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని, ప్రభుత్వ సంస్థలైన డిస్కాంలు, జెన్కో నుంచి రూ.42 వేల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉండగా, వాటిని చెల్లించకపోవడం వల్ల సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని విమర్శించారు. ప్రభుత్వమే సింగరేణికి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే కార్మికుల జీతాలు, సంక్షేమంపై ప్రభావం పడుతుందని హరీశ్ రావు అన్నారు.
సింగరేణి నిధులతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లా..
కార్మికులు జీతాల కోసం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి నిధులతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన లియోనల్ మెస్సీ ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు రూ.100 కోట్ల సింగరేణి నిధులు ఉపయోగించారని ఆరోపించారు. కార్మికుల బోనస్ విషయంలోనూ తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.6,394 కోట్ల నికర లాభం సాధించినా, బోనస్ కోసం కేవలం రూ.2,360 కోట్లనే పరిగణించి 34 శాతం ఇవ్వడం ద్వారా కార్మికులను మోసం చేశారని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం లాభంపైనే బోనస్ ఇచ్చేవారని, ఇప్పుడు 50 శాతం కోత విధించారని ఆయన అన్నారు. ఇంకా, తెలంగాణలో పేదలకు సొంత ఇళ్లు కల్పించే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏమైందో తెలియడం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై విచారణ చేస్తామని.. అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హరీశ్ రావు హెచ్చరించారు.
డెస్క్ జర్నలిస్టులు ఏం పాపం చేశారు?
అక్రెడిటేషన్ కార్డుల విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు దిగారని హరీశ్ రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కల్పిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. తమ హక్కుల కోసం పోరాడుతున్న జర్నలిస్టులను అరెస్ట్ చేయించడం దుర్మార్గమని అన్నారు. వెంటనే అందరినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు 26 వేలకు పైగా అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చామని, రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, నేడు కాంగ్రెస్ సర్కారు వచ్చాక అక్రెడిటేషన్ కార్డులను ఏకంగా 10 వేలకు తగ్గించారని కామెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.252ను వెంటనే సవరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.