– సావిత్రీబాయి పూలే కు భారతరత్న కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎందుకు తీర్మానం చేయలేదు?
– మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినా, తెలుగు రాష్ట్రాల పాలకుల మౌనం సిగ్గుచేటు
– ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాల్సిన జయంతిని విస్మరించడం దారుణం
– విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సావిత్రీబాయి పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న బోడె రామచంద్రయాదవ్
విజయవాడ: కోట్లాది మంది ఆడబిడ్డల జీవితాల్లో అక్షరాల వెలుగు నింపిన జ్ఞానజ్యోతి, భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహాత్మ సావిత్రీబాయి పూలే కు “భారతరత్న” పురస్కారం ప్రకటించాలని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు.
సావిత్రీబాయి వంటి మహనీయురాలి జయంతిని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించకపోవడం, ఆమెకు దక్కాల్సిన అత్యున్నత గౌరవాన్ని అందించడంలో నిర్లక్ష్యం వహించడం చారిత్రక తప్పిదమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో “గురుచైతన్య ఉపాధ్యాయ సంఘం” ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సావిత్రీబాయి పూలె జయంతి ఉత్సవాలకు, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవానికి బోడె రామచంద్రయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి, పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…”గత సంవత్సరం ఇదే రోజున, బీసీవై పార్టీ ఆధ్వర్యంలో మేము చేసిన ‘సావిత్రీబాయి పూలెకు భారతరత్న ఇవ్వాలి’ అనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఒక చర్చను రేకెత్తించింది. మా పిలుపునకు స్పందించి, మహారాష్ట్ర ప్రభుత్వం తమ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ చైతన్యానికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.
కానీ, అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం కనీసం స్పందించలేదు. సావిత్రీబాయి స్ఫూర్తితో చదువుకుని, ఉన్నత స్థానాల్లో ఉన్న ఎందరో నాయకులు ఈ గడ్డపై ఉన్నప్పటికీ, ఆమెకు గౌరవం ఇవ్వాలన్న సోయి లేకపోవడం సిగ్గుచేటు” అని రామచంద్రయాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నిజానికి, ప్రభుత్వాలే ముందుండి సావిత్రీబాయి జయంతిని అధికారికంగా నిర్వహించాలి. పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి, ఆమె త్యాగాలను స్మరించుకోవాలి. కానీ, ఆ బాధ్యతను విస్మరించి, కొన్ని సంఘాలు, పార్టీలు నిర్వహిస్తుంటే కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం పాలకుల అహంకారానికి నిదర్శనం. ఈ నిర్లక్ష్యాన్ని బీసీవై పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది” అని ఆయన అన్నారు.
విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. “ఉపాధ్యాయులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. వారి హక్కుల కోసం, విద్యావ్యవస్థ పరిరక్షణ కోసం బీసీవై పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుంది. గురుచైతన్య ఉపాధ్యాయ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయం. వారికి, ఉపాధ్యాయ లోకానికి బీసీవై పార్టీ ఎల్లప్పుడూ అండగా, తోడుగా నిలుస్తుంది” అని రామచంద్రయాదవ్ భరోసా ఇచ్చారు.