– సజ్జనార్ ‘హైదరాబాదీ’ ట్వీట్ వైరల్
హైదరాబాద్: నిషేధిత చైనా మాంజా వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తనదైన శైలిలో స్పందించారు. సంక్రాంతి పండగ వేళ పతంగుల కోసం చైనా మాంజా వాడొద్దంటూ హైదరాబాదీ యాసలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా చైనా వస్తువుల గురించి మన దగ్గర ఒక సామెత ఉంది. ‘‘చలే తో చాంద్ తక్.. వర్నా షామ్ తక్’’ (ఉంటే చంద్రుడి దాకా.. లేదంటే సాయంత్రం దాకా) అని సరదాగా అనుకుంటాం. ఇదే సామెతను ప్రస్తావిస్తూ సజ్జనార్ గట్టి హెచ్చరిక జారీ చేశారు.
“మిగతా చైనా వస్తువుల సంగతి ఎలా ఉన్నా.. చైనా మాంజా మాత్రం అలా కాదు భాయ్! ఇది పక్కాగా ప్రాణాలకు గ్యారంటీగా ప్రమాదం తెస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
బైక్‌పై వెళ్లేటప్పుడు అనుకోకుండా మెడకు మాంజా చుట్టుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవాలంటూ ప్రమాద తీవ్రతను కళ్లకు కట్టారు.
సంక్రాంతి ఆనందం విషాదంగా మారకూడదంటే.. #SayNoToChineseManja అని పిలుపునిచ్చారు. గాజు పొడి అద్దిన మాంజా, నైలాన్ దారాలను విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.